'నేను పాడటం ఆపడం చాలా కష్టం'
'నేను పాడటం ఆపడం చాలా కష్టం'
Published Wed, Mar 15 2017 1:06 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
ముంబై :రియాల్టీ సింగర్ నహీద్ అఫ్రిన్ పై ముస్లిం మత గురువులు ఫత్వా జారీచేశారు. బహిరంగ వేదికలపై ముస్లిం బాలికలు పాటలు పాడటం ఇస్లాం విశ్వాసాలకు విరుద్దమంటూ 46 మంది మతగురువులు ఆమెకు వ్యతిరేకంగా ఈ ఆదేశాలు జారీచేశారు. అయితే దేశమంతా తన వెన్నంటే ఉందని, ముస్లిం మత బోధకుల ఫత్వాకు తాను భయపడేది లేదని అఫ్రిన్ స్పష్టంచేసింది. తనను పాడటం ఆపడం చాలా కష్టమని అఫ్రిన్ పేర్కొంది. అస్సాం ప్రభుత్వం సైతం ఆమెకు మద్దతుగా నిలిచింది. ఆమె రక్షణకు తాము గ్యారెంటీ ఇస్తున్నట్టు పేర్కొంది. కొన్ని ఆర్గనైజేషన్లు ఎంతో ప్రతిభకలిగిన గాయని నహీద్ అఫ్రిన్ ప్రదర్శన ఇవ్వకుండా ఆంక్షలు విధించడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామని బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ట్విట్టర్ ద్వారా నహీద్ కు మద్దతుగా నిలిచారు.
నహీద్ తో మాట్లాడతామని, ఆర్టిస్టులకు రక్షణ, భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సోనోవాల్ పునరుద్ఘాటించారు. ముస్లిం మతగురువులు తనపై ఫత్వా జారీచేశారని విన్న తర్వాత తాను చాలా షాక్ కు గురయ్యాయని, కానీ చాలామంది ముస్లిం గాయకులు తనకు మద్దతుగా నిలిచి పాడేందుకు ప్రోత్సహించారని నహీద్ చెప్పింది. ''పాడటం నాకు దేవుడిచ్చిన వరం, ఇది సరైన మార్గంలో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా. ఎలాంటి హెచ్చరికలకు నేను భయపడను. తుది శ్వాస వరకు నేను పాడుతూనే ఉంటా'' అని నహీద్ తెలిపారు. మసీదు, శ్మశాన సమీపంలో, బహిరంగ వేదికల్లో పాటలు పాడటాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మతగురువులు ఆమెపై ఫత్వా జారీచేశారు. టెర్రరిజం, ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా నహీద్ ఎక్కువగా పాటలు పాడుతూ ఫేమస్ అయింది. ఆమె తర్వాత ఈవెంట్ మార్చి 25న జరుగబోతుంది.
Advertisement