రైతు ఆత్మహత్యలను చూస్తూ ఉండలేం
వాటిని అరికట్టే దిశగా చర్యలు ప్రారంభించాలి
కనీస మద్దతు ధర నిర్ణయంలో వైఖరేంటో చెప్పండి
కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలను చూస్తూ ఉండలేమని, వీటిని అరికట్టే దిశగా ప్రభుత్వాలు తగిన చర్యలు ప్రారంభించాలని హైకోర్టు వెల్లడించింది. పెట్టుబడి వ్యయం ఆధారంగా పత్తితోపాటు మిగిలిన పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) నిర్ణయించే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పెట్టుబడి వ్యయాల ఆధారంగా కనీస మద్దతు ధరను నిర్ణయించకపోవడం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా, ప్రభుత్వం రూపొందించిన విధానానికి సైతం విరుద్ధమంటూ అదిలాబాద్ జిల్లా తాలమడుగు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కళ్లెం కరుణాకర్‌రెడ్డి హైకోర్టులో గతవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.సురేందర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పెట్టుబడి ఖర్చు ఆధారంగా రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదని, దీనివల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలను అరికట్టే దిశగా ప్రభుత్వాలు తగిన చర్యలు ప్రారంభించాలన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.