ఫిరాయింపులపై నిర్ణయం తీసుకుంటారా? | will take declare of complaints Disqualification Act ? | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులపై నిర్ణయం తీసుకుంటారా?

Published Fri, Jul 17 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

ఫిరాయింపులపై నిర్ణయం తీసుకుంటారా?

ఫిరాయింపులపై నిర్ణయం తీసుకుంటారా?

దీనిపై ఎప్పట్లోపు నిర్ణయం తీసుకుంటారు?
అసెంబ్లీ స్పీకర్‌ను అడిగి చెప్పండి..
అడ్వొకేట్ జనరల్‌కు హైకోర్టు స్పష్టీకరణ

 
 సాక్షి, హైదరాబాద్: తమ తమ పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకుంటారో.. లేదో స్పీకర్‌ను అడిగి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణయం తీసుకుంటామంటే ఎప్పటిలోపు నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని సూచించింది. ఈ వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ వ్యాజ్యాల్లో జోక్యం చేసుకోవాలో.. లేదో తేలుస్తామని తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు తలసాని, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి రెడ్యా నాయక్, యాదయ్య, కనకయ్య, విఠల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నుంచి మదన్‌లాల్ పార్టీ ఫిరాయించారని, దీనిపై ఫిర్యాదు చేసినా  స్పీకర్ పట్టించుకోవడం లేదని టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ నేతలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే పలుమార్లు ఈ వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.
 
 ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ చర్యలు తీసుకుంటారా? లేదా? వారిని అడిగి చెప్పాలని ఏజీకి స్పష్టం చేసింది. దీనికి ఏజీ స్పందిస్తూ.. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులు చైర్మన్, స్పీకర్ల ముందు పెండింగ్‌లో ఉన్నప్పుడు న్యాయ సమీక్ష చేయరాదన్నారు. దీనిపై ఒకింత తీవ్రంగా స్పందించిన ధర్మాసనం ‘ఒకవైపు ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోరు. మరోవైపు న్యాయ సమీక్ష చేయకూడదంటారు. ఫిర్యాదులపై ఎంత కాలంలోపు నిర్ణయం తీసుకుంటారో చెప్పమంటే అదీ చెప్పరు. ఇలా అయితే ఎలా? ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడానికి ఐదేళ్లు పడుతుందా! నిర్ణయం తీసుకుంటారా? లేదా? తీసుకుంటే ఎప్పట్లోపు తీసుకుంటారు.. ఈ వివరాలను ముందు చెప్పండి. ఆ తర్వాత న్యాయ సమీక్ష చేయవచ్చా? లేదా? అన్న విషయాన్ని మేం నిర్ణయిస్తాం’ అని ఏజీకి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement