ఏకగ్రీవం కానున్న బీజేపీ నేత ఎన్నిక
డిప్యూటీ స్పీకర్ పదవిని తమకివ్వాలంటున్న ఎంవీఏ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీకి చెందిన రాహుల్ నర్వేకర్ ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధమైంది. నర్వేకర్ ఆదివారం సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు షిండే, అజిత్‌లతో కలిసి అసెంబ్లీ కార్యదర్శి జితేంద్ర భోలెకు నామినేషన్ పత్రాలను అందజేశారు. స్పీకర్ పదవికి పోటీ పడరాదన్న ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నిర్ణయంతో నర్వేకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం స్పీకర్ ఎన్నికపై నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
అనంతరం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శాసనసభ, శాసనమండలి సభ్యులతో జరిగే ఉమ్మడి సమావేశంలో ప్రసంగిస్తారు. అదేవిధంగా, ప్రొటోకాల్ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని తమ కూటమిలోని పార్టీలకు వదిలేయాలని ఎంవీఏ నేతలు ఆదివారం సీఎం ఫడ్నవీస్‌ను కలిసి కోరారు. ప్రతిపక్ష నేత పదవిని కూడా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 288 సీట్లకుగాను మహాయుతి 230 స్థానాలను గెల్చుకోవడం తెల్సిందే. ముంబైలోని కొలాబా నుంచి మళ్లీ ఎన్నికైన రాహుల్ నర్వేకర్ గత 14వ అసెంబ్లీ స్పీకర్‌గా రెండున్నరేళ్లపాటు కొనసాగారు. ఆ సమయంలో శివసేన, ఎన్‌సీపీ చీలిక వర్గాల వ్యవహారంపై మహాయుతి ప్రభుత్వానికి అనుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
శివసేన(షిండే)కు 11 మంత్రి పదవులు!
మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. అతిత్వరలో విస్తరణ ఉంటుందని మహాయుతి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో కీలక భగస్వామి అయిన శివసేన(షిండే)కు 11 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. ఆ పార్టీ నేత ఏక్‌నాథ్ షిండే ఇప్పటికే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. కీలక శాఖలు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. శివసేన(షిండే) నుంచి మంత్రులుగా ప్రమాణం చేసేవారిలో ఆరుగురు మాజీ మంత్రులే ఉంటారని సమాచారం. కొత్తగా ఐదుగురికి మంత్రి యోగం పట్టబోతున్నట్లు తెలుస్తోంది. కనీసం 13 మంత్రి పదవులు కావాలని శివసేన(షిండే) డిమాండ్ చేయగా 11 పదవులకు బీజేపీ అంగీకరించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment