K. Ramakrishna Reddy
-
ఫిరాయింపులపై నిర్ణయం తీసుకుంటారా?
దీనిపై ఎప్పట్లోపు నిర్ణయం తీసుకుంటారు? అసెంబ్లీ స్పీకర్‌ను అడిగి చెప్పండి.. అడ్వొకేట్ జనరల్‌కు హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: తమ తమ పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకుంటారో.. లేదో స్పీకర్‌ను అడిగి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణయం తీసుకుంటామంటే ఎప్పటిలోపు నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని సూచించింది. ఈ వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ వ్యాజ్యాల్లో జోక్యం చేసుకోవాలో.. లేదో తేలుస్తామని తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు తలసాని, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి రెడ్యా నాయక్, యాదయ్య, కనకయ్య, విఠల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నుంచి మదన్‌లాల్ పార్టీ ఫిరాయించారని, దీనిపై ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదని టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నేతలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే పలుమార్లు ఈ వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ చర్యలు తీసుకుంటారా? లేదా? వారిని అడిగి చెప్పాలని ఏజీకి స్పష్టం చేసింది. దీనికి ఏజీ స్పందిస్తూ.. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులు చైర్మన్, స్పీకర్ల ముందు పెండింగ్‌లో ఉన్నప్పుడు న్యాయ సమీక్ష చేయరాదన్నారు. దీనిపై ఒకింత తీవ్రంగా స్పందించిన ధర్మాసనం ‘ఒకవైపు ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోరు. మరోవైపు న్యాయ సమీక్ష చేయకూడదంటారు. ఫిర్యాదులపై ఎంత కాలంలోపు నిర్ణయం తీసుకుంటారో చెప్పమంటే అదీ చెప్పరు. ఇలా అయితే ఎలా? ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడానికి ఐదేళ్లు పడుతుందా! నిర్ణయం తీసుకుంటారా? లేదా? తీసుకుంటే ఎప్పట్లోపు తీసుకుంటారు.. ఈ వివరాలను ముందు చెప్పండి. ఆ తర్వాత న్యాయ సమీక్ష చేయవచ్చా? లేదా? అన్న విషయాన్ని మేం నిర్ణయిస్తాం’ అని ఏజీకి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. -
ధర్మాసనం చెప్పినట్లు నోటీసిచ్చాం
90 పీజీ ఇంజనీరింగ్, 32 ఫార్మసీ కాలేజీలే స్పందించాయి ఇంకేమైనా లోపాలున్నాయో లేదో తేల్చాలి అక్టోబర్ 16 వరకు గడువు కావాలన్న ఏజీ అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి హైదరాబాద్: ధర్మాసనం ఆదేశాల మేరకు చట్టం నిర్దేశించిన విధంగా ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయో తెలియజేయాలంటూ 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కాలేజీలకు నోటీసులు ఇచ్చామని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి హైకోర్టుకు నివేదించారు. 90 పీజీ ఇంజ నీరింగ్, 32 పీజీ ఫార్మసీ కాలేజీలు వివరాలు సమర్పించాయని ఆయన తెలిపారు. వివరాలు సమర్పించిన కాలేజీల్లో ఇంకా ఏవైనా లోపాలున్నాయా అన్న విషయాన్ని తేల్చేం దుకు వచ్చే నెల 16 వరకు గడువు కావాలని ఆయన కోర్టు ను అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన ఓ మెమోను కోర్టు ముందుంచారు. ఈ మెమోను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి.. ఏజీ కోరిన విధంగా వచ్చే నెల 16వ తేదీ వరకు గడువునిచ్చారు. తదుపరి విచారణను ఆ రోజుకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం జరిగే వెబ్ కౌన్సెలింగ్ జాబి తాలో తమను చేర్చేలా ఆదేశాలివ్వాలంటూ పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ రాజశేఖరరెడ్డి.. హైకోర్టును ఆశ్రయించిన అన్ని కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలంటూ ఈ నెల 4న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జేఎన్టీయూ రిజిస్ట్రార్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కాస్త సవరించి.. లోపాలను సరిదిద్దుకోలేదని చెబుతున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కాలేజీలను సైతం ప్రాథమిక కౌన్సెలింగ్‌లో చేర్చాలని, అయితే ఈ కాలేజీల విషయంలో సింగిల్ జడ్జి తిరిగి నిర్ణయం వెలువరించేంత వరకు ప్రవేశాలను మాత్రం ఖరారు చేయవద్దని ఈ నెల 9న జేఎన్టీయూను ఆదేసించింది. దీంతోపాటు కౌన్సెలింగ్ జాబి తాలో చేర్చాలంటూ దాఖలైన వ్యాజ్యాల్లో తుది విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జికి స్పష్టం చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు కాలేజీలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ మొదలు పెట్టిన జస్టిస్ రాజశేఖరరెడ్డి వాటిని సోమవారం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా ఏజీ అడిగిన మేరకు గడువునిస్తూ.. విచారణను వాయిదా వేశారు. -
హోరాహోరీగా వాదనలు
* అఫిలియేషన్ల రద్దుపై తీవ్ర వాగ్వాదం * జేఎన్టీయూ చర్యలు ఏకపక్షమన్న కాలేజీలు * విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: ప్రమాణాలు పాటించలేదంటూ 174 కాలేజీలకు జేఎన్టీయూ అఫిలియేషన్లను రద్దు చేయడం, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జరుగుతున్న వెబ్ కౌన్సిలింగ్ జాబితా నుంచి వాటిని తొలగించడంపై హైకోర్టులో శుక్రవారం హోరాహోరీగా వాదనలు సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకబిగిన ఐదున్నర గంటల పాటు కొనసాగాయి. ఇంజనీరింగ్ కాలేజీల తరఫు సీనియర్ న్యాయవాదులు జేఎన్‌టీయూహెచ్‌పై దుమ్మెత్తిపోస్తే, అదే స్థాయిలో జేఎన్టీయూహెచ్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలపై నిప్పులు చెరిగారు. సాయంత్రానికల్లా వాదనలు ముగిసి కోర్టు ఆదేశాలు వస్తాయనుకున్న కాలేజీల యాజమాన్యాలకు నిరాశే ఎదురైంది. మరో ఐదు గంటల పాటు తన వాదనలు వినిపిస్తానని ఏజీ చెప్పడంతో తదుపరి విచారణను హైకోర్టు శనివారానికి వాయిదా వేసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకూ నిరాకరించింది. ఇంజనీరింగ్ కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, సరసాని సత్యంరెడ్డి, డి.వి.సీతారామ్మూర్తి, ఎల్.రవిచందర్, ఆర్.రఘునందనరావు, ఎస్.నిరంజన్‌రెడ్డి, కె.వివేక్ తదితరులు వాదనలు వినిపించారు. కాలేజీల్లో ఏ సౌకర్యాలు లేవో చెప్పకుండా, వాటి పరిష్కారానికి గడువునివ్వకుండా ఏకంగా అఫిలియేషన్‌ను రద్దు చేయడం అన్యాయమని లాయర్లు కోర్టుకు విన్నవించారు. ముందుగా నోటీసులు జారీ చేయకుండా అన్యాయం జరిగిన తర్వాత నోటీసులు జారీ చేసి చిన్న చిన్న సమస్యలను అఫిలియేషన్ రద్దుకు కారణాలుగా చూపినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని వెబ్ కౌన్సిలింగ్ జాబితాలో అన్ని కాలేజీలను చేర్చేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, విద్యా ప్రమాణాల పెంపు కోసమే 174 కాలేజీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు ఏజీ వాదించారు. పీహెచ్డీ చేసిన వారిని లెక్చరర్లుగా, కనీసం పది పరిశోధనా పత్రాలు సమర్పించిన వ్యక్తిని ప్రిన్సిపల్‌గా నియమించుకోవాలని, కానీ ఈ కాలేజీల్లో అలాంటి వారే కనిపించడం లేదని తెలిపారు. గతంలోనే ఈ లోపాలను ఎత్తిచూపినా వాటిని సరిదిద్దుకోలేదని పేర్కొన్నారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే తమ అఫిలియేషన్‌ను రద్దు చేయవచ్చునని ఆ కాలేజీలే గతంలో స్వయంగా అఫిడవిట్లు(ప్రమాణ పత్రాలు) ఇచ్చినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. యూనివర్సిటీలపై ఏఐసీటీఈ పెత్తనం చెల్లదని, అది కేవలం సలహా మండలి మాత్రమేనని సుప్రీం కూడా తీర్పునిచ్చినట్లు చెప్పారు. ప్రమాణాలు పాటించనందునే సదరు కాలేజీలపై చర్యలు తీసుకున్నట్లు కోర్టుకు వివరించారు. -
' తెలంగాణ ఏజీని తొలగించండి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అడ్వోకేట్ జనరల్‌గా కొనసాగుతున్న కె.రామకృష్ణారెడ్డిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని మాజీమంత్రి షబ్బీర్‌అలీ సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ల కేసు విషయంలో వ్యతిరేకంగా వాదించిన రామకృష్ణారెడ్డిని ఏజీగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని టీఆర్ఎస్ హామీనిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. నాడు 5 శాతం రిజర్వేషన్లనే వ్యతిరేకించిన రామకృష్ణారెడ్డి ఇప్పుడు 12 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఎలా వాదిస్తారని ప్రశ్నించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తక్షణమే ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని కూడా తేల్చాలని అందులో పేర్కొన్నారు.