* అఫిలియేషన్ల రద్దుపై తీవ్ర వాగ్వాదం
* జేఎన్‌టీయూ చర్యలు ఏకపక్షమన్న కాలేజీలు
* విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ప్రమాణాలు పాటించలేదంటూ 174 కాలేజీలకు జేఎన్‌టీయూ అఫిలియేషన్లను రద్దు చేయడం, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జరుగుతున్న వెబ్ కౌన్సిలింగ్ జాబితా నుంచి వాటిని తొలగించడంపై హైకోర్టులో శుక్రవారం హోరాహోరీగా వాదనలు సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకబిగిన ఐదున్నర గంటల పాటు కొనసాగాయి. ఇంజనీరింగ్ కాలేజీల తరఫు సీనియర్ న్యాయవాదులు జేఎన్‌టీయూహెచ్‌పై దుమ్మెత్తిపోస్తే, అదే స్థాయిలో జేఎన్‌టీయూహెచ్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలపై నిప్పులు చెరిగారు. సాయంత్రానికల్లా వాదనలు ముగిసి కోర్టు ఆదేశాలు వస్తాయనుకున్న కాలేజీల యాజమాన్యాలకు నిరాశే ఎదురైంది. మరో ఐదు గంటల పాటు తన వాదనలు వినిపిస్తానని ఏజీ చెప్పడంతో తదుపరి విచారణను హైకోర్టు శనివారానికి వాయిదా వేసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకూ నిరాకరించింది.
ఇంజనీరింగ్ కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, సరసాని సత్యంరెడ్డి, డి.వి.సీతారామ్మూర్తి, ఎల్.రవిచందర్, ఆర్.రఘునందనరావు, ఎస్.నిరంజన్‌రెడ్డి, కె.వివేక్ తదితరులు వాదనలు వినిపించారు. కాలేజీల్లో ఏ సౌకర్యాలు లేవో చెప్పకుండా, వాటి పరిష్కారానికి గడువునివ్వకుండా ఏకంగా అఫిలియేషన్‌ను రద్దు చేయడం అన్యాయమని లాయర్లు కోర్టుకు విన్నవించారు. ముందుగా నోటీసులు జారీ చేయకుండా అన్యాయం జరిగిన తర్వాత నోటీసులు జారీ చేసి చిన్న చిన్న సమస్యలను అఫిలియేషన్ రద్దుకు కారణాలుగా చూపినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని వెబ్ కౌన్సిలింగ్ జాబితాలో అన్ని కాలేజీలను చేర్చేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, విద్యా ప్రమాణాల పెంపు కోసమే 174 కాలేజీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు ఏజీ వాదించారు. పీహెచ్‌డీ చేసిన వారిని లెక్చరర్లుగా, కనీసం పది పరిశోధనా పత్రాలు సమర్పించిన వ్యక్తిని ప్రిన్సిపల్‌గా నియమించుకోవాలని, కానీ ఈ కాలేజీల్లో అలాంటి వారే కనిపించడం లేదని తెలిపారు.
గతంలోనే ఈ లోపాలను ఎత్తిచూపినా వాటిని సరిదిద్దుకోలేదని పేర్కొన్నారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే తమ అఫిలియేషన్‌ను రద్దు చేయవచ్చునని ఆ కాలేజీలే గతంలో స్వయంగా అఫిడవిట్లు(ప్రమాణ పత్రాలు) ఇచ్చినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. యూనివర్సిటీలపై ఏఐసీటీఈ పెత్తనం చెల్లదని, అది కేవలం సలహా మండలి మాత్రమేనని సుప్రీం కూడా తీర్పునిచ్చినట్లు చెప్పారు. ప్రమాణాలు పాటించనందునే సదరు కాలేజీలపై చర్యలు తీసుకున్నట్లు కోర్టుకు వివరించారు.
హోరాహోరీగా వాదనలు
Published Sat, Aug 23 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM
Advertisement
Advertisement