Web counselling list
-
ఇంజనీరింగ్ కాలేజీలకు చుక్కెదురు
* తాజా కౌన్సెలింగ్‌కు ఆదేశాలివ్వలేమన్న హైకోర్టు * ఈ దశలో అటువంటి ఉత్తర్వులు సాధ్యం కాదని స్పష్టీకరణ * రెండో దశ కౌన్సిలింగ్ చేపట్టే ఉద్దేశం లేదన్న అడ్వొకేట్ జనరల్ * ప్రవేశాల్లో ఆలస్యం కోర్టు ధిక్కారమేనని నివేదన సాక్షి, హైదరాబాద్: వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగింపునకు గురై, కోర్టులో సానుకూల ఉత్తర్వులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏ, బీ కేటగిరీల్లో ప్రవేశాల కల్పన నిమిత్తం తమకు అనుమతినివ్వడంతో పాటు, తమ కాలేజీలకు తాజాగా కౌన్సిలింగ్ లేదా అనుబంధ కౌన్సిలింగ్ నిర్వహించేలా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ), హైదరాబాద్‌ను ఆదేశించాలని కోరుతూ ఇంజనీరింగ్ కాలేజీలు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ దశలో అటువంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎంత మాత్రం సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో రెండో దశ కౌన్సిలింగ్‌లోనైనా తమకు స్థానం దక్కుతుందని ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల ఆశలపై తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి నీళ్లు చల్లారు. ఆగస్టు 31లోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, ఆ ఆదేశాల అమలులో భాగంగా రెండో దశ కౌన్సిలింగ్ నిర్వహించే ఉద్దేశమేదీ తమకు లేదని ఏజీ రామకృష్ణారెడ్డి కోర్టుకు తేల్చి చెప్పారు. ఏజీ చెప్పిన ఈ కీలక అంశాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు చేసిన అభ్యర్ధనను తోసిపుచ్చారు. నిబంధనల మేర బోధనా సిబ్బంది ఉన్న కాలేజీలను కౌన్సిలింగ్ జాబితాలో చేర్చాలని ఇదే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా జేఎన్టీయూ ఏ మాత్రం పట్టించుకోలేదని, దానిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, తమ కాలేజీలకు తాజా లేదా అనుబంధ కౌన్సిలింగ్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైజయంతి ఎడ్యుకేషనల్ సొసైటీ, మరో 23 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో హౌజ్ మోషన్ రూపంలో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశాయి. వీటిని జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారించారు. హామీ ఇచ్చినా పట్టించుకోలేదు... ఈ నెల 25న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు పిటిషనర్ కాలేజీలన్నీ కూడా రూ.100 స్టాంప్ పేపర్లపై యూనివర్సిటీ కోరిన ప్రకారం లోపాలను సవరించుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని కాలేజీల తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి తెలిపారు. నిబంధనల మేర తమ కాలేజీలన్నీ కూడా బోధనా సిబ్బందిని కలిగి ఉన్నందున వాటికి తాజాగా లేదా అనుబంధ కౌన్సిలింగ్ నిర్వహించి సీట్ల భర్తీకి అవకాశమివ్వాలన్నారు. అలస్యం కోర్టు ధిక్కారమే.. తరువాత జేఎన్టీయూ తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆగస్టు 31లోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, ప్రవేశాల ప్రక్రియలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా అది కోర్టు ధిక్కారమే అవుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను యథాతథంగా అమలు చేస్తున్నామని, అందులో భాగంగా రెండో దశ కౌన్సిలింగ్ నిర్వహించే ఉద్దేశమేదీ తమకు లేదని ఆయన కోర్టుకు నివేదించారు. -
హోరాహోరీగా వాదనలు
* అఫిలియేషన్ల రద్దుపై తీవ్ర వాగ్వాదం * జేఎన్టీయూ చర్యలు ఏకపక్షమన్న కాలేజీలు * విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: ప్రమాణాలు పాటించలేదంటూ 174 కాలేజీలకు జేఎన్టీయూ అఫిలియేషన్లను రద్దు చేయడం, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జరుగుతున్న వెబ్ కౌన్సిలింగ్ జాబితా నుంచి వాటిని తొలగించడంపై హైకోర్టులో శుక్రవారం హోరాహోరీగా వాదనలు సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకబిగిన ఐదున్నర గంటల పాటు కొనసాగాయి. ఇంజనీరింగ్ కాలేజీల తరఫు సీనియర్ న్యాయవాదులు జేఎన్‌టీయూహెచ్‌పై దుమ్మెత్తిపోస్తే, అదే స్థాయిలో జేఎన్టీయూహెచ్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలపై నిప్పులు చెరిగారు. సాయంత్రానికల్లా వాదనలు ముగిసి కోర్టు ఆదేశాలు వస్తాయనుకున్న కాలేజీల యాజమాన్యాలకు నిరాశే ఎదురైంది. మరో ఐదు గంటల పాటు తన వాదనలు వినిపిస్తానని ఏజీ చెప్పడంతో తదుపరి విచారణను హైకోర్టు శనివారానికి వాయిదా వేసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకూ నిరాకరించింది. ఇంజనీరింగ్ కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, సరసాని సత్యంరెడ్డి, డి.వి.సీతారామ్మూర్తి, ఎల్.రవిచందర్, ఆర్.రఘునందనరావు, ఎస్.నిరంజన్‌రెడ్డి, కె.వివేక్ తదితరులు వాదనలు వినిపించారు. కాలేజీల్లో ఏ సౌకర్యాలు లేవో చెప్పకుండా, వాటి పరిష్కారానికి గడువునివ్వకుండా ఏకంగా అఫిలియేషన్‌ను రద్దు చేయడం అన్యాయమని లాయర్లు కోర్టుకు విన్నవించారు. ముందుగా నోటీసులు జారీ చేయకుండా అన్యాయం జరిగిన తర్వాత నోటీసులు జారీ చేసి చిన్న చిన్న సమస్యలను అఫిలియేషన్ రద్దుకు కారణాలుగా చూపినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని వెబ్ కౌన్సిలింగ్ జాబితాలో అన్ని కాలేజీలను చేర్చేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, విద్యా ప్రమాణాల పెంపు కోసమే 174 కాలేజీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు ఏజీ వాదించారు. పీహెచ్డీ చేసిన వారిని లెక్చరర్లుగా, కనీసం పది పరిశోధనా పత్రాలు సమర్పించిన వ్యక్తిని ప్రిన్సిపల్‌గా నియమించుకోవాలని, కానీ ఈ కాలేజీల్లో అలాంటి వారే కనిపించడం లేదని తెలిపారు. గతంలోనే ఈ లోపాలను ఎత్తిచూపినా వాటిని సరిదిద్దుకోలేదని పేర్కొన్నారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే తమ అఫిలియేషన్‌ను రద్దు చేయవచ్చునని ఆ కాలేజీలే గతంలో స్వయంగా అఫిడవిట్లు(ప్రమాణ పత్రాలు) ఇచ్చినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. యూనివర్సిటీలపై ఏఐసీటీఈ పెత్తనం చెల్లదని, అది కేవలం సలహా మండలి మాత్రమేనని సుప్రీం కూడా తీర్పునిచ్చినట్లు చెప్పారు. ప్రమాణాలు పాటించనందునే సదరు కాలేజీలపై చర్యలు తీసుకున్నట్లు కోర్టుకు వివరించారు.