పీసీల తయారీకి విప్రో గుడ్‌బై
న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ బాటలోనే తాజాగా మరో ఐటీ దిగ్గజం విప్రో కూడా పర్సనల్ కంప్యూటర్లు (పీసీ), సర్వర్ల తయారీ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఇకపై ఐటీ సొల్యూషన్స్, సర్వీసుల వ్యాపారాలపై మరింతగా దృష్టి పెట్టనుంది. పీసీల తయారీ విభాగంలో ఉద్యోగులను వేరే విభాగాలకు బదలాయిస్తామని కంపెనీ జీఎం ఎస్ రా/వేంద్ర ప్రకాశ్ తెలిపారు.
ఉద్యోగుల సంఖ్య ఎంత ఉన్నదీ ఆయన వెల్లడించకపోయినప్పటికీ.. సుమారు 2,000 కన్నా తక్కువే ఉండొచ్చని సమాచారం. మార్కెట్లు, వినియోగదారుల ధోరణులు మారిపోతున్నాయని ప్రకాశ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ సర్వీసులు, సొల్యూషన్స్ విభాగంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై విప్రో మరింతగా దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే, భారీ స్థాయి సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ డీల్స్ వస్తే హార్డ్‌వేర్ సేవలు అందించడం కొనసాగిస్తామని ప్రకాశ్ వివరించారు. ఇప్పటిదాకా విక్రయించిన పీసీలకు వారంటీ, యాన్యువల్ మెయింటెనెన్స్ సేవలు విప్రో యథాప్రకారం అందిస్తుందని పేర్కొన్నారు. 1985లో పీసీల తయారీని ప్రారంభించిన విప్రోకి ప్రస్తుతం పుదుచ్చేరిలోను, ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లోను ప్లాంట్లు ఉన్నాయి. మార్జిన్లను మెరుగుపర్చుకునేందుకు పీసీల తయారీని క్రమక్రమంగా నిలిపివేయనున్నట్లు హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ ఇటీవల ప్రకటించింది.