
కోమాలో ప్రసవించింది.. 4 నెలల తర్వాత!
కోమాలో ఉండగానే పండంటి బిడ్డను ప్రసవించిన ఓ మహిళా పోలీసు అధికారి నాలుగు నెలల తర్వాత.. కోమాలోంచి బయటకు వచ్చి తొలిసారి తన కన్నబిడ్డను చూసుకుంది. ఈ అరుదైన ఘటన అర్జెంటీనాలో జరిగింది. 34 ఏళ్ల మహిళా పోలీసు అధికారి అయిన అమేలియా బన్నన్ గత ఏడాది నవంబర్ 1న ప్రమాదానికి గురైంది. ఆమె పోలీసు అధికారి అయిన తన భర్త, సహోద్యోగులతో కలిసి సర్వీసు వాహనంలో ప్రయాణిస్తుండగా రోడ్డుప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బన్నన్ కోమాలోకి వెళ్లారు. అప్పటికే గర్భవతి కావడంతో ప్రసవానికి ఆలస్యం కాకుండా వైద్యులు జాగ్రత్త తీసుకున్నారు. దీంతో నాలుగు నెలల కిందట కోమాలో ఉండగానే బన్నన్ మగబిడ్డకు జన్మనిచ్చారు. గత కొన్ని రోజులుగా ఆమెలో కదలికలు కనిపిస్తున్నాయని, గత గురువారం అనూహ్యంగా ఆమె కోమాలోంచి బయటకొచ్చి.. తన కన్నబిడ్డను తొలిసారి కళ్లారా చూసుకుందని బంధువులు తెలిపారు.