
రామజన్మభూమికి సమీపంలోని సరయూ నదిలో భక్తుల పుణ్యస్నానాలు
అయోధ్య: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రామ జన్మభూమికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. సరయూ నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు ఒక్కసారిగా భక్తులు పోటీలుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలివీ..
శ్రీరాముని కల్యాణం తిలకించేందుకు సుమారు 10 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచి వచ్చిన భక్తులు సరయూ నదిలో స్నానాలు చేసి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా రామజన్మభూమి మందిరం సమీపంలోని తులసి ఉద్యాన్‌లో జరిగిన తోపులాటలో దులారీ దేవి(65) మృతి చెందగా లక్పతి దేవి(70) తీవ్రంగా గాయపడింది.
మృతురాలు దులారీ దేవి సిద్ధార్ధనగర్ జిల్లాకు చెందిన సాధురాం భార‍్యగా గుర్తించారు. అయితే, దులారీ దేవి గుండెపోటుతో చనిపోయినట్లు ఎస్పీ అనంత్‌దేవ్ తెలిపారు. అదేవిధంగా బాంధా తిరహా ప్రాంతంలో జరిగిన మరో తొక్కిసలాటలో సుమారు 12 మంది భక్తులు గాయపడ్డారని ఆయన చెప్పారు.