అప్పు ఇచ్చి.. లోబర్చుకునేందుకు వేధించాడు
విజయవాడ: చేసే వృత్తి న్యాయవాది అయినా కీచకుడిగా మారాడు. కష్టాల్లో ఉన్న ఓ మహిళకు అప్పు ఇచ్చి.. దాన్ని ఆసరాగా తీసుకుని ఆమెను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఆమెకు తెలియకుండా అసభ్య ఫొటోలు తీసి లైంగిక కోరికలు తీర్చాలని వేధించాడు. తన మాట వినకుంటే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. విసిగిపోయిన బాధితురాలు మహిళా సంఘాల సాయంతో పోలీసులరు ఆశ్రయించింది. విజయవాడలో జరిగిన ఈ ఉదంతం వివరాలిలా..
పూర్ణానందం పేటలో రెడ్డి నాగలక్ష్మి అనే మహిళ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. జీవనాధారం కోసం ఓ షాపు నిర్వహిస్తోంది. ఇందుకోసం విజయవాడలోనే ఉండే పొలిమెట్ల తాతారావు అనే న్యాయవాది దగ్గర రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకుంది. వడ్డీ కోసం తరచూ తాతారావు.. నాగలక్ష్మి ఇంటికి వచ్చేవాడు. తనతో సన్నిహితంగా ఉంటూ తనకు తెలియకుండా అసభ్యకర ఫోటోలు తీశాడని నాగలక్ష్మి ఆరోపించింది. లైంగిక వాంఛలు తీర్చాలని ఒత్తిడి చేశాడని, తన మాట వినకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడని చెప్పింది. తాతారావు అప్పు తీర్చేందుకు తన ఇంటిని ఆయన పేరిట జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేయించినట్టు నాగలక్ష్మీ వెల్లడించింది. అయినా తాతారావు వేధింపులు ఆపకపోవడంతో మహిళా సంఘాల సాయంతో విజయవాడ నగర పోలీసు కమీషనర్‌ను ఆశ్రయించింది. తాతారావుపై చర్యలు తీసుకోవాలని విన్నవించింది.