బెంగళూరు: నగరంలోని ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేస్తున్న ఓ మహిళ(38)పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహిళ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు మంగళవారం ఉదయం ఏటీఎంకు వెళ్లిన సమయంలో ఈ దారుణమైన సంఘటన సంభవించింది. కార్పోరేషన్ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆ మహిళ ఏటీఎంలోకి వెళ్లిన వెంటనే అదే అదునుగా భావించిన ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె వెనుక ప్రవేశించి షట్టర్ మూసివేసి దాడికి పాల్పడ్డాడు. అతనితో ఆమె కాసేపు ప్రతిఘటించింది. కాగా, ఆ దుండగుడు ఆమెను విచక్షణరహితంగా గాయపరిచి మహిళ వద్ద ఉన్న బ్యాగుతో ఉడాయించాడు.
దాడితో సృహ కోల్పోయిన ఆ మహిళ కాసేపటికి లేచి కేకలు వేయడంతో రోడ్డుపై వెళ్లే వారు ఏటీఏం తలుపులు తెరవడంతో ఈ ఉదంతం బయటపడింది. అతని చేతిలో ఉన్న కత్తితో ఆమెను తీవ్రంగా గాయపరిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగానే కనబడ్డాయి. ఆ దుండుగుడు దాడి చేయడానికి ముందుగానే సిద్ధమైనట్లు అతని వద్దనున్న మారణాయుధాల్ని బట్టి తెలుస్తోంది. ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకోవడానికి ఏటీఎం వద్ద సరైన రక్షణ లేకపోకడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇటువంటి సంఘటనలు ఎన్ని చోటు చేసుకుంటున్నా ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ తీవ్రంగా గాయపడటంతో విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.