యెమెన్ షాక్... 654 పాయింట్లు పతనం | yemen shock 654 points loss | Sakshi
Sakshi News home page

యెమెన్ షాక్... 654 పాయింట్లు పతనం

Published Fri, Mar 27 2015 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

యెమెన్ షాక్... 654 పాయింట్లు పతనం

యెమెన్ షాక్... 654 పాయింట్లు పతనం

మధ్య ఆసియా ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్‌ను పడగొట్టాయి. దీనికి మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియడం, చమురు ధరలు పెరగడంతో గురువారం స్టాక్ మార్కెట్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల కంపెనీలు, టెక్నాలజీ షేర్లు బాగా కుదేలయ్యాయి.  

గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 654 పాయింటు, నిఫ్టీ 189 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. , బుధవారం అమెరికా మార్కెట్ల పతనం కావడంతో కూడా స్థానిక మార్కెట్ క్షీణతకు మరో కారణం. ఇంట్రాడేలో సెన్సెక్స్ నష్టం 727 పాయింట్లుగా ఉంది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగియడం ఇది వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్. ఈ ఏడు ట్రేడింగ్ సెషన్లలోనూ సెన్సెక్స్  మొత్తం 1,260 పాయింట్లు  తగ్గింది. వచ్చే వారం మార్కెట్ మూడు రోజులే పనిచేస్తుండడం కూడా ట్రేడింగ్‌పై ప్రభావం చూపింది.
 
యెమెన్ సంక్షోభం
యెమెన్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి హౌతి మిలిటెంట్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో సౌదీ అరేబియా నేతృత్వంలోని పది దేశాల కూటమి ఈ తిరుగుబాటుదారులపై గురువారం వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు  సరఫరాల్లో అవాంతరాలేర్పడి, ధరలు పెరుగుతాయనే ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి.
 
రెండో అధ్వాన ముగింపు
గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ నష్టాల్లోనే ప్రారంభమైంది. 27,385 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకి చివరకు 654  పాయింట్ల (2.33 శాతం) నష్టంతో 27,458 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరి 6న సెన్సెక్స్ 855 పాయింట్లు నష్టపోయింది. దాని తర్వాత ఇదే అత్యధిక నష్టం. ఇక  నిఫ్టీ 189 పాయింట్లు(2.21 శాతం) నష్టపోయి 8,342 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది పదివారాల కనిష్టం.
 
క్యాపిటల్ మార్కెట్‌లో లావాదేవీలు
 
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ ట్రేడింగ్
 
 విభాగం        తేదీ           కొనుగోలు    అమ్మకం      నికర విలువ
 
 డీఐఐ :        26-03        4,288        3,601         687
                  25-03        2,029        1,933         97    
                  24-03        1,858        2,490         - 632
 ఎఫ్‌ఐఐ:       26-03        7,733        8,255        -521    
                  25-03        6,910        6,097        813    
                  24-03        4,648        3,910        738    
                                                            (విలువలు రూ.కోట్లలో)
 
లక్షన్నర కోట్ల సంపద ఆవిరి

బుధవారం రూ.1,01,24,877 కోట్లుగా ఉన్న బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ విలువ గురువారం ట్రేడింగ్ ముగిసేనాటికి రూ.99,66,783 కోట్లకు పడిపోయింది. అంటే గురువారం ఒక్క రోజులో రూ.1,58,094 కోట్ల సంపద ఆవిరయ్యింది.
 
రూపాయి అరశాతం డౌన్

ఒకవైపు దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణించడం మరోవైపు నెలాఖరులో డాలర్లకు డిమాండ్ పెరగడం పరిణామాలతో రూపాయి మారకం విలువ గురువారం రెండు వారాల కనిష్ట స్థాయికి పడింది. డాలర్‌తో పోలిస్తే 34 పైసలు తగ్గి 62.67 వద్ద ముగిసింది.
 
వచ్చేవారం మూడు రోజులే మార్కెట్
వచ్చే వారం మూడు రోజులే ట్రేడింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 2(గురువారం) మహావీర్ జయంతి, ఏప్రిల్ 3(శుక్రవారం) గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవులు. దీంతో వచ్చే వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితం కానున్నది. ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు కాబట్టి, సెటిల్మెంట్ లావాదేవీలు జరగవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement