భారీ నష్టాల నుంచి రికవరీ
మైనస్ 608 నుంచి మైనస్ 144కు
బిహార్ ఫలితాల ప్రభావం స్వల్పమే
బిహార్ ఎన్నికల ఫలితాలు అందరూ ఊహించినట్లుగానే స్టాక్ మార్కెట్‌ను పడగొట్టాయి. అయితే అందరూ ఊహించినట్లుగా భారీగానే పతనమైనప్పటికీ, ఎవరూ ఊహించని విధంగా స్టాక్ సూచీలు రికవరీ అయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 608 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 144 పాయింట్ల నష్టంతో 26,121 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 7,915 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ మార్కెట్ నష్టాల పాలయ్యింది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. తదుపరి సంస్కరణలపై ఆర్థిక మంత్రి జెట్లీ వ్యాఖ్యలు, దేశ ఆర్థిక వ్యవస్థ ఆశావహంగా ఉంటుందన్న ఫిచ్ రేటింగ్..తదితర అంశాలు రికవరీకి తోడ్పడ్డాయి. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి హెచ్చరిక లేఖలు అందిన నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ షేర్ పతనం కొనసాగుతోంది.
సీఎన్‌ఎక్స్ నిఫ్టీ ఇక నుంచి నిఫ్టీ 50
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) తన సూచీలన్నింటీని రీబ్రాండ్ చేసింది. అన్ని సూచీల పేర్ల నుంచి సీఎన్‌ఎక్స్‌ను తొలగించాలని ఎన్‌ఎస్‌ఈ నిర్ణయించింది. సీఎన్‌ఎక్స్ నిఫ్టీ ఇక నుంచి నిఫ్టీ 50గానూ, నిఫ్టీ జూనియర్‌ను ఇక నుంచి నిఫ్టీ నెక్స్‌ట్ 50 గానూ, సీఎన్‌ఎక్స్ ఐటీని నిఫ్టీ ఐటీగానూ వ్యవహరిస్తారు.
డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ ఐపీఓకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: ప్రముఖ డయాగ్నస్టిక్ చెయిన్ డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు కలిసి 14 శాతం వాటాకు సమానమైన 1.1 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఆఫర్ ధరను ఇంకా నిర్ణయించలేదని కంపెనీ పేర్కొంది.