స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులు
మార్కెట్ అప్‌డేట్
6 పాయింట్ల నష్టంతో 28,879కు సెన్సెక్స్
2 పాయింట్ల లాభంతో 8,780కు నిఫ్టీ
ఐదు రోజుల బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. అయితే స్వల్ప లాభంతో నిఫ్టీ వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాల్లోనే ముగిసింది. లాభాల స్వీకరణ (ప్రధానంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో) కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ స్వల్ప నష్టాలకు లోనైంది. వెరశి సెనెక్స్ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 28,879 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 8,780 పాయింట్ల వద్ద ముగిశాయి. మొత్తం మీద స్టాక్ మార్కెట్ వరుసగా రెండో వారమూ లాభాల్లోనే ముగిసింది.
బ్యాంకింగ్ కీలకం
మార్కెట్ ఫ్లాట్‌గా మొదలై బేరిష్ మూడ్‌లోనే కొనసాగిందని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ధకన్ చెప్పారు. ఇక ఇప్పటి నుంచి నిఫ్టీ కదలికలకు బ్యాంకింగ్ రంగమే కీలకం కానున్నదని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు.బ్యాంక్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ రంగాల సూచీలు మినహా మిగిలిన 9 రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. టారిఫ్‌లు పెరుగుతాయనే అంచనాలతో టెలికాం షేర్లు పెరిగాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.4,102 కోట్లుగా, ఎన్‌ఎసీ నగదు విభాగంలో రూ.18,328 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.1,57,175 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.363 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.135 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.