సీఎం యోగి.. నెలలో పెరిగిన పాపులారిటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనకు, ఆయన తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా అక్రమ కబేళాలను మూసివేయించడం, ఆకతాయిల నుంచి మహిళలను రక్షించడానికి యాంటీ రోమియో స్క్వాడ్‌లను ఏర్పాటు చేయడం వల్ల యోగి పాపులారిటీ పెరిగిందని ఓ సర్వేలో తేలింది. నెల రోజుల్లో యోగి పాలన ఎలా ఉంది, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యమా? అంటూ యూపీలోని 20 జిల్లాల్లో 2 వేల మందితో అభిప్రాయాలు తెలుసుకున్నారు.
యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్రమ కబేళాల మూసివేత, యాంటీ రోమియో స్క్వాడ్‌లు ఏర్పాటు, వీఐపీ సంస్కృతి రద్దు, ప్రభుత్వ ఆఫీసుల్లో పాన్ మసాలా, పొగాకు వాడకంపై నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. యోగి నిర్ణయాలకు 62 శాతం మంది ప్రజల నుంచి మద్దతు లభించింది. యోగి ప్రభుత్వం సరైన దిశలో పనిచేస్తుందని 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. యాంటీ రోమియో స్క్వాడ్‌లు ఏర్పాటు చేయడాన్ని ముఖ్యంగా మహిళలు సమర్థిస్తున్నారు. కాగా కబేళాల మూసివేత, యాంటీ రోమియో స్క‍్వాడ్‌లు అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలపై కొందరు విమర్శించారు.