అందరికీ.. ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి
సాధారణంగా సమవయస్కులు, వయసులో కొంచెం తేడా ఉన్నవారు స్నేహం చేస్తుంటారు. యువత, వృద్ధులు స్నేహితులుగా మారడమన్నది చాలా అరుదు. ఇంగ్లండ్లో 91 ఏళ్ల ఎడ్నా, జెమ్మా డన్హౌ అనే యువతి మంచి స్నేహితులయ్యారు. ఎడ్నా ఇంగ్లండ్ దేశస్తురాలు కాగా, జెమ్మా ఆస్ట్రేలియాకు చెందినది. వీరిద్దరి వయసులో దాదాపు 60 ఏళ్లు తేడా ఉంటుంది.
భర్త చనిపోయాక ఎడ్నా ఒంటరిగా ఉంటోంది. ఆమె బాగోగుల సంగతి అటుంచితే కనీసం మాట్లాడేవాళ్లు కూడా లేరు. ఓ రోజు ఊహించనివిధంగా బస్స్టాప్ వద్ద ఆమెకు జెమ్మా పరిచయమైంది. తర్వాత ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
జెమ్మా ఈ విషయాలన్నింటినీ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. 'భర్త మరణించాక ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానని ఎడ్నా చెప్పింది. ఒంటరితనం భరించలేక టౌన్కు వెళ్తున్నానని చెప్పింది. ఆమె మాటలు నన్ను కదిలించాయి. వెంటనే ఫోన్ నెంబర్ తీసుకున్నా. ఓ రోజు ఆమె ఇంటికి వెళ్లి ఓ కప్ టీ తాగాను. ఎడ్నాతో కలసి సెల్ఫీ తీసుకున్నా. 91 ఏళ్ల ఎడ్నాకు అదే తొలి సెల్ఫీ. మా ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశా. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది దీన్ని లైక్ చేశారు. ఈ విషయాన్ని ఎడ్నాకు చెప్పాను. ఆమె చాలా సంతోషించింది. తర్వాత ఆమె ఇంటికి తరచూ వెళ్తునే ఉన్నా. మా ఇద్దరికీ అక్కడే టీ, లంచ్' అని జెమ్మా చెప్పింది. ఎడ్నా ఇప్పుడు ఒంటరిగా ఫీల్ కావడం లేదు. ఆమెకిపుడు జెమ్మా రూపంలో మంచి ఫ్రెండ్ ఉంది.