
కేంద్ర మంత్రిపై గుడ్లతో దాడి
భువనేశ్వర్: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ పర్యటన పట్ల ఒడిశాలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై కోడిగుడ్లు రువ్వి నిరసన ప్రదర్శించారు. రాష్ట్ర అతిథి గృహం నుంచి బయల్దేరేందుకు బయటకు వచ్చిన సమయంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు గుంపుగా చేరుకుని మంత్రి కారు వైపు గుడ్లు రువ్వడం ప్రారంభించారు.
ఈ సంఘటనపై జంట నగరాల పోలీసు కమిషనరేటు తక్షణమే స్పందించింది. మంత్రిపై గుడ్లు రువ్విన ఆరోపణ కింద ఐదుగురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. వీరిలో రాష్ట్ర యువ జన కాంగ్రెస్ అధ్యక్షుడు లోక్‌నాథ్ మహారథి ఒకరుగా జంట నగరాల పోలీసు కమిషనరు వైబి ఖురానియా పేర్కొన్నారు. నిందితుల వ్యతిరేకంగా స్థానిక క్యాపిటల్ ఠాణాలో ఫిర్యాదు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వివరించారు.
జట్నీలో ఏర్పాటు చేసిన సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరిన సమయంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి విఫలయత్నం చేసి అరెస్టు అయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యం వహిస్తున్న ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా మారిందని మాజీ ఎంపీ ప్రదీప్ మాఝి ఆరోపించారు.