
జగన్ రైట్ రాయల్‌గా ఫోన్లో మాట్లాడొచ్చు: అంబటి
యనమల కువిమర్శలపై అంబటి ఆగ్రహం
చంచల్‌గూడ జైలులో టెలిఫోన్ బూత్ ఉన్న సంగతి తెలియదా?
రాష్ట్రం రగులుతూ ఉంటే.. జగన్ ఫోన్లపై రచ్చ ఏమిటి?
జైలు అధికారులు వివరణ ఇచ్చినా దిగజారుడు ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ‘‘విభజన కారణంగా రాష్ట్రమంతా రగిలిపోతుంటే.. టీడీపీ నేత యనమల రామకృష్ణుడికి మాత్రం రాష్ట్ర ప్రజల గోడు అవసరం లేదు.. రాష్ట్రం ఎటుపోయినా లెక్క లేదు.. జగన్ ఫోన్లు, ములాఖత్‌లు మాత్రమే ఆయనకు ముఖ్యమైనవి. అసలు చంచల్‌గూడ జైలులో గత రెండు నెలలుగా ఏకంగా ఒక టెలిఫోన్ బూత్‌నే ఏర్పాటు చేశారు. ఎవరైనా కూడా వారానికి రెండుసార్లు రైట్ రాయల్‌గా మాట్లాడుకోవటానికి అవకాశం కల్పించారు. ఇక ఎందుకు ఈ రచ్చ? టీడీపీ నేతలు అక్కడ విషయాల మీద పెట్టే శ్రద్ధ ఈ రాష్ట్రం మీద పెట్టి ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
దివంగత ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతుడిని చేయటంలో అప్పట్లో తెరవెనుక కీలకపాత్ర పోషించిన యనమల ఇప్పుడేమీ పనీపాటా లేక ఇలాంటి దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. గుంటూరులో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేసిన ప్రసంగంపై టీడీపీ నేతల ఆరోపణలను ఆయన సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. జైలు మ్యాన్యువల్ ప్రకారం నిబంధనల మేరకే అన్నీ జరుగుతున్నాయని స్వయంగా జైలు అధికారులు వివరణ ఇచ్చినా.. జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయకపోతే యనమలను పార్టీలో ఎవరూ గుర్తించే పరిస్థితి లేదని, ప్రజలకు దూరమైన నాయకులు ఇలాంటి దిగజారుడు మాటలకన్నా రాష్ట్రం గురించి ఆలోచించే స్థాయి ఎక్కడిదని దుయ్యబట్టారు.