
ఏపీ డీజీపీకి వైఎస్ జగన్ లేఖ
విజయవాడ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఏపీ డీజీపీ సాంబశివరావుకు లేఖ రాశారు. అనంతపురం జిల్లా కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు. డీజీపీ కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ ఐజీ గుప్తాకు వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పీ గౌతమ్ రెడ్డి ఈ లేఖను అందజేశారు.
కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి.. పార్టీ అధినేత జగన్ రాసిన లేఖను ఆయనకు అందజేశారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికలను నిష్పాక్షికంగా జరుపాలని వారు ఎన్నికల కమిషనర్‌ను కోరారు. మంత్రి పరిటాల సునీత దౌర్జన్యానికి పాల్పడాలని చూస్తున్నారని, బలం లేకున్నా ఎంపీపీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టారని వైఎస్సార్సీపీ నేతలు పార్థసారథి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, కన్నబాబు పేర్కొన్నారు.