
రోజా హామీ ఇస్తే పరిశీలిస్తాం: ఏపీ డీజీపీ
విజయవాడ: మహిళా పార్లమెంట్ సదస్సుకు వెళ్లిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అక్రమంగా నిర్బంధించడంపై పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ విషయమై నేతలు ర్యాలీగా వెళ్లి డీజీపీని కలిశారు. రోజాను అక్రమంగా నిర్బంధించారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అయితే.. రోజా పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు చెప్పారు. సోషల్ మీడియాలో రోజా చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని ఆమెను గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రోజా వల్ల మహిళా పార్లమెంట్ సదస్సుకు ఇబ్బంది కలుగుతుందనే ముందస్తుగా అదుపులోకి తీసుకుని, హైదరాబాద్‌కు తరలిస్తున్నామని డీజీపీ వెల్లడించారు. మహిళా పార్లమెంట్ సదస్సులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని రోజా హామీ ఇస్తే సదస్సుకు అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
(చదవండి: ఎమ్మెల్యే రోజా నిర్బంధం, విజయవాడ తరలింపు)
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మహిళా పార్లమెంట్ సదస్సులో వివిధ ప్రాంతాల మహిళా నేతలు పాల్గొంటుండగా.. సొంత రాష్ట్ర మహిళానేతలపై పోలీసులు, ప్రభుత్వం ప్రదర్శించిన అమానుష చర్యపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ముందుగా హామీ పత్రం రాసిచ్చి మహిళా నేతలు సదస్సుకు హాజరుకావాలా అని.. డీజీపీ వ్యాఖ్యలపై నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.