
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నవంబర్ 6 నుంచి చేయతలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో పార్టీ కీలక నేతలు శనివారం ఏపీ డీజీపీ సాంబశివరావును కలిశారు. సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పార్థసారథిలు.. ప్రజా సంకల్పయాత్రకు సంబంధించిన పలు వివరాలను డీజీపీకి తెలిపారు. భేటీ అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు.
డీజీపీ సానుకూల స్పందన : వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించి తాము చెప్పిన వివరాలకు డీజీపీ సానుకూలంగా స్పందించారని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. యాత్రకు అనుమతి తీసుకోవాలనే ప్రశ్నే ఉత్పన్నం కాబోదని మరోసారి స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వ వైఫల్యాలను, అప్రజాస్వామిక విధానాలను తెలియజెప్పడానికే జగన్ ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడానికే సంకల్ప యాత్రను చేపట్టారు’’ అని అన్నారు.
భద్రత కొనసాగించాల్సిందే : వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రపై టీడీపీ సర్కార్ కుట్రలు పన్నుతున్న దరిమిలా జన నేతకు యాత్ర పొడవునా భద్రత కొనసాగించాల్సిందేనని వైఎస్సార్‌సీపీ నేతలు డీజీపీతో అన్నారు. ప్రస్తుతం జగన్‌కు భద్రత ఉన్నా, పాదయాత్ర ప్రారంభమైన తర్వాత దానిని ఉపసంహరించుకుంటారనే అనుమానాల నడుమ నేతలు ఈ విధంగా పేర్కొన్నారు. ఇడుపులపాయలో నవంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ప్రజా సంకల్పయాత్ర ఆరు నెలల పాటు సాగనుంది.
మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉంటుంది : డీజీపీ
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి అనుమతులు ఉంటాయని డీజీపీ సాంబశివరావు చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేతలతో సమావేశం అనంతరం ఈ మేరకు ఆయన మీడియాకు వెల్లడించారు. పాదయాత్ర వివరాలను, రూట్ మ్యాప్‌లను ఆయా జిల్లాల ఎస్పీలకు ముందుగానే అందజేయాలని డీజీపీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment