
బాధలు వింటూ.. భరోసా ఇస్తూ... విజయమ్మ పర్యటన
మారుమూల గ్రామాల్లో విజయమ్మ పర్యటన
సాక్షి, శ్రీకాకుళం: పై-లీన్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లోని పలు మారుమూల గ్రామాల్లో విజయమ్మ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఆమె అడుగిడిన ప్రతిచోటా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ కష్టాలు చెప్పుకొన్నారు. కంచిలి మండలం జాడుపూడి నుంచి ఉదయం 11.55 గంటలకు విజయమ్మ పర్యటన మొదలైంది. అక్కడి కొబ్బరి, జీడి మామిడి, పనస తదితర తోట పంటల రైతుల్ని పరామర్శించారు. అక్కడి నుంచి పెద కొజ్జిరియా, చిన కొజ్జిరియాల్లో పర్యటించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కవిటి మండలం రాజపురం చేరుకున్నారు. కాలి నడకనే గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ పలకరించారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వెంటనే బయలుదేరి బొరివంక మీదుగా ఇద్దివానిపాలెం చేరుకున్నారు. అక్కడ మత్స్యకార మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. కవిటి, ఇచ్ఛాపురం, మందస, సోంపేట మండలాల్లోని మత్స్యకారులకు సుమారు రూ. 25 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకార ఐక్య వేదిక ప్రతినిధులు వెల్లడించారు. బి.గొనపపుట్టుగలో కూడా స్థానికులతో విజయమ్మ ముఖాముఖి మాట్లాడారు.
కుసుంపురంలో మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుకు అడ్డంగా నిలిచి పుష్పగుచ్ఛాలిచ్చేందుకు పోటీపడ్డారు. అక్కడి నుంచి కళింగపట్నం, బల్లిపుట్టుగ, మాణిక్యపురం వెళ్లారు. మాణిక్యపురంలో అభిమానులు భారీ సంఖ్యలో జెండాలు పట్టుకుని రోడ్డుపైకి చేరుకోగా విజయమ్మ వారందరినీ చిరునవ్వుతో పలకరించి, చేతులూపుతూ అభివాదం చేశారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆమెకు రుషికుద్దలో రైతులు తమ పంట నష్టాల్ని చెప్పుకున్నారు. ఇసకలపాలెంలో మత్స్యకారులు తమ చేపలు, వలలు, బోట్లు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విజయమ్మ గొల్లగండి మీదుగా బారువ చేరుకుని మత్స్యకారుల కష్టాలు తెలుసుకున్నారు. బారువలో రక్షణ గోడ నిర్మాణానికి హామీ ఇచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె తన పర్యటనను ముగించుకుని విశాఖలో రాత్రి బస చేసేందుకు తిరుగుముఖంపట్టారు.