
సోనియాను వెన్నుపోటు పొడిచి పార్టీ పెట్టారు: గాలి ముద్దుకృష్ణమ నాయుడు
సాక్షి, హైదరాబాద్: సోనియాగాంధీని వెన్నుపోటు పొడిచి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబసభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని తెలుగుదేశం శాసనసభాపక్ష ఉప నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. రాజశేఖరరెడ్డిని సోనియాగాంధీ రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని వెన్నుపోటుదారుడని విమర్శించే అర్హత వారికి లేదన్నారు. గురువారం ఎన్‌టీఆర్ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించటం మంచిదన్నారు. ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధిని అనుమతించలేదు.
వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్త ఇస్తున్నాం. ఒకవేళ సాక్షిని అనుమతించి ఉంటే గాలిని ఈ ప్రశ్నలు అడిగేది.
ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీని, పదవినీ వదులుకుని కొత్త పార్టీ పెట్టుకోవడాన్ని వెన్నుపోటు అని చెబుతున్నారే? టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి బలవంతంగా గద్దె దింపి మీ నాయకుడు చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న విధానం వెన్నుపోటు కాదా?
2009 సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరేవరకూ ఎన్‌టీఆర్ టీడీపీలో, ఆ తరువాత కాంగ్రెస్‌లో కొనసాగిన మీరు చంద్రబాబును వెన్నుపోటుదారుడని లెక్కలేనన్ని సార్లు విమర్శించారు కదా? మీరు టీడీపీలో చేరడంతోనే చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాకుండా పోయారా?