
సీమాంధ్రలో జైల్‌భరో
సాక్షి నెట్‌వర్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షను భగ్నం చేసినందుకు నిరసిస్తూ శనివారం పలుచోట్ల ఆ పార్టీ కార్యకర్తలు జైల్‌భరో, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. తూర్పుగోదావరిజిల్లా అనపర్తి, ద్రాక్షారామం, రాజ మండ్రి, రాజానగరం, అమలాపురం, సర్పవరం, ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్ల ముట్టడించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన జైల్‌భరో కార్యక్రమాలకు సంబంధించి ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మితో సహా వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పెద్దాపురం సబ్‌జైలును పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో ముట్టడించారు. వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట రోడ్లు ఊడ్చారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్‌లో పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు మానవహారం నిర్వహించారు. పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు కొయ్యలగూడెంలో జైల్‌భరో కార్యక్రమం చేపట్టగా, ఏలూరులో మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని రెండు రోజులపాటు నిర్వహించే మౌన నిరాహార పాదయూత్ర ప్రారంభమైంది. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం నుంచి వందలాదిమంది కార్యకర్తలు పాదయాత్ర చేసి ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు.
వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో పోలీసుస్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా గురజాల నేత జంగా కృష్ణమూర్తి పిడుగురాళ్ల నుంచి 50 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు. జననేత ఆరోగ్యం కోసం పూజలు: జగన్ ఆరోగ్యం కుదుటపడాలని చిత్తూరులో పార్టీ మహిళా కన్వీనర్ గాయత్రీదేవి చాముండేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించి, ముత్తయిదువులకు పసుపు కుంకుమ, జాకెట్లు పంచిపెట్టారు. పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లెలో ముత్యాలమ్మకు పొంగళ్లు పెట్టి పూజలు చేశారు. శ్రీకాకుళంలోని సిద్ధగణపతి దేవాలయం వద్ద పూజలుచేశారు. రాజాంలో ముస్లింలు నడిరోడ్డుపైనే ప్రార్థనలు చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం, మడకశిర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడలో పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో 108 మంది లలితా సహస్రనామ పారాయణ చేశారు.