అది మాస్టర్ ప్లాన్ కాదు.. డైవర్షన్ ప్లాన్
రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై రోజా ధ్వజం
‘ఓటుకు కోట్లు’ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పుష్కరాల పబ్లిసిటీ
పుష్కర ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు మాస్టర్‌ప్లాన్ హడావుడి
సింగపూర్ సంస్థలిచ్చే కమీషన్ల కోసమే వారితో ఒప్పందం
హైదరాబాద్: కొత్త రాజధాని నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రిలో విడుదల చేసింది మాస్టర్ ప్లాన్ కానే కాదని, అదో డైవర్షన్ ప్లాన్ అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు నోటు వ్యవహారంలో పరువు పోగొట్టుకున్న బాబు ఆ వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పుష్కరాల్లో బాగా పబ్లిసిటీ చేసుకుని లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. అక్కడ 30 మంది మృతి చెంది వ్యవహారం వికటించడంతో ఇపుడు హడావుడిగా సింగపూర్ నుంచి ప్రత్యేక విమానంలో అక్కడి మంత్రిని పిలిపించి మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేశారని విమర్శించారు. ప్లాన్ సీడీ విడుదల వ్యవహారం చూస్తే సినిమా ట్రైలర్ వేడుకను గుర్తుకు తెచ్చిందని రోజా ఎద్దేవా చేశారు. విదేశాల్లో ఎక్కడెక్కడ మంచి ఫ్లైఓవర్లు, భవనాలు, రోడ్లు ఉన్నాయో వాటన్నింటినీ మాస్టర్ ప్లాన్‌లో చూపించి ప్రజలను కలల్లో విహరింప జేసే యత్నం చేశారన్నారు. రాష్ట్రం విడిపోయాక ఆర్థిక పరిస్థితి భారీ లోటులో ఉందని చెబుతున్న చంద్రబాబు రాజధానిని కట్టడానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని రోజా సూటిగా ప్రశ్నించారు.
బాబు సీఎం అయ్యాక తెచ్చిన రెండు బడ్జెట్‌లలోనూ రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, కేంద్రం నుంచి కూడా నిధులు రాలేదని, రాజధాని నిర్మాణానికి రూ.1.4 లక్షల కోట్లు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వారి నుంచి ఇంత వరకూ సమాధానమే రాలేదని వివరించారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా రాజధాని కడతామని చంద్రబాబునాయుడు చెప్పడం ప్రజలను నిలువునా మోసం చేయడం కాదా? అని ఆమె ప్రశ్నించారు. సింగపూర్ సంస్థలు ఎవరికీ ఏదీ ఉచితంగా చేయవని, వారు పూర్తి వ్యాపారాత్మక దృ క్పథంతో ఉంటారని అలాంటి వారు ఉచితంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చారంటే నమ్మాలా? అని నిలదీశారు. రాజధాని ప్రాంతంలో సింగపూర్ సంస్థలకు పది వేల ఎకరాలను కట్టబెడుతున్నారని జూలై 6వ తేదీన ఓ ఆంగ్ల దిన పత్రికలో వచ్చిన కథనాన్ని ఆమె ఉటంకిస్తూ... దీనిపై ఇంతవరకూ ప్రభుత్వం సమాధానమే చెప్పలేదన్నారు. సింగపూర్ సంస్థకు ఒక లక్ష కోట్ల రూపాయలు ఇస్తున్నట్లేనన్నారు. అసలు మన రాష్ట్రంలోనే అంతర్జాతీయస్థాయి గల గొప్ప ఇంజనీర్లు ఉంటే వారిని కాదని సింగపూర్‌ను ఆశ్రయించడం ఏమిటి? వారిచ్చే కమీషన్లతో జేబులు నింపుకుందామనే కదా? అని ఆమె ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం 2050 నాటికి పూర్తవుతుందని మాస్టర్ ప్లాన్‌లో చెప్పడం చూస్తే ఈ 35 ఏళ్లు భూములు ఇచ్చిన రైతులు ఏం కావాలి? వారి జీవనం ఎలా కొనసాగాలని నిలదీశారు.