'మగధీర, బాహుబలి ట్రైలర్లు చూసినట్లుంది' | ysrcp MLA roja takes on chandra babu | Sakshi
Sakshi News home page

'మగధీర, బాహుబలి ట్రైలర్లు చూసినట్లుంది'

Published Tue, Jul 21 2015 12:39 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

'మగధీర, బాహుబలి ట్రైలర్లు చూసినట్లుంది' - Sakshi

'మగధీర, బాహుబలి ట్రైలర్లు చూసినట్లుంది'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదా లేక సింగపూర్దా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా..  చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం ఏపీ ప్రభుత్వం.. సింగపూర్కు లక్ష కోట్ల నజరానా ఇస్తున్నారని  ఆమె ఆరోపించారు. మంగళవారం రోజా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ చూస్తుంటే.. మగధీర, బాహుబలి సినిమా ట్రైలర్లు చూసినట్లు ఉందని అన్నారు. ప్రపంచ దేశాల్లో అందమైన కట్టడాలను ఒకచోటకు తెచ్చి రాజధాని అంటూ చూపిస్తున్నారని, చేతలో చిల్లిగవ్వ లేకుండా అంతర్జాతీయ రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని రోజా సూటిగా ప్రశ్నించారు.  అది మాస్టర్ ప్లాన్ కాదు.. చంద్రబాబు డైవర్షన్ ప్లాన్ అని ఆమె ఎద్దేవా చేశారు.

రాజధాని పేరుతో చంద్రబాబు సమస్యలు సృష్టిస్తున్నారని రోజా అన్నారు. రాజధాని సామాన్యులకు అందుబాటులో ఉండాలని, మాస్టర్ ప్లాన్లో రైతులు, బడుగులకు చోటెక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని నిలదీశారు. చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ మాని ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి.. ఇప్పుడు దానిపై నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే ఈ మాస్టర్ ప్లాన్ను చంద్రబాబు తెరమీదకు తెచ్చారని రోజా అన్నారు. అంతర్జాతీయ రాజధాని పేరుతో ప్రజలను కలల్లో విహరింప చేయడమే అని, మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇవ్వడానికి సింగపూర్  ఏమైనా ధార్మిక సంస్థా, బడుగు, బలహీన వర్గాలకు నూతన రాజధానిలో చోటివ్వరా?, 2050 వరకూ రాజధాని నిర్మాణం చేపడితే భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా ఏమిస్తారో చెప్పాలని, రాజధాని మాస్టర్ ప్లాన్ రియల్ ఎస్టేట్ బ్రోచర్లా ఉందని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement