‘వీర’....నారికి జోహార్‌ | indian women who served in army, navy, air forces | Sakshi
Sakshi News home page

‘వీర’....నారికి జోహార్‌

Published Fri, Feb 23 2018 3:11 AM | Last Updated on Fri, Feb 23 2018 3:11 AM

indian women who served in army, navy, air forces - Sakshi

సైన్యం అంటేనే పురుషులు.....అనాదిగా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. తొలుత మన దేశ  సైన్యంలో  మహిళలను కేవలం వైద్య సేవలు అందించడానికి మాత్రమే నియమించేవారు. 1992నుంచి ఈ పరిస్థితి మారింది. మహిళలను వైద్య సేవల నిమిత్తమే కాకుండ సైనిక సేవలను అందించేందుకు నియమించడం ప్రారంభించారు. తొలుత కేవలం జూనియర్‌ రేంజ్‌లో మాత్రమే తీసుకునేవారు. 2016, ఫిబ్రవరిలో నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి ప్రకటన మేరకు ప్రస్తుతం సైనిక బలగాల్లో మహిళలను ఆర్మి, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ విభాగాల్లో  ఆఫీసర్‌ కేడర్‌లో నియమిస్తున్నారు. త్రివిధ దళాల్లో సేవలు అందించిన, అందిస్తున్న ధీర వనితల గురించి తెలుసుకుందాం.

పునిత అరోరా
సైన్యంలో రెండో అత్యుత్తమ స్థాయి అయిన లెఫ్టినెంట్‌ జనరల్‌ ర్యాంకు, నేవీలో వైస్‌ అడ్మిరల్‌ స్థాయికి ఎదిగిన తొలి మహిళ పునిత. పంజాబీ కుటుంబంలో జన్మించిన పునిత 2004వరకూ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీ బాధ్యతలు చూసుకున్నారు. ఈ బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళ కూడా పునిత అరోరా కావడం  విశేషం.
 

పద్మావతి బంధోపాధ్యాయ
ఆమె ప్రస్థానం అడుగడుగునా ప్రత్యేకం. భారత వాయుసేనలో చేరిన తొలి మహిళ.ఇంతేనా ఉత్తర ధృవంలో పరిశోధనలు చేసిన తొలి మహిళే కాక వాయుసేనలో ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ర్యాంకుకు ఎదిగిన తొలి మహిళ కూడా పద్మావతి బంధోపాధ్యాయే. 1971 లో భారత్-పాక్‌ యు​ద్ధం సందర్భంగా ఆమె చేసిన సేవలకు గాను ‘‘విశిష్ట సేవా పురస్కారాన్ని’’  అందుకున్నారు.
 

మిథాలి మధుమిత
సైన్యంలో ప్రధానం చేసే ‘‘సేన’’ పతకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పతకాన్ని స్ధాయితో సంబంధం లేకుండా శత్రుసేనలు దాడి చేసినప్పుడు వ్యక్తిగత ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారికి ప్రధానం చేస్తారు. ఇలాంటి అరుదైన పురస్కారాన్ని అందుకున్న తొలి సైనికురాలు లెఫ్టినెంట్‌ కల్నల్‌ మిథాలి మధుమిత.  2010, ఫిబ్రవరిలో కాబూల్లో  భారత రాయబార కార్యాలయం వద్ద ఆత్మహుతి దాడి సమయంలో ఆమె ఒంటరిగాసంఘటన స్థలికి చేరుకుని దాదాపు 19మంది ఆధికారులను కాపాడినందుకు గాను  2011లో ప్రభుత్వం ఆమెను ‘‘సేన’’ అవార్డుతో సత్కరించింది.

దివ్య అజిత్‌ కుమార్‌
సైనిక శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. అందులోను సైన్యంలో ఆఫిసర్‌గా శిక్షణ పొందే సమయంలో పలు ప్రత్యేక అంశాల్లో ప్రతిభను పరీక్షిస్తారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి శిక్షణానంతరం ఇచ్చే విశిష్ట పురస్కారం ‘‘స్వార్డ్‌ ఆఫ్‌ హనర్‌’’. ఇంతటి గౌరవాన్ని అతి పిన్న వయసులోనే (21ఏళ్లకే) పొందారు దివ్య అజిత్‌ కుమార్‌. అంతేకాదు భారత సైనిక చరిత్రలో ఓ మహిళ ఈ అవార్డు పొందడం ఇదే ప్రధమం.

అంజనా భదురియా
మైక్రోబయాలజీలో పీజీ చేసినప్పటికి ఆమె కోరిక మాత్రం సైన్యంలో చేరి దేశ సేవ చేయడం. అందుకు తగ్గట్టుగానే 1992లో భారత ప్రభుత్వం సైన్యంలో మహిళను చేర్చుకునేందుకు ‘‘మహిళల ప్రత్యేక ఎంట్రీ స్కీమ్‌’’ను ప్రవేశపెట్టింది. మహిళ క్యాడెట్ల తొలి బ్యాచ్‌ అదే. ఈ బ్యాచ్‌లో చేరి శిక్షణ కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్‌ మెడల్‌ అందుకున్న తొలి మహిళ అంజనా భదురియా.
 

ప్రియ సేంవాల్‌
సైన్యంలో చేరతామంటే వద్దు అనే కుటుంబాలు నేటికి కోకొల్లలు. అలాంటిది తన భర్త  సైన్యంలో వీరమరణం పొందినప్పటికి భర్త జ్ఞాపాకర్థం తాను తన నాల్గు సంవత్సారల కూతురిని సైతం వదిలి  సైన్యంలో చేరిన మొదటి ఆర్మీ జవాన్ భార్యగా దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకుని చరిత్ర సృష్టించారు  ప్రియ సేంవాల్‌.
 

గనేవి లాల్జి
గనేవి లాల్జి తన కుటుంబంలో సైన్యంలో చేరిన మూడో తరం వ్యక్తి. సాహసాలు అంటే ఎంతో ఇష్టపడే లాల్జి మనాలిలోని వెస్ట్రన్‌ హిమాలయన్‌ మౌంటేయినరింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో మౌంటేయినరింగ్‌, స్కియింగ్‌లలో శిక్షణ తీసుకున్నారు.2011లో  ఆమె  సైన్యంలో చేరారు. అనతికాలంలోనే ఆర్మి కమాండర్‌కు కీలక సహాయకురాలిగా నియమితులైన తొలి మహిళగా కీర్తి గడించారు.
 

గుంజన్‌ సక్సేనా
1994నుంచి భారత వాయుసేనలో మహిళలను తీసుకుంటున్నారు. 25ఏళ్ల గుంజన్‌ సక్సేనా నాటి తొలి బ్యాచ్‌లో ఒకరు. యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళా ఐఏఎఫ్‌ ఆఫీసర్‌ గుంజన్‌ సక్సేనా. కార్గిల్‌ యుద్ధ సమయంలో శత్రు స్థావరాల్లో గాయపడిన సైనికులను తీసుకురావడం, యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి సైనిక దళాలను  చేరవేయడం వంటి బాధ్యతలు నిర్వహించారు. విధినిర్వహణలోనే వీరమరణం పొందారు. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చి ప్రభుత్వం ‘‘శౌర్య వీర అవార్డు’’ను ప్రధానం చేసింది. ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ కూడా ఈమెనే.

శాంతి తగ్గ
మూడు పదులు దాటిన వయసు, ఇద్దరు పిల్లలకు తల్లి...ఏ స్త్రీ అయినా ఇంటిపట్టునే ఉండాలనుకుంటుంది. కానీ శాంతి తగ్గ మాత్రం సైన్యంలో జవానుగా చేరారు. శరీర దృఢత్వ పరిక్షల్లో పురుషులకు ధీటుగా రాణించి బ్యాచ్‌లో మొదటి స్థానంలో నిలిచారు. శిక్షణ పూర్తయ్యాక 969 రైల్వె ఇంజనీర్‌ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందారు. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.

- పిల్లి ధరణి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement