ఎన్నికల సంఘం భవనానికి శంకుస్థాపన
- సిబ్బందికి కూడా అక్కడే క్వార్టర్స్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని గచ్చిబౌలిలో నిర్మించనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఎకరా స్థలంలో ఎన్నికల సంఘం భవనంతోపాటు సిబ్బందికి క్వార్టర్స్‌ను నిర్మించే యోచనలో ఉన్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. సుమారు 34 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవనంలో కమిషనర్, సెక్రటరీ, లీగల్ అడ్వైజర్ కార్యాలయాలు, కాన్ఫరెన్స్ హాల్, సెమినార్ హాల్, లైబ్రరీ, డైనింగ్ హాల్, రికార్డు గది తదితర వసతులు ఉండేలా ప్రణాళిక రూపొందించామన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పి.మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం కార్యాలయ భవనాన్ని రూ.17 కోట్లతో నిర్మిస్తున్నామని, మొదటి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7.25 కోట్లను విడుదల చేసిందన్నారు. 18 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.