టీఆర్ఎస్.. తిరుగులేని రాజకీయ శక్తి: కేటీఆర్
అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు, హైదరాబాద్‌లోని సబ్బండ వర్గాలు తమను సంపూర్ణంగా ఆదరించడం వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయాన్ని సాధించగలిగామని తెలంగాణ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) చెప్పారు. టీఆర్ఎస్ అంటే 'తిరుగులేని రాజకీయ శక్తి' అని మరోసారి ఖరారైందని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వస్తుండటం, విజయం దాదాపు ఖరారైన తర్వాత ఆయన సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్, మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, జగదీష్ రెడ్డి తదితరులతో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సారథ్యంలో ఇప్పటికే చాలాసార్లు చరిత్రను తిరగరాసిందని, ఇప్పుడు మరోసారి హైదరాబాద్ నగర చరిత్రలో ఏనాడూ లేనంత పెద్ద మెజారిటీ కైవసం చేసుకుందని అన్నారు. ఈ అపురూప విజయాన్ని అందించిన గ్రేటర్ ప్రజలందరికీ శిరస్సు వంచి సవినయంగా, వినమ్రంగా హృదయపూర్వకంగా నిండుమనసుతో ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వారికిచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా త్రికరణ శుద్ధిగా అమలుచేస్తామని, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిమాట నిలబెట్టుకుంటామని చెబుతున్నామన్నారు.
ఈ విజయంతో టీఆర్ఎస్ తిరుగులేని పార్టీ అన్న విషయం అందరికీ అర్థమైందని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్మేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు దాదాపు అందరూ పూర్తిగా శ్రమించారని, హైదరాబాద్ ప్రజలు తమ దీవెనలను అందించారని కేటీఆర్ చెప్పారు. కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా సబ్బండ వర్ణం టీఆర్ఎస్‌ను ఆదరించిందని ఆనందం వ్యక్తం చేశారు. చాలామంది సెటిలర్లు, అవి.. ఇవి అంటూ చాలా మాటలు అన్నారని, కానీ టీఆర్‌ఎస్‌కు సార్వజనీన ఆమోదం ఉందని మరోసారి రుజువైందని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలుచేస్తామని అందులో ఈషణ్మాత్రం కూడా అనుమానం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలు కోరుకున్న నగరాన్ని నిర్మిస్తామని, ఈ విజయం కేసీఆర్ కార్యదక్షతకు, పనితీరుకు గ్రేటర్ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంగా, తీర్పుగా భావిస్తున్నామని అన్నారు.
అపజయాలు వస్తే కుంగిపోం, విజయాలు వస్తే పొంగిపోయేది లేదని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కొంతమంది నాయకులు రకరకాల సవాళ్లు విసిరారని, ఆ విషయాన్ని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ఈ విజయం చూసిన తర్వాతైనా ప్రతిపక్షాల మనసు మారాలని అన్నారు. వాళ్లు నిర్మాణాత్మకంగా సహకరించాలని కోరారు. ఎదిగిన కొద్దీ ఒదగాలని కేసీఆర్ ఎప్పుడూ చెప్పేవారని, దాన్ని తాము పాటిస్తామని అన్నారు.