వారంలో 5 రోజులు ‘ఇంటి’ కూరలే!
చిన్నప్పటి నుంచి మొక్కల పెంపకంపై ఉన్న ఆసక్తి ఆమెను ఇంటిపంటల వైపు దృష్టి మళ్లించేందుకు పురికొల్పింది. మేడపైన ఉన్న కొద్ది పాటి స్థలాన్ని పొందికగా ఉపయోగించుకొని 20 రకాలకు పైగా ఇంటిపంటలను సాగు చే స్తున్నారు రాయకంటి లీలారవి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమలానగర్ కాలనీలో స్వగృహంలో నివసిస్తూ.. గత రెండేళ్లుగా గృహిణిగా తనకున్న ఖాళీ సమయాన్ని ఇంటిపంటలకు వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు గల తమ కుటుంబానికి వారానికి ఐదు రోజులకు సరిపడా సేంద్రియ కాయగూరలు, ఆకుకూరలు తమ ఇంటిపైనే పండిస్తున్నారు.
350కు పైగా మట్టి, సిమెంట్ కుండీల్లో కాయగూరలు, ఆకుకూరలు, పూల మొక్కలు పెంచుతున్నారు. వంగ, టమాట, చెట్టు చిక్కుడు, మిరప, సొర, బీర, కాకర, దోస వంటి కూరగాయలతోపాటు పుదీనా, కొత్తిమీర, తోటకూర, బచ్చలి వంటి ఆకుకూరలు పెంచుతున్నారు. మొక్కలను పెంచేందుకు రెండు పాళ్లు ఎర్రమట్టి, ఒక పాలు మాగిన ఆవు పేడ, కొంచెం ఇసుక, వేపపిండి కలిపిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. కుండీ అడుగున రంధ్రాలు పూడిపోకుండా ఉండేందుకు ముందు రెండంగుళాల మందాన గులక రాళ్లు వేసి ఆపైన మట్టి మిశ్రమం నింపుతారు.
ఈ మట్టి మిశ్రమాన్ని రెండేళ్లకోసారి పూర్తిగా మార్చేస్తానని ఆమె తెలిపారు. వంటింటి వ్యర్థాలు, గంజి, బియ్యం కడిగిన నీళ్లను మొక్కల పోషణకు వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఆవు పిడకల బూడిదకు.. వేపాకు పిండి, పసుపు కలిపి మొక్కలపై చల్లి, చీడపీడలను నివారిస్తున్నారు. పూల మొక్కలు, కూరగాయ మొక్కలను కొన్ని కుండీల్లో కలిపి వేశారు. దీని వల్ల తక్కువ కుండీల్లోనే ఎక్కువ దిగుబడి పొందవచ్చంటున్నారావిడ. తీగ జాతి కూరలు పాకేందుకు రెయిలింగ్‌కు ప్లాస్టిక్ వైర్లు కట్టి పందిళ్లు ఏర్పాటు చేశారు. ‘ఆరోగ్యకరమైన కూరలను ఇంటిపట్టునే పెంచుకోవటం సంతృప్తినిస్తోంది. ఆ కూరల రుచిని కుటుంబ సభ్యులు మెచ్చుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది’ అంటున్నారు లీలారవి (99498 94433).