‘ఆక్వా’లోనూ సేంద్రియ కెరటం! | 'Aqua' in the organic wave! | Sakshi
Sakshi News home page

‘ఆక్వా’లోనూ సేంద్రియ కెరటం!

Published Mon, Jul 21 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

‘ఆక్వా’లోనూ సేంద్రియ కెరటం!

‘ఆక్వా’లోనూ సేంద్రియ కెరటం!

రసాయనాల వాడకం తక్కువ.. దిగుబడి ఎక్కువ!
వెనామీ, చేపల చెరువుల్లో రసాయనిక ఎరువులు, ప్రోబయోటిక్స్‌కు బదులుగా జీవామృతం
90% తగ్గిన రసాయనిక ఎరువుల వాడకం.. ఖర్చు కూడా!
పది రోజులు ముందుగానే పట్టుబడి.. మేత ఖర్చు ఆదా
హెక్టారుకు 9-12 టన్నుల రొయ్యల దిగుబడి.. రసాయనాలు వాడిన చెరువుల్లో కన్నా 20% అధిక దిగుబడి

 
కోస్తా జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో రొయ్యలు, చేపల సాగుపై లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పూర్తిస్థాయి శ్రద్ధచూపి ప్రోత్సహించకపోయినా.. రైతులు తమంతట తాముగా కొత్తదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే వెనామీ రొయ్యలు, తెల్ల చేపల సాగులో రసాయనిక ఎరువులు, ప్రోబయోటిక్స్‌కు ప్రత్యామ్నాయంగా జీవామృతం వాడుతూ అధిక దిగుబడులు పొందుతున్నారు. ఎరువుల ఖర్చులు 90% తగ్గించుకుంటూ.. రసాయనిక అవశేషాలు తక్కువగా ఉండే రొయ్యలు, చేపల పెంపకం దిశగా ముందడుగు వేస్తున్నారు.
 
గుంటూరు జిల్లా తీర ప్రాంత మండలాల్లో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పంటల సాగులో రసాయనిక ఎరువులకు బదులు జీవామృతం వాడుతున్నారు. కర్లపాలెంనకు చెందిన రైతు పెనుమత్స కృష్ణంరాజు ప్రకృతి వ్యవసాయంపై సుభాష్ పాలేకర్ వద్ద శిక్షణ పొందారు. వరి, మామిడి వంటి పంటలను జీవామృతం తదితరాలతో పండిస్తూ చక్కటి ఫలితాలు పొందుతున్నారు.

పంటల సాగులో రసాయనిక ఎరువులకు బదులు వాడుతున్న జీవామృతాన్ని  వెనామీ రొయ్యల సాగులో ఎందుకు వాడకూడదు? అన్న ఆలోచనతో..  కృష్ణంరాజు బాపట్ల మండలం అడవి పంచాయతీ పరిధిలోని తమ వాసంతీ ఆక్వాకల్చర్ చెరువుల్లో జీవామృతాన్ని ప్రయోగాత్మకంగా వాడి చూశారు. ఫలితాలు అన్నివిధాలా మెరుగ్గా ఉండడంతో.. గత నాలుగైదేళ్లుగా 150 ఎకరాల్లో జీవామృతం వాడుతూ వెనామీ రొయ్యలు సాగు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని తమ చెరువుల్లో సైతం ఈ పద్ధతిని అనుసరించాలనే ఆలోచనలో ఉన్నారు.  కృష్ణంరాజు ప్రయోగం ఆక్వా రంగంలో కొత్త విధానానికి నాంది పలికింది. మరికొందరు ఆక్వా రైతులు కూడా ఈవైపు దృష్టి సారిస్తున్నారు.
 90% తగ్గిన రసాయనిక ఎరువుల వాడకం!

ఆక్వా చెరువు నీటిలో రొయ్యలు, చేపలకు సహజాహారమైన ప్లాంక్టాన్ (ప్లవకాలు) వృద్ధి చెందడానికి యూరియా, సూపర్ ఫాస్ఫేట్ వంటి రసాయనిక ఎరువులతోపాటు ప్రోబయోటిక్స్‌ను వాడుతుంటారు. జీవామృతం వాడుతున్నందున వీటి వాడకం 90% మేరకు తగ్గిందని సాంకేతిక నిపుణుడు నవనీత కృష్ణన్ తెలిపారు. రొయ్యల పంట కాలం నాలుగైదు నెలలు. 4 హెక్టార్ల(10 ఎకరాల) చెరువులో రసాయనిక ఎరువులతోపాటు ప్రోబయోటిక్స్ వాడకానికి రూ. 5-6 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే, వీటి బదులుగా జీవామృతం వాడితే అయ్యే ఖర్చు రూ. 50-60 వేలు మాత్రమేనని ఆయన చెప్పారు. హెక్టారుకు 5 లక్షల చొప్పున రొయ్యల సీడ్ వేస్తున్నామని, దిగుబడి 9-12 టన్నుల వరకు వస్తోందని కృష్ణన్ వివరించారు. రసాయనిక ఎరువులు, ప్రోబయోటిక్స్ విరివిగా వాడిన చెరువుల్లోకన్నా తమ చెరువుల్లో 20% అధిక దిగుబడి వస్తోందని వివరించారు.

మోతాదు మించినా పర్వాలేదు!

హెక్టారు(రెండున్నర ఎకరాలు) చెరువులో ఒకసారి చల్లడానికి 200 లీటర్ల జీవామృతం సరిపోతుంది. డ్రమ్ములో 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కేజీల పేడ, రెండు కేజీల పెసర/ మినుము/ కందులు/ సెనగ పిండి, రెండు కేజీల బెల్లం, రసాయనిక ఎరువులు తగలని గట్టు మట్టి కేజీ.. కలిపి రెండు రోజుల పాటు డ్రమ్ములో మురగబెట్టాలి. ఉదయం, సాయంత్రం నిమిషం పాటు సవ్యదిశలో తిప్పాలి. అనంతరం చెరువు నీటిపై ప్రోబయోటిక్స్‌ను ఏ విధంగా చల్లుతామో ఆ విధంగానే  జీవామృతాన్ని ప్రతి మూడు రోజులకోసారి చల్లాలి. ఇంకా ఎక్కువ సార్లు, ఎక్కువ మోతాదులో చల్లినా ఎటువంటి ప్రమాదం లేదు.

ప్రోత్సహిస్తే మన ‘ఆక్వా’కు తిరుగుండదు!

మన ఆక్వా రైతుల ప్రయోగశీలత పుణ్యమా అని రసాయనిక అవశేషాలు తక్కువగా ఉండే రొయ్యలు, చేపల వినియోగదారులకు అందుబాటులోకి రావడం ప్రారంభం కావడం శుభపరిణామం. అయితే, సేంద్రియ ఆక్వా ఉత్పత్తులకు ప్రస్తుతం ప్రత్యేక మార్కెట్ లేదు. జపాన్ వంటి దేశాలు ఆర్గానిక్ రొయ్యలకు సమీప భవిష్యత్తులోనే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు ఈ రొయ్యలకు విదేశీ విపణిలో ప్రత్యేక ధర లభిస్తుందని ఆశిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం పరిశోధనలు చేపట్టి, సముచిత రీతిన ప్రోత్సాహాన్నందిస్తే విదేశీ మార్కెట్లలో మన ఆక్వా ఉత్పత్తులకు తిరుగుండదు. స్థానికంగా కూడా ఆరోగ్యదాయకమైన చేపలు, రొయ్యలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.

 - ఎం.అంజయ్య, బాపట్ల, గుంటూరు జిల్లా
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement