మన జీర్ణవ్యవస్థలో ప్రతి చదరపు అంగుళంలోనూ కోటానుకోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుందన్న విషయం తెలిసిందే. జీర్ణప్రక్రియలకు, జీర్ణమైన ఆహారంలోని పోషకాలు దేహానికి అందడానికి అవి ఎంతో తోడ్పతతాయి. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడే పెరుగు, మజ్జిగ, కొద్దిగా పులిసేందుకు అవకాశం ఉన్న పిండితో చేసే ఇడ్లీ, దోస వంటి ఆహారాలు తీసుకొమ్మని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇప్పుడు ఇదే ప్రో–బ్యాక్టీరియా మనుషుల్లోని డిప్రెషన్ తగ్గడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుందని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాసెల్‌కు చెందిన మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.
డిప్రెషన్‌తో బాధపడుతూ యాంటీడిప్రెసెంట్స్ వాడుతున్న కొందరిని ఓ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ఇందులో భాగంగా... డిప్రెషన్ చికిత్స కోసం ముందుకొచ్చిన వలంటీర్లలో కొంతమందికి ప్రోబయాటిక్స్ ఇచ్చారు. వారిని పరీక్షించి చూసినప్పుడు... ఇలా ప్రోబయాటిక్స్ పుష్కలంగా తీసుకుంటున్న వ్యక్తుల మెదడు పనితీరు మరింత త్వరగా నార్మల్ అయ్యిందంటూ ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సైకియాట్రిస్ట్ అన్నా కియారా స్క్వాబ్ పేర్కొన్నారు. జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మజీవరాశికీ... మెదడుకూ మధ్య ఏదో సంబంధం ఉందని ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనల్లో తేలినా... అదెలా జరుగుతుందన్నది ఇంకా తెలియరాలేదు.
అయితే ప్రోబయాటిక్ ఆహారంతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు డిప్రెషన్ కూడా తగ్గుతోంది. అంతమాత్రాన డిప్రెషన్‌కు ప్రో–బయాటిక్ ఒక్కటే చికిత్స అని చెప్పడం ఈ పరిశోధన ఉద్దేశం కాదు. కానీ ఒక్క యాంటీడిప్రెసెంట్స్ మాత్రమే వాడుతున్న మూడింట రెండు వందల మందికి వెంటనే మంచి గుణం కనిపించడం లేదు. అయితే మందులు వాడుతూనే ప్రోబయాటిక్స్ తీసుకుంటున్నప్పుడు మంచి గుణమే కనిపిస్తోంది. ప్రోబయాటిక్స్‌లోని ఏ అంశం ఇలా మేలు చేస్తోందనేది కనుగొనేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. దాంతో భవిష్యత్తులో మరింత సమర్థంగా డిప్రెషన్‌కు చికిత్స అందించే వీలుంద’’ని చెబుతున్నారు అన్నా కియారా పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment