నీలి కలువలనూ సాగు చేయొచ్చు! | Artichoke medicinal properties | Sakshi
Sakshi News home page

నీలి కలువలనూ సాగు చేయొచ్చు!

Published Tue, Dec 6 2016 4:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

నీలి కలువలనూ సాగు చేయొచ్చు! - Sakshi

నీలి కలువలనూ సాగు చేయొచ్చు!

- నీలి కలువ గింజలు, దుంపల్లో ఔషధ గుణాలు
- మధుమేహం, ఊబకాయం నివారించే గుణాలున్నట్టు ఐఐసీటీ పరిశోధనలో వెల్లడి
- నీలి కలువల సాగుపై శ్రీలంక రైతుల దృష్టి  అందిపుచ్చుకుంటే మన రైతుకు ఆదాయం
 
 చెరువుల్లో కనిపించే కలువ పూలు,  రైతుల ఆదాయానికి నెలవులు కానున్నాయి. ఈ పూలను అనాదిగా దేవతార్చనలో వాడుతున్నాం. అక్కడక్కడా కలువ దుంపలను ఆహారంగా వాడే అలవాటు లేకపోలేదు. అయితే, మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధులను నివారించే ఔషధ గుణాలు నీలి కలువ (నింఫియా నౌచలి) గింజలు, దుంపల్లో పుష్కలంగా ఉన్నాయని భారతీయ రసాయనిక సాంకేతికతా సంస్థ (ఐఐసీటీ) శాస్త్రవేత్తల పరిశోధనలో ఇటీవల తేలింది. ఇప్పటికే శ్రీలకంలో వరి మాగాణుల్లో వీటిని సాగు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో దీని సాగు పద్ధతులపై శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తే మన రైతులకూ మరో ఆదాయ వనరు లభించినట్టే..
 
 మధుమేహం, ఊబకాయం ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన పరిస్థితుల్లో నీలి కలువ ఆహారోత్పత్తులకు భవిష్యత్తులో మంచి గిరాకీ రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. వీటి దుంపలు, విత్తనాలు కరువు కాలంలో ప్రజలు ఆహారంగా వినియోగించే వారట. నీలికలువ పూవులను పూజాదికాలలో వాడుతుంటారు. ఆకులను టిఫిన్ సెంటర్లలో వాడుతున్నారు. అయితే నీలికలువ దుంపలు, విత్తనాలలో ఔషధ గుణాలు ఉన్నాయని తేలడంతో భవిష్యత్తులో వీటికి మంచి గిరాకీ ఉండే అవకాశం ఉంది.

 ప్రమాదకర జబ్బుల నివారణకు మంచి ఆహారం...
 తెల్లగా పాలిష్ చేసిన బియ్యం, గోధుమ పిండి, ఒకటికి రెండుసార్లు శుద్ధి చేసిన వంట నూనెల వినియోగం పెరిగింది.  దీనివల్ల పోషకాలు, మాంసకృత్తులు కోల్పోతున్నాం. మన ఆహారంలో ఉత్త పిండి పదార్థం మాత్రమే మిగులుతోంది.  దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమై వెనువెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయి పెరుగుతోంది. ఫలితంగా మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. అయితే, నీలికలువ పూలు, దుంపల ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని ప్రధాన శాస్త్రవేత్త డా. అశోక్ కె. తివారి నేతృత్వంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తల బృందం ఇటీవల కనుగొంది.

 నీలికలువ మొక్కలను తూ. గో. జిల్లా కాకినాడ సమీపంలోని చేబ్రోలు గ్రామ చెరువు నుంచి సేక రించారు. గ్రామస్తులు ఈ మొక్కలను పశువులకు మేతగా వాడుతున్నారు. నీలి కలువ మొక్కల దుంపలు, విత్తనాలను గతంలో కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆహారంగా తీసుకునేవారని తెలుసుకున్న ఐఐసీటీ శాస్త్రవేత్తలు పరిశోధించగా.. పలు ఔషధగుణాలున్నాయని తేలింది.  పిండి పదార్థాలను, కొవ్వులను విడగొట్టే ఎంజైమ్‌లపై ఇవి ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వ్యాధికారకాలైన ఫ్రీరాడికల్స్‌ను శరీరం నుంచి తొలగిస్తున్నట్లు తేలినట్లు డా. అశోక్ కె. తివారీ తెలిపారు.  

 విత్తనాలను పొడిగా చేసి పాలలో కలిపి తీసుకోవచ్చు. లేదా పిండిగా చేసుకొని చపాతీలు, పూరీలు వండుకోవచ్చు. నీలి కలువ దుంపలను బంగాళా దుంపలా కూరలా  చేసుకొని తినొచ్చు. తద్వారా రక్తంలోకి గ్లూకోజ్ విడుదల నిదానంగా జరుగుతుంది. దీనివల్ల మధుమేహం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, జీర్ణకోశ సంబంధ సమస్యలను సమర్థవంతంగా నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 నీలి కలువల సాగు ఇలా..
 నీలికలువలను చెరువులు, కుంటలు, కందకాలు, ఫామ్ పాండ్లలో, కుండీల్లో సాగు చేయవచ్చు. పూలు పూసేందుకు మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. వీటి సాగులో ఎలాంటి సేంద్రియ రసాయన ఎరువులు వాడనవసరం లేదు. శ్రీలంక వాసులు నీలి కలువ దుంపలను తింటారు. వరి పొలాల్లో సాగు చేసి ఎకరాకు టన్ను దిగుబడి సాధిస్తున్నట్లు సమాచారం. అక్కడి రైతులు అనుసరిస్తున్న సాగు పద్ధతి ఇదీ.. తొలకరిలో వేసవిలో విత్తుకోవచ్చు. ముందుగా విత్తనాలు, లేదా దుంపలను ఎంపిక చేసుకోవాలి. వీటిని నీడన ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. పాదుల మధ్య మూడు అడుగులు ఎడం ఉండేలా దుంపలను లేదా విత్తనాలను పైపైన నాటుకోవాలి. సాళ్ల మధ్య రెండు, మూడు అడుగుల ఎడం ఉండేలా నాటుకోవాలి. మూడు నుంచి నాలుగు వారాలకు మొలక వస్తుంది. లేదా మెత్తగా జల్లించిన బంకమన్నులో విత్తనాలను ఉంచి అంగుళం లోతు నీరు గల పాత్రలో ఉంచాలి. పాత్రను తగినంత ఎండ తగిలే చోట ఉంచాలి. వేరే చోట నాటుకోవటానికి కుండల్లో పెంచే మొక్కలు అనుకూలం. మూడు, నాలుగు ఆకులు వచ్చాక.. ఆ మొక్కలను పొలంలో నాటుకోవచ్చు. నీరు నింపిన పెద్ద పాత్రలోకి లేదా చెరువుల్లోకి మార్చుకోవచ్చు. నాటుకునే దుంపకు కొత్తగా వచ్చిన చిగురు ఒక్కటయినా ఉండేలా చూసి, కత్తిరించి నాటుకోవచ్చు.
 - సాగుబడి డెస్క్
 
 నీలి కలువ సాగు పద్ధతిపై కృషి జరగాలి
 నీలి కలువలో పలు రకాల ఔషధ గుణాలున్నట్టు మా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధుల నివారణకు నీలి కలువ ఆహారోత్పత్తులు బాగా పనిచేస్తాయి. భవిష్యత్తులో వీటికి మార్కెట్లో గిరాకీ వస్తుంది. నీలి కలువ సాగు పద్ధతులపై స్థానికంగా మరింత కృషి జరిగితే రైతులకు మంచి ఆదాయ వనరు లభిస్తుంది.
 - డాక్టర్ అశోక్ కె. తివారి, ప్రధాన శాస్త్రవేత్త, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement