గంగి గోవు పాలు గరిటెడైన ను చాలు... అన్నాడు వేమన!
మంచి ఖర్జూరాలు రెండు తిన్న చాలు... అంటోంది వైద్యం!
ఖర్జూరం... ఎడారులలోని ఒయాసిస్సుల దగ్గర పండి... ఒంటెల మీద ప్రయాణించి...
మానవ సమాజంలోకి ప్రవే శించి... మన నాలుకల మీద కూర్చుని...
తియ్య తియ్యగా... రంజు రంజుగా నడయాడుతూ...
మనకి శక్తి నిచ్చి... మన చేత తైతక్కలాడిస్తూ...
తన రాజసాన్ని నిలుపుకుంటోంది...
ఖజురహో శిల్పంలా ఎడారిలో ఠీవిగా నిలబడుతోంది!
ఎన ర్జీ సలాడ్, బొబ్బట్లు, ఖీర్, పికిల్, షేక్...
ఎలా కావాలంటే అలా మలుచుకుని... తయారుచేసుకుని... ఆస్వాదించండి...
365 డేస్ దొరికే డేట్స్‌కి ప్రత్యేకమైన డేట్ లేదు...
24x7 దొరుకుతూనే ఉంటాయి..!
ఖర్జూరం షేక్
కావలసినవి:
ఖర్జూరాలు - 100 గ్రా. (సన్నగా తరగాలి); పాలు - 2 కప్పులు; వెనిలా ఐస్‌క్రీమ్ - 4 స్కూపులు; మీగడ - 8 టీ స్పూన్లు (చిక్కగా చిలకాలి); చెర్రీలు - 4 (ముక్కలుగా తరగాలి)
తయారీ:
మిక్సీలో కప్పు పాలు, ఖర్జూరం ముక్కలు వేసి మెత్తగా పేస్ట్‌లా చేయాలి
మిగిలిన ఒక కప్పు పాలు, వెనిలా ఐస్‌క్రీమ్ జత చేసి మరో మారు మిక్సీ తిప్పాలి తయారైన మిశ్రమాన్ని పొడవుగా ఉండే గ్లాసులలో పోసి, పావు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి
రెండు టీ స్పూన్ల మీగడ, చెర్రీ ముక్కలతో అలంకరించి, వెంటనే అందించాలి.
ఖర్జూరాల ఊరగాయ
కావలసినవి:
సన్నగా తరిగిన ఖర్జూరాలు - కప్పు; ఆవాలు - అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; మిరప్పొడి - 2 టీ స్పూన్లు; ఇంగువ - పావు టీ స్పూను; చింతపండు గుజ్జు - టేబుల్ స్పూను; కరివేపాకు - 3 రెమ్మలు; నూనె - టీ స్పూను; ఉప్పు - తగినంత
తయారీ:
బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి
కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి
అర కప్పు నీళ్లు, ఖర్జూరం ముక్కలు వేయాలి
నీళ్లు మరుగుతుండగా మంట తగ్గించి మూత పెట్టి ఉడికించాలి
ఖర్జూరాలు బాగా ఉడికిన తర్వాత ఉప్పు, మిరప్పొడి, చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి
చివరగా ఇంగువ వేసి బాగా కలిపి దించేయాలి
బాగా చల్లారిన తర్వాత గాలి చొరని డబ్బాలోకి తీసుకుని, ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి
ఆపిల్ - డేట్స్ ఖీర్
కావలసినవి:
ఆపిల్ - 1 (సన్నగా తరగాలి); పంచదార - టీ స్పూను; పాలు - రెండున్నర కప్పులు (ఫ్యాట్ తక్కువ ఉన్నవి); సన్నగా తరిగిన ఖర్జూరాలు - కప్పు; గార్నిషింగ్ కోసం: వాల్‌నట్స్ - టేబుల్ స్పూను (సన్నగా తరగాలి); ఆపిల్ - చిన్న ముక్క (సన్నగా తరగాలి)
తయారీ:
నాన్‌స్టిక్ పాత్రలో... ఆపిల్ ముక్కలు, పంచదార, మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి సన్న మంట మీద ఆపకుండా కలుపుతూ, కొద్దిసేపు ఉడికించి దించేయాలి
చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచాలి
ఒక పాత్రలో పాలు, ఖర్జూరం తరుగు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి సన్నని మంట మీద పది నిముషాలు ఆపకుండా కలుపుతూ ఉడికించి దించేయాలి
చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచి తీయాలి
సర్వ్ చేసే ముందు ఉడికించిన ఆపిల్ మిశ్రమాన్ని, ఖర్జూరం మిశ్రమానికి జత చేసి నెమ్మదిగా కలపాలి
వాల్‌నట్స్ తరుగు, ఆపిల్ ముక్కలతో అలంకరించి చల్లచల్లగా అందించాలి.
డేట్స్ ఎనర్జీ సలాడ్
కావలసినవి:
క్యాలీఫ్లవర్ తరుగు - అర కప్పు; సన్నగా తరిగిన ఖర్జూరాలు - అర కప్పు; అరటిపండు - 1 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); కమలాపండు - 1 (తొనలు తీయాలి); ఆపిల్స్ - 2 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); నిమ్మరసం - అర టేబుల్ స్పూను; సన్నగా ముక్కలు చేసిన నిమ్మ తొనలు - అర టీ స్పూను; నూనె - అర టేబుల్ స్పూను; వెనిగర్ - అర టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; మిరియాల పొడి - తగినంత
కమలాపండ్ల డ్రెసింగ్ కోసం...
గట్టి పెరుగు - ముప్పావు కప్పు; కమలాపండ్ల రసం - 4 టీ స్పూన్లు; ఆవ పొడి - అర టీ స్పూను; పంచదార పొడి - అర టీ స్పూను; ఉప్పు - తగినంత
తయారీ:
ఒక పాత్రలో గట్టి పెరుగు, కమలాపండ్ల రసం, ఆవ పొడి, పంచదార పొడి, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపి సుమారు అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి
ఒక పాత్రలో సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్‌కి కొద్దిగా నీళ్లు జత చేసి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించి, చల్లార్చాలి
నూనె, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఊరనివ్వాలి
ఒక పాత్రలో ఉడికించిన క్యాలీ ఫ్లవర్, సన్నగా తరిగిన ఖర్జూరాలు, అరటిపండు ముక్కలు, కమలాపండు తొనలు, ఆపిల్ ముక్కలు, నిమ్మరసం, సన్నగా తరిగిన నిమ్మ తొనలు, నూనె, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి
తయారుచేసి ఉంచుకున్న కమలాపండ్ల డ్రెసింగ్ వేసి చల్లగా అందించాలి
ఖర్జూరం బొబ్బట్లు
కావలసినవి:
గోధుమపిండి - కప్పు
పాలు - 4 టేబుల్ స్పూన్లు
గింజలు తీసి సన్నగా తరిగిన ఖర్జూరాలు - ముప్పావు కప్పు
నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు (వేయించి మెత్తగా పొడి చేయాలి)
బ్రౌన్ సుగర్ - పావు కప్పు (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది)
పాలు - 2 టేబుల్ స్పూన్లు
గోధుమ పిండి - కొద్దిగా (చపాతీలకు అద్దడానికి)
నెయ్యి - టీ స్పూను (కరిగించాలి)
తయారీ:
ఒక పాత్రలో గోధుమపిండి, పాలు వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి పైన మూత ఉంచి సుమారు గంట సేపు నాననివ్వాలి
పిండిని ఉండలుగా చేసుకుని ఒక్కోదానిని చపాతీలా వత్తాలి
ఒక పాత్రలో ఖర్జూరం తరుగు, నువ్వుల పొడి, బ్రౌన్ సుగర్, పాలు వేసి కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
ముందుగా ఒత్తి ఉంచుకున్న చపాతీలో ఖర్జూరం మిశ్రమాన్ని తగినంత పరిమాణంలో ఉంచాలి
నాలుగు వైపులా మూసేసి, పిండి అద్ది, చపాతీలా ఒత్తాలి
అంచులను చేతితో జాగ్రత్తగా పల్చగా వచ్చేలా ఒత్తాలి
స్టౌ మీద పెనం ఉంచి, ఒక్కో బొబ్బట్టు వేసి చుట్టూ నెయ్యి వేసి బాగా కాల్చి, రెండవ వైపు తిప్పాలి
రెండో వైపు కూడా నెయ్యి వేసి కాల్చి తీసేయాలి
వేడివేడిగా అందించాలి
ఇందులో క్యాల్షియమ్, ఐరన్ అధికంగా ఉంటాయి.
ఎండు ఖర్జూరంలో ప్రతి 100 గ్రాములకు
ఖర్జూరం చెట్లు సుమారు 10 - 20 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి.
తాటి చెట్ల మాదిరిగానే వీటిలోనూ ఆడ చెట్లు, మగ చెట్లు వేర్వేరుగా ఉంటాయి. ఆడ చెట్లు మాత్రమే ఫలాలనిస్తాయి.
ఈ చె ట్లను పండ్ల కోసమే కాకుండా నీడ, పశువుల మేత, కలప, ఆయుధాలు, తాళ్లు... కోసం సుమేరియన్లు పెంచినట్లుగా చరిత్ర చెబుతోంది.
5 - 8 ఏళ్ల వయసు వచ్చేసరికి ఖర్జూరపు చెట్లు కాపుకొస్తాయి.
శక్తి - 280 కిలో క్యాలరీలు
పిండి పదార్థాలు - 75 గ్రా.
చక్కెర - 60 గ్రా.
పీచుపదార్థాలు - 8 గ్రా.
కొవ్వు పదార్థాలు - 0.4 గ్రా.
మాంసకృత్తులు - 2.5 గ్రా.
నీళ్లు - 21 గ్రా.
విటమిన్‘సి’ - 0.4 గ్రా.
ఒక పండుఖర్జూరంలో
శక్తి - 23 కిలో క్యాలరీలు
కొవ్వు పదార్థాలు - 0.03 గ్రా.
పిండి పదార్థాలు - 6.23 గ్రా.
మాంసకృత్తులు - 0.2 గ్రా.
ఖర్జూరాలను ఒకప్పుడు అత్యధికంగా సాగు చేసిన దేశం ఇరాక్. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరం పంట ఇక్కడే పండేది. ఇక్కడి నాణేల మీద, స్టాంపుల మీద ఖర్జూరపు చెట్ల బొమ్మలు కనిపిస్తాయి.
ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఏటా 11 లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేస్తూ ఈజిప్టు ప్రథమ స్థానంలో వుంది.
సహారా వాసులు మూడింట రెండొంతుల ఆదాయాన్ని ఈ పంట నుంచే పొందుతున్నారు.
ఏ పండైనా పండుగా ఉన్నప్పుడే రుచిగా ఉంటుంది. కాని ఖర్జూరం ఎండినా రుచిగానే ఉంటుంది. ఎండు ఖర్జూరాలను వేసవిలో వడ దెబ్బ నుండి కాపాడుకోవడానికి ఉపయోగిస్తారు.
రంజాన్ మాసంలో ఈ పండ్లతోనే ఉపవాస దీక్ష విరమిస్తారు. మహమ్మద్ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహార ంగా పవిత్ర ఖురాన్ చెబుతోంది. ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూరం చెట్లేనని చెబుతారు.
లేత ఆకుల్ని కూరగా వండుతారు, ఖర్జూరపు మొగ్గల్ని సలాడ్‌లలో వాడతారు.
కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడి చేసి గోధుమపిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు.
నో డేట్ ఫర్ డేట్స్
Published Fri, Jul 18 2014 10:07 PM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement
Advertisement