ఇంటిపంటల కాలనీ!
సేంద్రియ ‘ఇంటిపంట’లను అక్కున చేర్చుకున్న అరుదైన కాలనీ.. కల్యాణ్‌నగర్(ఫేజ్-1)! హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కల్యాణ్‌నగర్ ప్రశాంతతకు, పచ్చదనానికి ఆలవాలం. ‘సాక్షి’ ప్రారంభించిన ‘ఇంటిపంట’ల ఉద్యమంలో ఈ కాలనీ ఉత్సాహంగా పాలుపంచుకోవటం విశేషం. ఉద్యాన శాఖ నుంచి ‘ఇంటిపంట’ సబ్సిడీ కిట్లను గత ఏడాది ఈ కాలనీలోని 30 కుటుంబాలు కలసికట్టుగా తీసుకొని మేడలపైనే సేంద్రియ ఇంటిపంటల సేద్యం చేస్తున్నారు. ఆరోగ్యదాయకమైన ఇంటిపంటల సాగులో కలసికట్టుగా కదులుతున్న వారిలో కొందరి అనుభవాలు.. మీకోసం..
ఫుడ్ పాయిజనింగ్‌తో ఇంటిపంటల బాట..
న్యూసైన్స్ కాలేజీ(అమీర్‌పేట, హైదరాబాద్)లో కామర్స్ లెక్చరర్‌గా రిటైరైన చతుర్వేదుల తారకం(99890 16150) కల్యాణ్‌నగర్‌లోని సొంత అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. వంటింటి వ్యర్థాలు, మొక్కల అవశేషాలతో కంపోస్టు తయారు చేస్తూ.. ఆ కంపోస్టుతో అపార్ట్‌మెంట్ భవనంపైన ఆయన ఆదర్శప్రాయంగా ఇంటిపంటలు పండిస్తున్నారు. కుండీల్లో 20 రకాల పూలతోపాటు.. సిల్పాలిన్ మడుల్లో ఆకుకూరలు పండిస్తున్నారు. సీజన్‌లో వంగ, చిక్కుడు, దోస, కాకర, పొట్ల, బీర, టమాట పండించామని.. ప్రస్తుతం ఎండలు ముదురుతున్నందున ఆకుకూరలే ఉంచామన్నారు తారకం. తాము ఆకుకూరలు ఎక్కువగా వాడతామని, ఆకుకూరలన్నీ పండించుకున్నవే తింటున్నామన్నారు. సీజన్‌లో కూరగాయలు 50% వరకు పండించుకున్నవే తిన్నామన్నారు. వంకాయలపై పురుగుల మందు వల్ల తమ సోదరుడి కుటుంబం యావత్తూ ఆస్పత్రి పాలైన సంఘటన తనను ఇంటిపంటల వైపు ఆలోచింపజేసిందని తారకం అంటారు. మనం తినే ఆహారాన్ని వీలైనంత వరకు మనమే ఎందుకు పండించుకోకూడదన్న పూనిక అప్పటి నుంచే కలిగిందన్నారు.
సిల్పాలిన్ బెడ్స్‌లో కూరగాయలు..
ఉద్యాన శాఖ ద్వారా గత ఏడాది తీసుకున్న సిల్పాలిన్ బెడ్స్‌లో తమ ఇంటిపైన కొన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు కల్యాణ్‌నగర్‌కు చెందిన త్రిపురనేని సత్యనారాయణ. వంగ, టమాటా, దోస తదితర పంటలు పండిస్తున్నారు. తాము తీసుకున్న 4 సిల్పాలిన్ బెడ్స్‌లో ఈ సీజన్‌లో చిక్కుడు వంటి కూరగాయలు పుష్కలంగా కాశాయని ఆయన సంతృప్తిగా అన్నారు. ఎల్లారెడ్డిగూడ, యూసఫ్‌గూడ ప్రాంతంలోని 24 కాలనీల సంక్షేమ సంఘాల సమాఖ్యకు సత్యనారాయణ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. తమ కాలనీలోని 30 మందితోపాటు ఆయన కూడా ఇంటిపంటలను సాగు చేస్తుండడం విశేషం. ఆయన ఇంటి ముందున్న పనస చెట్టు పచ్చని కాయలతో చూపరులను పలుకరిస్తూ ఇంటిపంటల ఆవశ్యకతను గుర్తు చేస్తున్నట్లుంటుంది.
పంటలతోపాటు బాతులు, తాబేళ్లు! రసాయనాల అవశేషాల్లేని ఆహారం అమృతతుల్యమైనది. పచ్చని చెట్లు, పూలమొక్కలతోపాటు ఇంటిపట్టునే ఆరోగ్యదాయకమైన, పోషకాలతో కూడిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్నంతలో పండించుకోవటం చక్కని ఆరోగ్యంతోపాటు మనోల్లాసాన్నిచ్చే (దీన్నే ‘హార్టీకల్చర్ థెరపీ’ అంటున్నారు) వ్యాపకం కూడా. ఈ స్ఫూర్తితోనే కొన్ని సంవత్సరాలుగా వేగేశ్న రామరాజు తమ ఇంటి టైను ఉద్యానవనంగా మార్చారు. కుండీలు మడుల్లో వత్తుగా పచ్చని చెట్లతోపాటు పంపర పనస, బొప్పాయి, కొన్ని పండ్ల చెట్లతోపాటు, తోటకూర, పాలకూర, కొత్తిమీర, చెర్రీ టమోటాలు, మునగ.. సాగు చేస్తున్నారు. మొక్కల మధ్యలో ఏర్పాటు చేసిన పెద్ద పంజరంలో లవ్‌బర్డ్స్, బాతులు.. అటువైపు పావురాళ్లు, ఇటువైపు తాబేళ్లను పెంచుతున్నారు. ఆ టై అద్భుతమైన జీవవైవిధ్యంతో ఎల్లవేళలా కళకళలాడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన శాఖ ఇటీవల నిర్వహించిన పోటీల్లో ఆయన టై కిచెన్ గార్డెన్‌కు మొదటి బహుమతి లభించడం విశేషం.
ఇంకుడుగుంట ఉన్నప్పటికీ వర్షాభావం వల్ల ఈ ఏడాది బోరు
(200 అడుగులు) ఎండిపోయింది. పదేళ్ల క్రితమే కాలనీలో 78 ఇంకుడుగుంతలు తవ్వించారు. వీటిని వర్షాకాలానికి ముందు బాగు చేసుకున్నప్పటికీ ఇప్పుడు నీటి ఎద్దడి బారిన పడక తప్పలేదని కల్యాణ్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కూడా అయిన రామరాజు అన్నారు. ట్యాంకర్లతో నీరు తెప్పించుకుంటూ టై గార్డెన్‌ను జాగ్రత్తగా పరిరక్షించుకుంటున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఎన్నడూ ఎరుగని నీటి కొరతను అధిగమించేదెలా? వాన నీటితో బోరును రీచార్జ్ చేస్తే నీటి కొరత రాకుండా ఉంటుందా? రామరాజు (94401 92377) ఎదుట నిలిచిన ప్రశ్నలివి..!