కినోవాపై కినుకెందుకు?
అత్యధిక పోషకాలతోపాటు అంతర్జాతీయ మార్కెట్ ఉన్న చిరుధాన్యపు పంట కినోవా. బడుగు రైతు కుటుంబాలకు పోషకాహార హామీతోపాటు ఆదాయ భద్రతనివ్వగల ఈ పంటపై ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించకపోయినా.. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఒకర్ని చూసి మరొకరు సాగు చేస్తున్నారు. సాగు విస్తీర్ణం ఈ ఏడాది వెయ్యి ఎకరాలు దాటుతుందని అంచనా. అధిక దిగుబడినిచ్చే వంగడాలను అందుబాటులోకి తెచ్చే బాధ్యత ప్రభుత్వం, శాస్త్రవేత్తలదేనంటున్నారు డాక్టర్ కె. శ్రీనివాస రావు.
కినోవా పండించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నా అంచనా ప్రకారం కినోవా పంట గత ఏడాది వందల ఎకరాలలో పండించగా, ప్రస్తుత సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి వెయ్యి ఎకరాలు దాటింది. భారతదేశంలో 10.74 కోట్ల ఎకరాల్లో వరి, 7.32 కోట్ల ఎకరాల్లో గోధుమను పండిస్తున్నారు. కానీ ఈ పంటలను సాగు చేస్తున్న రైతులు గిట్టుబాటు కాక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితుల్లో భారతీయ రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కినోవా ప్రాధాన్యం విస్మరించలేనిది. మొత్తం సాగు భూమి విస్తీర్ణంలో ఒక్క శాతంలో పండించినా సుమారు 18 లక్షల ఎకరాలలో ఈ పంట సాగవుతుంది. లక్షల మంది రైతులకు ఈ పంట పండించడం, మార్కెటింగ్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించవలసిన బాధ్యత శాస్త్రవేత్తలు, ప్రభుత్వంపై ఉంది.
పండించాలి.. తినాలి.. మిగిలింది అమ్మాలి
ఈ పంటను ఖరీఫ్, రబీల్లో ఆరుతడి పంటగా సాగుచేయవచ్చు. తోటకూర జాతికి చెందిన ఈ మొక్క చాలా సున్నితమైనది. రసాయన ఎరువులు వేయకుండా, క్రిమిసంహారకాలు వాడకుండా నీమాస్త్రం వంటి సేంద్రియ ఎరువులతో మేము పండించాం. సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించి సాగు చేస్తే ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి రావచ్చు. ఇతర పంటలతో పోల్చితే కినోవా పంటకు లభించే ధర ఎక్కువే. ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉన్నా ముందు ముందు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు అందుబాటులోకి వస్తాయి. కినోవాను పండించే రైతు తన కుటుంబానికి అవసరమైన పరిమాణంలో ఉంచుకొని మిగిలిన పంటను అమ్ముకోవాలి. తద్వారా రైతు కుటుంబానికి ఆరోగ్యం, ఆర్థిక బలం కూడా సమకూరుతుంది. వివిధ పంటల్లో పోషకాల పట్టికను గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది.
సపోనిన్‌తో జాగ్రత్త సుమీ..
కినోవా గింజపై పొరలో సపోనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శీకాయి వలే చాలా చేదుగా ఉంటుంది. గింజ బరువులో ఈ పదార్థం సుమారు 6 శాతం ఉంటుంది. సపోనిన్ పూర్తిగా పోయే దాక కడిగిన తర్వాత మాత్రమే తినాలి. దీన్ని తొలగించడానికి బొలీవియాలో ఆధునిక యంత్రాలను వాడుతున్నారు. ఈ మిల్లు ఏర్పాటు చేయటానికి రూ. 5 కోట్ల వరకు ఖర్చవుతుంది. అయితే బొలీవియా గ్రామాల్లో ప్రజలు మాత్రం కినోవాను వేయించి, దంచి, కడిగి, ఆరబెట్టి తింటున్నారు. ఈ పద్ధతిలో అధిక శ్రమ, సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. మన రైతులు కొందరు కినోవా ధాన్యాన్ని దంచి, కడిగి, ఆరబెట్టి అమ్ముతున్నారు. కినోవా గింజ నీటిలో పడిన కొన్ని నిమిషాలలో మొలకెత్తుతుంది. తడిసిన గింజ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. బూజు క్రిముల తాకిడికి గురవుతుంది.
చింతలు తీర్చే చిన్న మిల్లు
సపోనిన్ పొరను పూర్తిగా తీసివేసేందుకు ఒక చిన్న మిల్లును బొలీవియాలో వాడుతున్నారు. దానిని తెప్పించి, అవసరమైన మార్పులు చేసి మన రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్నాటక, ఒరిస్సా, బీహార్, రాజస్థాన్, పంజాబ్‌లలో కూడా రైతులను కినోవా సాగు దిశగా ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాం. కినోవా సాగుపై విశాఖలో మే నెలలో అందరి సహకారంతో సదస్సు నిర్వహించబోతున్నాం.
వరి, గోధుమ పంటల్లో కూడా గత అరవయ్యేళ్ల కిందట దిగుబడులు తక్కువగా వచ్చేవి. శాస్త్రవేత్తల పరిశోధనల వల్ల దిగుబడి, పోషక విలువలు పెరిగాయి. నేడు మనం తింటున్న అధిక దిగుబడి వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికా, నెదర్‌లాండ్స్, ఫ్రాన్స్, బొలీవియా, పెరూ దేశాలలో కినోవాపై పరిశోధనలు జరుగుతున్నాయి. అందుకే భారతదేశంలో కూడా పుష్కలంగా పోషకాలని కలిగి ఉండి, అధిక దిగుబడి నిచ్చే కినోవా వంగడాలు రైతులకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నాను.
(వ్యాసకర్త కినోవాపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త
(098850 74764. srao123@gmail.com)