కలుపుపై కసితో యంత్రాన్ని సృష్టించాడు!
- పాత పరికరాలతో కలుపు యంత్రం రూపొందించిన రైతు
- 3 గంటల్లో 2 లీటర్ల పెట్రోల్‌తో ఎకరాలో పైపాటు పూర్తి
కలుపు ఖర్చును తగ్గించుకోవడంతోపాటు.. కూలీలు, అరకలపై ఆధారపడడం కూడా తగ్గించుకోవడం చిన్న రైతు మనుగడకు అనివార్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఓ చిన్న రైతు తపనకు సృజనాత్మకత తోడవడంతో అద్భుత కలుపు యంత్రం ఆవిష్కృతమైంది.
అల్లం వెంకటేశ్వర్లు ఓ ఆదర్శ రైతు. వరంగల్ జిల్లా కేసముద్రం ఆయన స్వగ్రామం. పదో తరగతి వరకు చదువుకొని వ్యవసాయం చేస్తున్నారు. తన ఐదెకరాల పొలంలో పత్తి, మిర్చి పంటలను సాగు చేస్తున్నారు. పొలాల్లో కలుపును నిర్మూలించేందుకు పంటకాలంలో ఏడు సార్లు పైపాటు చేయాలి. అరకతో ఒక్కోసారి రూ. వెయ్యి చొప్పున ఏడాదికి 5 ఎకరాలకు రూ.35 వేల వరకు ఖర్చవుతోంది. ఒక్కోసారి అదునులో అరకలు దొరక్క పొలాలు బీడుగా మారే పరిస్థితి. ఈ సమస్యను అధిగమించేందుకు కలుపు తీసే యంత్రం (పవర్ వీడర్) కొనాలని వెంకటేశ్వర్లు భావించారు. అయితే మార్కెట్లో వాటి ధరలు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండటంతో ఆ ప్రయత్నం విరమించుకొని తానే స్వంతంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
పాత పరికరాలు కొత్త కలుపు యంత్రం..
మార్కెట్లో ఉన్న పవర్‌వీడర్‌లకు గేర్లు ఉండవు. దీని వల్ల వేగాన్ని నియంత్రించలేక వాటి వెంట పరుగులు పెట్టి రైతు త్వరగా అలసిపోతాడు. మలుపుల్లో వెనుకకు యంత్రాన్ని నడపటం వీలుకాదు. పైగా వీటి ఇంధన సామర్థ్యం చాలా తక్కువగా ఉండటం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ యంత్రాల ధరలు కూడా చిన్న రైతులకు అందుబాటులో ఉండవు. తాను రూపొందించే యంత్రంలో ఈ లోపాలన్నింటిని అధిగమించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు వెంకటేశ్వర్లు. ముందుగా పాత పవర్ వీడర్ గేర్‌బాక్స్, ఆటో గేర్‌బాక్స్, జీకే200 వాటర్‌పంప్‌లను కొనుగోలు చేశారు. వీటన్నింటిని అమర్చేందుకు ఇనుప బద్దెలను వెల్డింగ్ చేసి చ ట్రం తయారు చేశారు.
ముందుగా ఆటో గేర్‌బాక్స్‌కు ఇనుప చక్రాలను అమర్చి చట్రం కిందివైపున అమర్చారు. వాటర్ పంపు ఇంజిన్‌ను మరో వైపు పవర్ వీడర్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. దీనివల్ల రైతు అలసట లే కుండా యంత్రాన్ని నడపగలుగుతాడు. మొక్కలు పాడవవు.
కిరోసిన్ లేదా పెట్రోల్‌తో నడుస్తుంది..
ఈ యంత్రం కిరోసిన్ లేదా పెట్రోల్‌తో పని చేస్తుంది. అయితే ఇంజిన్ మాత్రం పెట్రోల్‌తో స్టార్టవుతుంది. ఇంజిన్ స్టార్టయ్యాక పవర్ వీడర్ హ్యాండిల్‌కు ఎడమవైపు ఉన్న క్లచ్‌ను పట్టుకుని కుడివైపు గేర్‌ను మార్చాలి. తర్వాత కుడివైపు హ్యాండిల్ కు ఉన్న ఎక్స్‌లేటర్‌ను రైజ్ చేసి వదిలితే చాలు యంత్రం ముందుకు కదులుతుంది. వేగాన్ని నియంత్రించేందుకు రెండు, మూడు గేర్లు.. వెనక్కి వచ్చేందుకు రివర్స్ గేర్ వాడాలి. ఇందులో 16 అంగుళాల వెడల్పు గల రోటావేటర్‌ను అమర్చారు. సాళ్ల మధ్య అంతే వెడల్పు ఉన్న ఏ పంటల్లోనయినా దీనితో అంతరకృషి చేయవచ్చు. కావాలంటే ఈ దూరాన్ని పెంచుకోవచ్చు. నేల రకాన్ని బట్టి సర్దుబాటు చేసుకునేందుకు చిన్న లివర్‌ను ఏర్పాటు చేశారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు, పొలంలో వెనక్కు వచ్చేటప్పుడు రోటావేటర్ తిరగకుండా ఉండేందుకు మరో లివర్‌ను ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ చేయగానే కలుపును పూర్తిగా పెకలించి, ముక్కలు చేసి మట్టిలో కలిపివేస్తుంది.
ఎకరం పత్తిలో మూడు గంటల్లో సాలు ఇరవాలు (నిలువు, అడ్డం) పైపాటు పూర్తవుతుంది. దీనికి 3 లీటర్ల కిరోసిన్ లేదా 2 లీటర్ల పెట్రోల్ ఖర్చవుతుంది. అదునులో పని పూర్తవుతుంది. కూలీల ఖర్చు తగ్గుతుంది. సమస్యల సాలెగూడులో చిక్కిన రైతులోకానికి వెంకటేశ్వర్లు రూపొందించిన అంతరకృషి యంత్రం పెను ఊరట.
- దూదికట్ల రామాచారి, సాక్షి, కేసముద్రం, వరంగల్ జిల్లా
ఒళ్లలవకుండా పైపాటు చేసుకుంటున్నా..
అదును వెంబడి పాటు పడకపోతే కలుపు పెరుగుతుంది. కూలీలను పెడితే చాలా ఖర్చవుతుంది. ఒక్కసారి అదును తప్పినా పొలంలో కలుపును నిర్మూలించటం ఇంటిల్లిపాదీ కష్టపడ్డా వల్ల కాదు. సొంతంగా ఎడ్లను కొని మేపే స్థోమత లేక కలుపు యంత్రం తయారీకి పూనుకున్నా. దీంతో ఒళ్లు అలవకుండా పై పాటు చేస్తున్నా. రైతులు కోరితే తయారు చేసి ఇస్తాను.
- అల్లం వెంకటేశ్వర్లు (949211 114599), కేసముద్రం, వరంగల్ జిల్లా
25న వరి, మిరప, పత్తి, అపరాల్లో చీడపీడలపై శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగయ్యే వరి, మిరప, పత్తి, అపరాల పంటలను ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణపై ఈ నెల 25న రైతునేస్తం ఫౌండేషన్ రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతులు, శాస్త్రవేత్తలు కషాయాలు, ద్రావణాల తయారీపై శిక్షణ ఇస్తారు. 0863-2286255, 83744 22599 నంబర్లలో సంప్రదించవచ్చు.