ప్రకృతికి దగ్గరి నేస్తం ‘అన్నపూర్ణ’! | Motivational close to nature of the former | Sakshi
Sakshi News home page

ప్రకృతికి దగ్గరి నేస్తం ‘అన్నపూర్ణ’!

Published Mon, Jun 30 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

ప్రకృతికి దగ్గరి నేస్తం ‘అన్నపూర్ణ’!

ప్రకృతికి దగ్గరి నేస్తం ‘అన్నపూర్ణ’!

ప్రకృతికి అనుగుణంగా ఏరువాక..
 
ప్రతి చినుకునూ ఒడిసిపట్టుకొని రేపటికి దాచే గుణం కలిగినదే ‘అన్నపూర్ణ’ పంటల నమూనా
ఆచ్ఛాదన.. సంప్రదాయ విత్తనం.. సేంద్రియ సాగు విధానాలు నీటి ఎద్దడిని తట్టుకోగల అదనపు శక్తినిస్తాయి

 
రుతుపవనాలు ప్రవేశించాయన్న శుభవార్త రైతులల్లో కోటి ఆశలు రేపింది. కానీ, మృగశిరతోపాటే ఆరుద్ర కార్తె కూడా దాటిపోతున్నా.. వరుణ దేవుడు కరుణించకపోయే సరికి.. ఆ ఆనందం అంతలోనే ఆవిరై పోయింది. చల్లటి గాలులు వీచాల్సిన రోజుల్లో వడగాడ్పులు వీస్తుండడం రైతాంగంలో తీవ్ర ఆందోళన కలిగించడం సహజమే. ఇటువంటి వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా ‘అన్నపూర్ణ’ నమూనా ప్రకృతి వ్యవసాయం ఎంతవరకు తట్టుకొని నిలబడుతుంది? చాలా మంది రైతులు ఈ సందేహాన్నే వ్యక్తం చేస్తున్నారు..
 నిజమే.. పదిమందికీ అన్నం పెట్టే రైతన్న పట్ల కన్నెర్రజేసిన ప్రకృతి మాతకు ఎదురొడ్డి సాగు చేయడం అంత తేలిగ్గా సాధ్యమయ్యే పనికాదు. కానీ, ప్రకృతికి అనుగుణంగా ఏరువాక నడిపిస్తే కొంతలోకొంత నిలదొక్కుకోగలుగుతాం. అదెలాగో తెలుసుకుందాం..
 ‘సాగుబడి’లో ప్రచురితమవుతున్న ‘అన్నపూర్ణ- అక్షయపాత్ర’ వ్యాస పరంపరలో గతంలో మనం అనేకసార్లు ప్రస్తావించుకున్నట్లు.. అన్నపూర్ణ పంటల నమూనా ప్రకృతికి చాలా దగ్గరి నేస్తం.

 వానలు కురిపించేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్న వాన దేవుడు రాల్చిన చిన్న చిన్న చినుకులను ఒడిసిపట్టుకొని చాలా జాగ్రత్తగా రేపటికి దాచేగుణం ‘అన్నపూర్ణ’ది. ఈ పంటల నమూనాలో అంతర్భాగంగా కందకాలు, తల్లి కాలువలు చేస్తున్న ఉపకారమేంటో మనకు బాగా తెలుసు. దీంతోపాటు.. కురిసిన చినుకులు ఎండకు ఆవిరైపోకుండా కాపాడేది ‘మల్చింగ్’. కరుడుగట్టిన కరువులో సైతం నేలను చీల్చుకుంటూ మొలకై, మొక్కై పంటను అందించే శక్తి మన స్థానిక విత్తనాలకుంది.వర్షాభావ పరిస్థితుల్లో మల్చింగ్‌కి, స్థానిక విత్తనాలకు ఎంతటి ఎంతో ప్రాధాన్యత ఉంది.

 మల్చింగ్: దీన్నే ‘ఆచ్ఛాదన’ అని కూడా పిల్చుకుంటున్నాం. మన శరీరానికి కప్పిన నూలు వస్త్రం చెమటను పీల్చుకొని తనలో ఇముడ్చుకునే విధంగా.. ఆచ్ఛాదన నేలలో పడిన చినుకులు ఎండకు, గాలికి ఆవిరైపోకుండా తనలోనే ఇముడ్చుకొని మొక్కలకు తేమను అందిస్తుంది. అందుకే అన్నపూర్ణ నమూనాలో మట్టి పరుపునకు మట్టి పరుపునకు మధ్య వేసిన కాలువల్లో పరుపుల మీద నుంచి తీసిన కలుపు మొక్కలు, పంట వ్యర్థాలను వేయడం వలన.. నేలలో తేమ ఎక్కువ రోజులు నిలుస్తుంది. పొలం చుట్టూ, పొలం బయట రాలే ఆకులను మట్టి పరుపు మీద అక్కడక్కడా వేసుకునే పండ్ల మొక్కల పాదుల చుట్టూ ఆచ్ఛాదనగా పేర్చుకోవాలి. ఈ ఆకులు కుళ్లి ఎరువుగా మారి తిరిగి మొక్కకు పోషకాలను అందిస్తాయి.

వర్షాలు లేవని కూరగాయల విత్తనాలతో నారు పోసుకో కుండా ఎదురు చూడొద్దు. నారుపోసిన స్థలంలో ఒకటి రెండు అడుగుల ఎత్తులో చిన్న చిన్న కర్రలతో పందిరి వేసుకొని, దాని మీద కొబ్బరి లేదా తాటాకు మట్టలను వేసుకుంటే ఎండవేడిమి తగ్గి.. నారు బాగా పెరుగుతుంది. ఈ లోపు అప్పుడప్పుడూ వర్షాలు పడుతూనే ఉంటాయి. కాబట్టి అదనుచూసి మొక్కలు నాటు వేసుకోవచ్చు. నారు పోసే టప్పుడు గానీ, ఊడ్చేటప్పుడు గానీ బీజామృతంలో శుద్ధి చేసుకోవడం వల్ల కూడా వర్షాభావ పరిస్థితుల నుంచి కొంతకాలం తనను తాను కాపాడుకోగలుగుతుంది. నాటిన మొక్కల చుట్టూ లేదా మట్టి పరుపు అంతటా గడ్డి లేదా ఆకులతో ఆచ్ఛాదన చేసుకుంటే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. పండ్ల మొక్కల నీడ కూడా ఆచ్ఛాదనే.. వాటి కింద కూడా నారు పోసుకోవచ్చు. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయనుకున్నప్పుడు తప్పకుండా తక్కువ నీటితో పండే పంటలను వేసుకోవడం శ్రేయస్కరం.
 మరొక్క ముఖ్య విషయమేమిటంటే.. స్థానికంగా దొరికే సంప్రదాయ విత్తనాలు నీటి ఎద్దడికి, మారుతున్న వాతావ రణ పరిస్థితులకు తట్టుకొని నిలబడగలుగుతాయి. సేంద్రియ సాగు విధానాలు నీటి ఎద్దడిని తట్టుకోగల అదనపు శక్తిని సమకూరుస్తాయి. హైబ్రిడ్ విత్తనాలకంటే ఈ విత్తనాలను నాటుకోవడమే మంచిది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడే క్రమంలో నీటి అవసరం కూడా పెరుగు తుంది. కాబట్టి సేంద్రియ సాగు విధానాలను ఆచరించడమే మేలు. అలాగే ప్రతి ఏటా విత్తనాల కోసం అధికారుల చుట్టూ, వ్యాపారస్థుల చుట్టూ తిరిగేకంటే మన విత్తనాలను భద్రపరచుకోవడానికి అలవాటు పడితే రైతు బలపడతాడు.. సుస్థిరంగా నిలబడగలుగుతాడు.

- డి. పారినాయుడు (9440164289),  అన్నపూర్ణ ప్రకృతి  వ్యవసాయ పంటల నమూనా రూపశిల్పి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement