పిజ్జా మజాలు... | Pizza majalu ... | Sakshi
Sakshi News home page

పిజ్జా మజాలు...

Published Sat, Mar 22 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:00 AM

పిజ్జా మజాలు...

పిజ్జా మజాలు...

దిబ్బరొట్టెకు కాస్త పొగరెక్కువ...
 పెనం మీద వేస్తే మధ్యకు ఉబ్బుతుంది...
 డబుల్‌రొట్టె కూడా అంతే...
 కాల్చాక డబులవుతుంది...
 పొగరు విగరెప్పుడూ వగరే కదా!
 దిబ్బరొట్టెలోని దిబ్బకు కాస్త థిమ్మిసా కొట్టి...
 డబుల్ రొట్టెను సింగిల్ చేస్తే...
 వచ్చిన వినయరూపమే పిజ్జా...
 వినయమనే ఆభరణమొక్కటే నచ్చక...
 పిజ్జా సాస్‌తోనూ, వెజ్జీ వ ర్క్స్‌తోనూ అలంకరించారు.
 అవే టాప్స్...
 టాప్స్‌తో భూషించాక టాప్‌గా ఉండకుండా ఎలా ఉంటుంది?  
 అందుకే టాపింగ్స్‌తో టాప్‌గా ఉండే పిజ్జాలు తయారుచేసుకోండి.
 పిజ్జా మేనమామ మన దిబ్బరొట్టే...
 దాని పుట్టింటి నిజానిజాలు మనకూ తెలుసు...
 అందుకే... అప్పుడప్పుడు మాత్రమే...
 పిజ్జా చేసుకోండి... మజాగా ఉండండి...

 
 వెజ్జీ వర్క్స్
 
 కావలసినవి:
 లెట్యూస్ ఆకులు - కప్పు, చెర్రీ టొమాటోలు - 2;
 ఫెటా చీజ్ - టేబుల్ స్పూను, పర్మెజాన్ చీజ్ - టీ స్పూను
 
 తయారీ:
 పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక వాటి మీద ముందుగా ఫెటా చీజ్, పర్మెజాన్ చీజ్ వేయాలి.
     
 చెర్రీ టొమాటో ముక్కలు, లెట్యూస్ ఆకులు అందంగా అమర్చి అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరవాత తీసేయాలి.
 
 పిజ్జా బేస్
 
 కావలసినవి:
 మైదా - కప్పు
 ఉప్పు - చిటికెడు
 బేకింగ్ సోడా/ఈస్ట్ - చిటికెడు
 నీరు - పావు కప్పు; మోజరెల్లా చీజ్ - తగినంత
 
 తయారీ:
 ఒకపాత్రలో మైదా, బేకింగ్ సోడా/ఈస్ట్, నీళ్లు వేసి చపాతీపిండిలా కలిపి సుమారు గంటసేపు పక్కన ఉంచాలి.
     
 చపాతీ మాదిరిగా ఒత్తి బేకింగ్ ట్రేలో ఉంచాలి.
     
 పిజ్జా సాస్‌ను పొరలా పూయాలి. (అంచుల్లో అంగుళం మేర మాత్రం వదిలేయాలి)
     
 మోజరెల్లా చీజ్ పూయాలి.
     
 మనం ఎంచుకున్న వస్తువులతో టాపింగ్ చేసి అవెన్‌లో ఉంచి సుమారు 30 నిమిషాలు బేక్ చేసి తీసేయాలి.
 
 పెప్పరోనీ
 
 కావలసినవి:
 ల్యాంబ్ పెప్పరోనీ సలామీ - 10 ముక్కలు
 థైమ్ - చిటికెడు
 
 తయారీ:
 పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక ముందుగా చిటికెడు థైమ్ చల్లాలి.
     
 ల్యాంబ్ పెప్పరోనీ సలామీ స్లైసులను వరుసక్రమంలో అందంగా అమర్చి అవెన్‌లో అరగంటసేపు ఉంచి దించేయాలి.
 
 మార్గెరిటా
 
 కావలసినవి:
 తులసి ఆకులు - పావు కప్పు
 
 తయారీ:
 ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు.పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక దాని మీద ఈ తులసి ఆకులు అందంగా అమర్చి, అవెన్‌లో ఉంచి అరగంటయ్యాక తీసేయాలి.
 
 పిజ్జా సాస్
 
 కావలసినవి:
 టొమాటో ముక్కలు - కప్పు
 తులసి ఆకులు - 10
 ఉప్పు - చిటికెడు
 మిరియాలపొడి - చిటికెడు
 ఒరిగానో - పావు టీ స్పూను
 ఉల్లి తరుగు - పావు కప్పు
 వెల్లుల్లి రేకలు - 5 (సన్నగా కట్ చేయాలి)
 
 తయారీ:
 టొమాటో తొక్కలను జాగ్రత్తగా తీసి సన్నగా కట్ చేసుకోవాలి.
     
 బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి లేత గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి, తరిగి ఉంచుకున్న టొమాటో ముక్కలు, ఉప్పు వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి.
     
 మిరియాలపొడి, ఒరిగానో, తులసి ఆకులు వేసి ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి.
 
 పిరిపిరి చికెన్
 
 కావలసినవి:
 గ్రిల్డ్ చికెన్ (బోన్‌లెస్) - పావుకప్పు
 చికెన్ సాసేజ్ - పావు కప్పు
 చికెన్ సలామీ - పావు కప్పు
 ఉల్లిచక్రాలు - అరకప్పు
 కరివేపాకు - నాలుగు రెమ్మలు
 పిరిపిరి సాస్ - టీ స్పూను
 
 తయారీ:
 పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక  గ్రిల్డ్ చికెన్, చికెన్ సాసేజ్, చికెన్ సలామీ వరసగా వేయాలి. వాటి మీద ఉల్లి చక్రాలు, కరివేపాకు, పిరి పిరి సాస్ వేసి అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరవాత తీసేయాలి.
 
 హార్వెస్ట్ వెజిటబుల్స్
 
 కావలసినవి:
 చెర్రీ టొమాటోలు - 10
 ఆలివ్స్ - 5
 రెడ్ క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
 ఎల్లో క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
 గ్రీన్ క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
 పుదీనా ఆకులు - కప్పు
 తులసి ఆకులు - 5
 ఉల్లి తరుగు - పావు కప్పు
 
 తయారీ:
 పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక వాటి మీద ముందుగా రెడ్ క్యాప్సికమ్ తరుగు, ఎల్లో క్యాప్సికమ్ తరుగు, గ్రీన్ క్యాప్సికమ్ తరుగు వరుసగా అమర్చాలి.
 
 పైన పుదీనా ఆకులు, తులసి ఆకులు, ఉల్లితరుగు వేసి, చివరగా ఆలివ్స్, చెర్రీ టొమాటో ముక్కలు పేర్చి, అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరువాత తీసేయాలి.
 
 బెల్జియన్ మీట్

 
 కావలసినవి:
 గ్రిల్డ్ చికెన్ (బోన్‌లెస్) - పావు కప్పు; చికెన్ మోర్టడెల్లా - పావు కప్పు; చికెన్ సలామీ - పావు కప్పు
 టర్కీ హ్యామ్ - పావు కప్పు; ఉల్లితరుగు - అర కప్పు; ఆలివ్స్ - 5; తులసి ఆకులు - 5
 జలపెనోస్ - 10 ముక్కలు
 
 తయారీ:
పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక  దాని మీద ముందుగా గ్రిల్డ్ చికెన్, చికెన్ మోర్టడెల్లా, చికెన్ సలామీ వేయాలి.
     
 టర్కీ హ్యామ్ వేసి సమానంగా పరచాలి.
     
 ఉల్లితరుగు, తులసి ఆకులు, ఆలివ్‌‌స,జలపెనోస్ ముక్కలతో అందంగా అలంకరించి అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరవాత తీసేయాలి.
 
 నోట్: ఇందులో ఉపయోగించిన వస్తువులన్నీ సూపర్‌మార్కెట్‌లో దొరుకుతాయి.
 
 చెఫ్: టి. వరుణ్
 కర్టెసీ: రుచి అండ్ ఐడొనీ;
 రోడ్ నెం.10, బంజారాహిల్స్, హైదరాబాద్
 సేకరణ: డా. వైజయంతి
 ఫొటోలు: మోర్ల అనిల్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement