కుండీ కిందే నీరు!
(ఇంటి పంట)
ఆసక్తితో ఇంటిపంటల సాగు ప్రారంభించినా ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి రోజూ మొక్కలకు నీటిని అందించటం కొంచెం ప్రయాసతో కూడిన పనే. నేల మీద పెరిగే మొక్కల కన్నా కుండీల్లోని మొక్కలు త్వరగా బెట్టకు వస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్‌కు చెందిన గంటి వెంకటేష్ (99482 72715) కుండీల కిందే నీటిని నిల్వ ఉంచి, నీటిని అవసరం మేరకు మొక్కలు ఉపయోగించుకునేలా వేర్వేరు పద్ధతుల్లో ‘సెల్ఫ్ వాటరింగ్ పాట్స్’ను తయారు చేసుకొని వాడుతున్నారు. 200 కుండీల్లో ఇంటిపంటలు పెంచుతున్న వెంకటేష్ తక్కువ ఖర్చుతోనే ఇంటిపంటల సాగు సాధ్యమేనంటున్నారు. ఈ కుండీల్లో నీటిని నింపితే వారం రోజుల వరకు ఇబ్బంది ఉండదు. ఈ పద్ధతి వల్ల ఇంటిపంటల్లో కలుపు సమస్య తీరిందన్నారు.
సెల్ఫ్ వాటరింగ్ పాట్ తయారీ ఇలా..
మొదటి పద్ధతి: ఈ పద్ధతిలో మొక్క ఉన్న కుండీతో పాటు నీటిని నిల్వ (రిజర్వాయర్ కుండీ) చేసేందుకు మరో కుండీని తీసుకోవాలి. మొక్క పెట్టదలచిన కుండీ అడుగున రెండంగుళాల కైవారంలో రంధ్రం చేసి.. అందులో నుంచి చిన్న ప్లాస్టిక్ బాటిల్ లేదా ప్లాస్టిక్ గ్లాస్‌ను కిందికి వచ్చేలా అమర్చాలి. దీన్ని కోకోపిట్, మట్టి మిశ్రమంతో నింపి.. బాటిల్ లేదా గ్లాస్ చుట్టూ చిన్న, చిన్న రంధ్రాలు పెట్టాలి. ఈ రంధ్రాల నుంచి గ్లాసులోని మట్టి మిశ్రమానికి కేశాకర్షక శక్త్తి (కాపిల్లరీ ఫోర్స్) ద్వారా తగుమాత్రంగా నీటి తేమ నిరంతరం అందుతూ ఉంటుంది. అడుగున ఉన్న రిజర్వాయర్ కుండీలో నీరు అయిపోయినప్పుడు.. పీవీసీ పైపు ద్వారా నీటిని పోస్తే చాలు. రిజర్వాయర్ కుండీలో నీటి పరిమాణం తెలుసుకోవటానికి కుండీకి సగం ఎత్తులో చిన్న రంధ్రం చేయాలి. మనం నీరు నింపుతుండగా నీటిమట్టం ఆ స్థాయికి వచ్చినప్పుడు, వర్షం ఎక్కువగా కురిసినప్పుడు అదనపు నీరు ఆ రంధ్రం ద్వారా బయటకు పోతుంది.
రెండో పద్ధతి: వాడేసిన మినరల్ వాటర్ (20 లీటర్ల) క్యాన్లు తక్కువ ధరకు లభిస్తాయి. ఈ క్యాన్లను అడ్డంగా కోసి.. అడుగు భాగాన్ని రిజర్వాయర్ కుండీగా వాడొచ్చు. పై భాగంలో నుంచి ప్లాస్టిక్ గ్లాసు (చుట్టూ చిన్న బెజ్జాలు పెట్టాలి)ను కిందికి వచ్చేలా అమర్చి.. ఆ తర్వాత మట్టి మిశ్రమంతో నింపి మొక్క నాటుకోవచ్చు.
మూడో పద్ధతి: రిజర్వాయర్ కుండీగా పెద్ద కుండీకి బదులుగా.. గట్టిగా ఉండే చిన్న ప్లాస్టిక్ కంటెయినర్‌ను ఇలా వాడొచ్చు.
- దండేల కృష్ణ, సాగుబడి డెస్క్
గడ్డి వృథాను అరికట్టే ఐడియా!
జీవాలకు మేపే గడ్డి వృథా పోకుండా చూసుకోవడం ముఖ్యం. గడ్డి వృథా పోకుండా మేపడానికి ఇదొక మార్గం. ప్లాస్టిక్ డ్రమ్ముకు గుండ్రంగా బెజ్జాలు పెట్టి.. అందులో ముక్కలు చేసిన గడ్డి వేస్తే గడ్డిని తొక్కి పాడుచేయకుండా మేకలు ఎంచక్కా తింటాయి.
సూక్ష్మ సేద్యంలో సరికొత్త ఆలోచన... (రింగ్ డ్రిప్)