కిన్నో ఆరెంజ్, మాల్టా జఫ్ఫా ప్రత్యేకతలేమిటి?
‘కొత్త బత్తాయి లోకం..!’ శీర్షికన గత వారం సాగుబడిలో ప్రచురించిన ప్రకృతి వ్యవసాయదారుడు సత్యారెడ్డి విజయగాథకు విశేష స్పందన లభించింది. ఇప్పటికి దాదాపు 2 వేల ఫోన్ కాల్స్‌కు సమాధానం చెప్పారు. బత్తాయి, కిన్నో ఆరెంజ్, మాల్టా జఫ్ఫా పండ్ల జాతుల మధ్య తేడాలపై రైతులు ప్రశ్నలు అడుగుతున్నారని సత్యారెడ్డి తెలిపారు. మరికొన్ని అంశాలు ఆయన మాటల్లోనే: కినో ఆరెంజ్ పండ్లు చెట్టుకు మధ్య, కింద భాగాల్లో గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. కూలీల ఖర్చు, జీవామృతం తయారీకి బెల్లం, శనగపిండి ఖర్చు తప్ప మరే ఖర్చూ లేదు.
బత్తాయికి, కిన్నో ఆరెంజ్‌కి మధ్య తేడా ఏమిటి?
బత్తాయిల నుంచి తీసిన రసం రెండు, మూడు గంటల్లో రుచి తేడా వస్తుంది. సహజ పద్ధతిలో సాగైన బత్తాయిల రసమైతే మరికొన్ని గంటలపాటు రుచిలో మార్పు లేకుండా ఉంటుంది. రసాయన పద్ధతిలో పండించిన కిన్నో ఆరెంజ్ పండ్ల రసం 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే సహజ పద్ధతిలో పండించిన కినో ఆరెంజ్ పండ్ల రసం దాదాపు నెల వరకు రుచిలో మార్పుండదు.బత్తాయిపై తోలు గట్టిగా ఉంటుంది. కిన్నో తోలు మెత్తగా ఉంటుంది. బత్తాయి పులుపు, తీపి కలిపిన రుచితో ఉంటే, ఇది పూర్తి తియ్యగా ఉంటుంది.కిన్నో ఆరెంజ్ సాగుకు ఎర్రనేలలు అనుకూలం. దీనికి రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. దీన్ని పంజాబ్‌లో విరివిగా సాగుచేస్తున్నారు.
కిన్నో ఆరెంజ్‌కి, మాల్టా జఫ్ఫాకి మధ్య తేడా?
మాల్టా జఫ్ఫాలో గుజ్జు ఎక్కువగా ఉంటుంది. కినో ఆరెంజ్ కంటే ఎక్కువ తియ్యగా ఉంటుంది. కిన్నో ఆరెంజ్ చెట్టు ఏడాదికి ఒకసారి కాపుకు వస్తే జఫ్ఫా ఏడాదికి 2, 3 సార్లు కాపుకు వస్తుంది. కిన్నో ఆరెంజ్‌లో 12 నుంచి 25 వరకు విత్తనాలుంటాయి. జఫ్ఫాలో విత్తనాలు తక్కువగా ఉంటాయి. రసం ఎక్కువగా ఉంటుంది. మాల్టా బ్లడ్‌రెడ్ పండు పైకి బత్తాయిలా పచ్చగా ఉండి, లోపల బాగా ఎర్రగా ఉంటుంది. ‘పొలంలో గడ్డిని తగలబెడితే నీ తల్లి చీరను తగలబెట్టినట్టే’ అంటారు పాలేకర్. అది నిజం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లో గడ్డిని క్రాస్ కట్టర్ ద్వారా కత్తిరిస్తారు. దాంతో గడ్డి భూమిలో కలిసిపోయి సేంద్రియ ఎరువుగా మారుతుంది. పశువులను తోటలోకి వదిలి గడ్డి మేపుతున్నాను. దీని వల్ల గడ్డి కత్తిరించిన తోట కన్నా నా తోట అందంగా కనిపిస్తోంది.