
న్యాయాన్ని నమ్మడమే పరిష్కారం
రెండో మాట
దేశ ప్రజలు ధైర్యంగా ఒక్కుమ్మడిగా అవినీతి వ్యవస్థను విముక్తం చేయడానికి ముందుకు రావాలంటూ జస్టిస్ అమితవ్ రాయ్ చేసిన విజ్ఞాపన ఉదారమైనదే కావచ్చు. కానీ అవినీతి పిశాచంతో చేతులు కలిపిన పాలక శక్తులు పెట్టుబడిదారీ వ్యవస్థను సాకుతున్నంతకాలం జస్టిస్ రాయ్ వేదన అరణ్యరోదనే. అందాకా, ఆదర్శవంతమైన సామాజిక వ్యవస్థను ఆవిష్కరించుకోలేం. సెక్యులర్ వ్యవస్థ రక్షణకు రాజ్యాంగబద్ధమైన జాగ్రత్తలను పాటించకుండా ఉన్నంతకాలం ఫాసిస్టు శక్తులు విజృంభిస్తూనే ఉంటాయి.
‘ఫాసిస్టు ప్రభుత్వాలు, పాలకులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారికి వెన్నుదన్నుగా కొన్ని పారా మిలటరీ శక్తులు కూడా ఉంటాయి. ఎప్పుడైతే నిరంకుశ పాలకుల, నాయకుల ధోరణులకూ, విధానాలకూ ప్రజలు సకాలంలో స్పందించి అంకుశం మాదిరిగా గళం విప్పి నిరసన తెలపరో, అప్పుడు పాల కులూ, నాయకులూ నల్లేరు మీద బండి నడకలా తమ నియంతృత్వాన్ని కొన సాగించడానికే సాహసిస్తారు. అధికారపు అహంకారం అనేది ఒక శారీరక, మానసిక బలహీనతతో కూడిన రోగం. ఎదుటివారిపైన నిష్కారణంగా విరుచు కుపడడం, హాని తలపెట్టడం వీరి ప్రత్యేక రోగ లక్షణం.’ - ప్రొఫెసర్ అకీల్ బిల్‌గ్రామి (కొలంబియా విశ్వవిద్యాలయ ఆచార్యులు. 18–2–17న హైదరాబాద్ కలెక్టివ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారత్‌లో ఫాసిజం ప్రమాదం అన్న అంశంపై అకీల్ ఇచ్చిన ప్రసంగంలోని మాటలు)
బిల్‌గ్రామి ప్రస్తావించిన ఈ ‘రోగ లక్షణం’ క్రమంగా భారత పాలకులలో కూడా ఎలా తొలుచుకు వెళుతోందో జయలలిత, శశికళ పైన మోపిన భారీ అవినీతి ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన 570 పేజీల తీర్పుతో రూఢీ అయింది. ఒక అవినీతికర ప్రభుత్వ పాలనలో వ్యక్తిగత స్థాయిలో జరిగిందని భావిస్తున్న ఈ కేసు మీద తుది తీర్పు రావడానికీ, శిక్షలు ఖరారు కావడానికీ జరిగిన జాప్యం అంతులేనివి. అంటే రెండు దశాబ్దాలు. అంటే అటు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ, ఇటు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ హయాం లలో పాలకులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించారు. అంతేకాదు, దేశ గౌరవ న్యాయ వ్యవస్థ మెడలు వంచి తమకు అనుకూల నిర్ణయాలు రాబట్టు కోవడానికి పరోక్షంగా ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి.
న్యాయ వ్యవస్థకు పెద్దపీట
జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నకాలంలోనే ముంద్రా జీపుల కుంభ కోణంలోను, అనంతర కాలాలలో కాంగ్రెస్ మంత్రి సుఖ్‌రామ్ అవినీతి వ్యవహారంలోను శిక్షలు పడ్డాయి. ప్రభుత్వ, శాసన, న్యాయ వ్యవస్థలకు స్వతంత్రంగా నిర్ణయాలు చేసేందుకు ఉన్న అధికార పరిధులను స్పష్టంగానే వివరించినప్పటికీ, ప్రత్యేకించి న్యాయ వ్యవస్థకు మాత్రం శాసన విభాగ నిర్ణయాలను సమీక్షించి వ్యాఖ్యానించే హక్కును రాజ్యాంగం కల్పించింది. అయినా పరస్పర ఉల్లంఘనలు తప్పడం లేదు. ఇందుకు ఎన్నో కారణాలు. రాజ్యాంగ లక్ష్యాలకు దూరంగా జరిగి, సెక్యులర్ వ్యవస్థ మౌలిక స్వభావాన్ని కాపాడి దేశ సమైక్యతను రక్షించడంలో పాలకులు, రాజకీయవేత్తలు ఎప్పు డైతే ప్రజా వ్యతిరేక ధోరణులకు పాల్పడినారో అప్పుడే మిగతా రాజ్యాంగ విభాగాలన్నీ కలుషితమైనాయి. పరస్పర ఉల్లంఘనలకు ఇదొక ముఖ్య కారణం.
ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ తొలిసారిగా న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి చేసిన ప్రయోగం దాని ప్రభావమే కూడా. ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రయోగం మొద లైంది. అంతవరకు న్యాయ వ్యవస్థ పరువును కాపాడుతూ వస్తున్న తీర్పులు ప్రజలలో న్యాయమూర్తుల గౌరవాన్ని ఇనుమడింపచేసేవి. న్యాయ వ్యవ స్థలోని ఈ సమతుల్యతనే ఇందిరాగాంధీ స్వార్థ ప్రయోజనాల కోసం చెడ గొడుతూ వచ్చారు. సుప్రీంకోర్టు నియామకాలలో కూడా సీనియారిటీనీ, ప్రతిభనీ తొక్కిపెట్టి విధేయతకి పెద్ద పీట వేయడంతో అత్యున్నత న్యాయ స్థానం తీర్పులు కూడా పెక్కు సందర్భాలలో ఆరోపణలకు గురికావలసి వచ్చింది. రాజకీయ పరిధిలో జరిగిన కొన్ని నిర్ణయాలు న్యాయమూర్తులలో గుబులుకీ, అనిశ్చితికీ దోహదం చేశాయి. నేటి ప్రధాని మోదీ పాలనలో కూడా ఇదే పరిస్థితి. పాలకశక్తుల లోపాయికారీ ఒత్తిళ్లకూ, సన్నాయి నొక్కు లకూ న్యాయ వ్యవస్థే కాదు; సమాచార హక్కు చట్టం కూడా బలహీన మవుతోంది. ఏలిన వారి కనుసన్నలలో ఉన్నందువల్లనే న్యాయవ్యవస్థ బిక్కు బిక్కుమంటూ తీర్పులు ఇవ్వవలసి వస్తున్నది.
ప్రజా చైతన్యమే సమాధానం
జయలలిత, శశికళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు (14–2–17) వెలువరించిన సందర్భంగా ధర్మాసనంలోని సభ్యులు జస్టిస్ అమితవ్ రాయ్, ‘దేశంలో అల్లుకుపోతున్న అవినీతి కుంభకోణాలపై పౌరులు ధ్వజమెత్తి సమర శంఖం పూరించవలసిన అవసరా’న్ని హెచ్చరించారు. ఈ హెచ్చరికకు మద్దతుగానే అకీల్ బిల్‌గ్రామి వ్యాఖ్యానించారని అర్థం చేసుకోవాలి. జస్టిస్ రాయ్ హెచ్చ రిక ప్రశంసార్హమే. కానీ న్యాయమూర్తులకూ, పాలకశక్తులకూ స్ఫురించవల సిన మొదటి సత్యం–పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్వహిస్తున్న నామమాత్రపు ప్రజాస్వామ్యంలో అట్టడుగు పేదవాడి కన్నీటిబొట్టును తుడిచే వరకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలన్న మాటలు నీటి మూటలేనని గమనించాలి.
అసలు రాజకీయ అవినీతి ఏ స్థాయిలో పరిఢవిల్లుతున్నదో తెలియచేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ చైర్మన్‌కు సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇచ్చిన ఫిర్యాదు (25–10–16)లో ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు ఉన్నా యని పత్రికలు పేర్కొన్నాయి. అయితే రెండేళ్లుగా ఈ ఫైల్‌పై విచార ణ జరపకుండా కేంద్ర నేర విచారణ సంస్థ (సీబీఐ) కాలక్షేపం చేస్తోందని కూడా పత్రికలు ఆరోపించాయి. ఈ విషయాలను ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ (పేరు ప్రఖ్యాతులు ఉన్న సామాజిక కార్యకర్తలు) నిర్వహిస్తున్న ‘స్వరాజ్ ఇండియా’ ప్రకటించింది. అయినా పాలకులకూ, న్యాయస్థానా లకూ ఉలుకు లేదు, పలుకు లేదు. 2014 నవంబర్‌లో ఢిల్లీ, నోయిడాలలోని ‘సహారా ఇండియా’ గ్రూపు కార్యాలయాలలో జరిపిన దాడులలో అధికార పార్టీ నేతలకు ముట్టిన కోట్లాది భారీ లంచాల గుట్టు బయట పడిందని వచ్చిన వార్తలపై ఇంతవరకు అతీగతీ తెలియదు.
ఇక న్యాయవృత్తి నుంచి, న్యాయమూర్తుల దాకా ఈ అవినీతి ఎలా పాకిందో వీఆర్ కృష్ణయ్యర్ స్వీయ రచనల సంకలనం ‘లీగల్ స్పెక్ట్రమ్’లో పేర్కొన్న అంశాలను ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు సమర్పించిన (7.12.09) అఫిడవిట్‌లో ఉదహరించారు. సుప్రీంకోర్టుకు చెందిన 16మంది ప్రధాన న్యాయమూర్తులలో 8మంది (అంటే సగంమంది) ఎలా అవినీతికి ఒడిగట్టారో సాక్ష్యాధారాలతో ఆ అఫిడవిట్ సమర్పించారు. ఈ అఫిడవి ట్‌పైన, మొత్తం జ్యుడీషియరీ నైతికస్థాయిపైన అత్యున్నత స్థాయి (హైపవర్) కమిషన్ చేత విచారణ జరిపితే ఫలితం దిగ్భ్రాంతి కల్గిస్తుందని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల సామాజిక ప్రతిపత్తి, నైతిక సంస్కృతి, స్వతంత్రంగా వ్యవహరించగల ధైర్యమూ అథమస్థాయిలో ఉన్నప్పుడు విప్లవకరమైన మార్పులు అసంభవం అన్నారాయన. అయితే ప్రశాంత్ భూషణ్ ఆరోపణలను సుప్రీంకోర్టు న్యాయస్థాన ధిక్కరణగా భావించింది.
నిజానికి, ‘నా ఉద్దేశంలో సుప్రీంకోర్టులో ఇంతవరకూ అధిష్టిం చిన 17మంది ప్రధాన న్యాయమూర్తులలో 16మంది అవినీతిపరులేనని డాక్యుమెంటరీ రూపంలో సాక్ష్యాల ఆధారంగా, ఘటనా సాక్ష్యాలు ఆధా రంగా ఇది తేలిందని కూడా కృష్ణయ్యర్ నమోదు చేశారు. కాగా, ప్రజలు, వారికి అండగా నిలిచిన ప్రసిద్ధ న్యాయవాదులు కలసి ప్రజా ప్రయోజన వ్యాజ్య హక్కును సాధించుకున్నా, అది బీజేపీ పాలనలో క్రమంగా నీరు గారిపోవటం చూస్తున్నాం. సమాచార హక్కు చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్న ఉదాహరణలూ కనపడుతున్నాయి. దేశ ప్రజలు ధైర్యంగా ఒక్కు మ్మడిగా అవినీతి వ్యవస్థను విముక్తం చేయడానికి ముందుకు రావాలంటూ జస్టిస్ అమితవ్ రాయ్ చేసిన విజ్ఞాపన ఉదారమైనదే కావచ్చు. కానీ అవినీతి పిశాచంతో చేతులు కలిపిన పాలక శక్తులు ‘ప్రజాస్వామ్యం’ ముసుగులో పెట్టుబడిదారీ వ్యవస్థను సాకుతున్నంతకాలం జస్టిస్ రాయ్ వేదన అరణ్యరో దనే. అందాకా, ఆదర్శవంతమైన సామాజిక వ్యవస్థను ఆవిష్కరించుకోలేం. సెక్యులర్ వ్యవస్థ రక్షణకు రాజ్యాంగబద్ధమైన అన్ని జాగ్రత్తలను తు.చ. తప్పకుండా పాటించకుండా ఉన్నంతకాలం ఫాసిస్టు శక్తులు విజృంభిస్తూనే ఉంటాయి. రాజ్యాంగ వ్యవస్థ ఆచరణలో లక్ష్యాలకు దూరమవుతూ ఉంటే ఆ తప్పు, ఆ పాపం అమలు జరపాల్సిన నాయకులదేగానీ రాజ్యాంగానిది కాదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పలుమార్లు హెచ్చరించింది కూడా ఇందుకే.
అందని న్యాయం
తిండి, బట్ట, ఉపాధి, నివాస యోగ్యతకు రాజ్యాంగం పూచీ పడినప్పటికీ నేటి వాస్తవం ఏమిటి? దేశరక్షణలో అనేక త్యాగాలు చేసిన రిటైర్డ్ సైనికులు స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా తమకు నాసికరం రేషన్లు అందజేస్తున్నారని ఫిర్యాదు చేసిన సంగతి వింటున్నాం. సరిహద్దు భద్రతా దళానికి చెందిన తేజ్ బహదూర్ యాదవ్ భార్య ఫిర్యాదు చేసి, దాన్ని వీడియో పోస్ట్ చేసింది. ఢిల్లీ హైకోర్టును ఆమె (10.02.17) ఆశ్రయిస్తే తక్షణం నివేదిక ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయానికి కోర్టు నోటీసు పంపింది. ఈ లోగా తన భర్త కన్పించడం లేదని తేజ్ బహదూర్ భార్య హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేసింది. మాజీ సైనికులకు అకస్మాత్తుగా నాసిరకం రేషన్లు సరఫరా కావడానికీ, బీజేపీకి సన్నిహితుడైన బాబా రామ్‌దేవ్ ‘పతం జలి’ ఆయుర్వేద సరుకును బీఎస్‌ఎఫ్ కేంద్రాలున్నచోట 12 దుకాణాలకు ఉరికించి సొమ్ము చేసుకోడానికీ ఏమైనా సంబంధం ఉందా అన్నది అసలు ప్రశ్న. ఈయనా ఆదాయపన్ను భారీగా ఎగ్గొట్టిన ‘పెద్దల’లో ఒకరేనని వార్తలు వెలువడ్డాయి. రామ్‌దేవ్ కంపెనీ తన మొదటి రేషన్ సరుకుల షాపును ప్రారంభించింది బీఎస్‌ఎఫ్ క్యాంపులోనే (9.2.17). మరో విశేషం– ‘తాడుతోనే దబ్బనం’ కూడా పాకిపోయినట్టుగా హరిద్వార్ కేంద్రంగా రామ్ దేవ్ స్థాపించిన ‘పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్’ కంపెనీ సరిహద్దు భద్రతా సైనికుల భార్యల సంక్షేమ సంఘంతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చు కోవటం. కేంద్రం బాటలోనే ఏపీ సీఎం బాబు కూడా ఫాసిస్టు బాటలో రాష్ట్రంలో ‘తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఎప్పటికీ అధికారంలో ఉంటూ ప్రతి పక్షాలకు తావులేని పరిస్థితిని కల్పించా’లని కొత్త సందేశం వినిపించారు.
అందుకే జస్టిస్ కృష్ణయ్యర్ అని ఉంటారు: ‘ప్రజాస్వామ్యంలో అంత ర్భాగం–అధికార వికేంద్రీకరణ. ఢిల్లీ కేంద్ర స్వార్థ ప్రయోజనాలకు ప్రజా స్వామ్యం చుక్కెదురు. ప్రజలు మేల్కోవాలి. రాజ్యాంగ మౌలిక లక్ష్యాల నుంచి న్యాయమూర్తులూ జారుకోకుండా ఉండాలని ప్రజలు శాసించాలి’. జస్టిస్ అమితవ్ రాయ్ ఆవేదన కూడా అలంకారప్రాయం కాకుండా ఉండా లంటే ఆయనే చెప్పినట్టు గాంధీ స్ఫూర్తితో అవినీతిపై దండయాత్ర మరొక ‘దండి’యాత్రలా సాగాలి!
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in