చితికిన పల్లెసీమ! | agriculture and villagers troubling with Demonetisation | Sakshi
Sakshi News home page

చితికిన పల్లెసీమ!

Published Thu, Nov 24 2016 12:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

చితికిన పల్లెసీమ! - Sakshi

చితికిన పల్లెసీమ!

పక్షం రోజులక్రితం పెద్ద నోట్ల రద్దుతో పిడుగు పడినట్టయిన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ రోజులు గడుస్తున్నకొద్దీ సంక్షోభంలో కూరుకుపోతోంది. నోట్ల రద్దుకు ముహూర్తం పెట్టినవారెవరోగానీ గ్రామీణ ఆర్ధికానికి అది మరణ శాసనమైంది. పట్టణాలు, నగరాలు నొప్పి తెలియకుండా ఉన్నాయని కాదు. అక్కడ కనీసం కొంత శాతంలోనైనా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వినియోగం ఉంది. మొబైల్ వాలెట్ల అలవాటుంది. అక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఏటీఎంలున్నాయి. వాటిల్లో అప్పుడప్పుడైనా కరెన్సీ నోట్ల జాడ కనిపిస్తోంది. అందులో అరుదుగానైనా వంద నోట్లు, ఇతర చిన్న నోట్లు దర్శనమిస్తున్నాయి.

ఎంతో కొంత వినిమయం ఉండటంవల్ల కరెన్సీ చలామణిలో ఉంది. చానెళ్లలో పదే పదే చూపుతుండటం వల్ల నగర, పట్టణ వాసుల కష్టాలను ఉన్నంతలో తీర్చడానికి బ్యాంకులు, ఆపై వారు కష్టపడుతున్నారు. కానీ పల్లె సీమల్లో ఇలాంటి స్థితి లేదు. అక్కడ దాదాపు 90 శాతం లావాదేవీలు డబ్బుతోనే సాగుతాయి. ఏటీఎంలు అరకొరగా ఉంటాయి. అందులో పనిచేసేవి తక్కువ. పనిచేసినా కరెన్సీ నోట్ల లభ్యత తక్కువ. పర్య వసానంగా పెద్ద నోట్ల రద్దు గ్రామీణ అమరికను చిన్నాభిన్నం చేసింది. రిజర్వుబ్యాంకు గణాంకాల ప్రకారమే పట్టణాలు, నగరాలతో పోలిస్తే పల్లెల్లో బ్యాంకుల సంఖ్య అతి స్వల్పం. ఏటీఎంల పరిస్థితి అయితే మరీ దారుణం. ఉదాహరణకు ఢిల్లీలో 9,070 ఏటీఎంలుంటే రాజస్థాన్ మొత్తంమీద ఇందులో సగం కూడా లేవు.  

పల్లెసీమల్లో ప్రధాన వృత్తి వ్యవసాయం. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 14.5 శాతం. ఇతరేతర రంగాలు విఫలమైన సందర్భాల్లో కూడా ఆర్ధికవ్యవస్థను ఆదుకుంటున్నది వ్యవసాయ రంగమే. దేశ జనాభాలో అత్యధిక శాతంమందికి ఉపాధి కల్పిస్తున్నది కూడా ఈ రంగమే. ఇది ఖరీఫ్ సీజన్ ముగిసి కోతలు మొదలై పంటలు చేతికొస్తున్న సమయం. వెనువెంటనే రబీకి రైతులంతా సిద్ధపడే తరుణం. ఈ స్థితిలో రైతాంగానికి అడుగడుగునా డబ్బు అవసరం పడు తుంది. కోతలు మొదలుకొని పంట బస్తాలకెక్కి ఇంటికి చేరే వరకూ రైతు అందరికీ డబ్బులు చెల్లిస్తూ పోవాలి. మరోపక్క రబీ సీజన్ పనులు ప్రారంభించుకోవాలి. వ్యవసాయోత్పత్తులు అమ్ముకోవడం, వ్యాపారులనుంచి డబ్బులు రాబట్టుకోవడం కూడా ఈ సమయంలోనే సాగుతుంది. కూరగాయల సాగు సంగతి చెప్పనవసరమే లేదు.

పల్లెల్లో ఇందుకు సంబంధించిన లావాదేవీలన్నీ డబ్బుతోనే సాగుతాయి. పైగా వ్యవసాయ ఆదాయం ఐటీ పరిధిలో ఉండదు కనుక అనేక ఏళ్లుగా ఇళ్లల్లో డబ్బులు దాచుకోవడం, నోటిమాటతో అవి చేతులు మారుతుండటం రివాజు. మరోపక్క సూక్ష్మ స్థాయి, చిన్న, మధ్యతరహా వ్యాపార లావాదేవీలకు సైతం నోట్ల మార్పిడే ఆధారం. ఇందులో దాదాపు 30 శాతం లెక్కకు రాని డబ్బుంటుందని ఆర్ధిక నిపుణుల అంచనా. దాన్ని పూర్తిగా నల్లడబ్బు అనడం అన్యాయమవుతుంది. అది బ్యాంకింగ్ రంగం జోలికెళ్లని డబ్బు. ఈ మూడు రంగాలు మన దేశీయో త్పత్తిలో 40 శాతం ఆక్రమించడంతోపాటు గణనీయమైన శాతంలో ఉపాధి చూపు తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లూ లేకుండాఒక్క మాటతో పెద్ద నోట్లను ‘చిత్తుకాగితాలు’ చేస్తే సర్వం తలకిందులు కావడం సహజమే.
 
దురదృష్టవశాత్తూ దేశ ఆర్ధికవ్యవస్థకు చోదక శక్తిగా ఉంటున్న ఈ కీలక రంగా లపై ఆదినుంచీ మన విధాన నిర్ణేతలకు చిన్నచూపే ఉంటున్నది. ఒకపక్క వాణిజ్య బ్యాంకుల్లో పాత నోట్లను మార్చుకోవచ్చునని చెప్పిన రిజర్వ్‌బ్యాంకు... రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న జిల్లా సహకార బ్యాంకులు మాత్రం ఆ పని చేయడానికి వీల్లేదని చెప్పింది. దేశంలో ఉండే నల్లధనమంతా వాటి ద్వారానే చేతులు మారు తున్నదన్న అనుమానమేదో ఆర్‌బీఐని పీడిస్తుండాలి. తన ఆదేశం పల్లెసీమల వెన్ను విరిచిన సంగతిని అది గుర్తించలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంచుమించు ప్రతి పల్లెలోనూ ఉండే పోస్టాఫీసుల్లో పెద్ద నోట్లను మార్చుకునే సౌకర్యం కల్పించాం కదా అన్న తర్కం పనికొచ్చేది కాదు. ఖాతా ఉంటే తప్ప అక్కడ మార్చుకోవడం కుదరదు. ముమ్మరంగా పనులు జరిగే ఈ సమయంలో అన్నీ వదులుకుని అక్క డికెళ్లడం ఆచరణలో అసాధ్యం. రోజుకూలీ చేసుకునేవారు, చిన్న రైతులు, చిన్న వ్యాపారులు, అనేక రకాల వృత్తులు చేసుకుంటూ పొట్టపోసుకునేవారు పల్లెసీ మల్లో అధికం. అలాంటివారి జీవితాలు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాయి. పెద్దనోట్లు రద్దు చేస్తే చేశారు... అలా రద్దయ్యే కరెన్సీ విలువలో అర్ధ భాగాన్నయినా చిన్న నోట్ల ముద్రణతో పూడిస్తే, పౌరులకు అందుబాటులోకి తెస్తే వేరుగా ఉండేది. రద్దయిన నోట్లను ఆ కొత్త నోట్లతో మార్చుకోమని చెబితే ఈ స్థాయిలో ఇబ్బందు లుండేవి కాదు.
 
రిజర్వ్‌బ్యాంకు ముందస్తు ఏర్పాట్లు చేయకుండా, అసలు ముందస్తు ఆలోచ నలే లేకుండా రంగంలోకి దిగిందని అది రోజుకోరకంగా ఇస్తున్న మార్గదర్శకాలే స్పష్టం చేస్తున్నాయి. జనానికి చెబుతున్న మాటలు వేరు... బ్యాంకులకు చెవిలో చెబుతున్నది వేరని ఈ పక్షం రోజులుగా ప్రజలకు అర్ధమవుతున్నది. మీడియాలో చెబుతున్న స్థాయిలో మాకు డబ్బు రావడంలేదని, కనుక ఆర్‌బీఐ ప్రకటిస్తున్న విధంగా డబ్బులు సర్దలేమని బ్యాంకు సిబ్బంది చెప్పే మాటలు శుభకార్యాల హడా వుడిలో ఉంటున్నవారిని, డబ్బుల కోసం క్యూలు కడుతున్నవారిని విస్మయానికి గురిచేస్తున్నాయి.

ఆర్‌బీఐ మార్గదర్శకాలను అపహాస్యంపాలు చేస్తున్నాయి. పక్షం రోజులు గడిచాక తీరిగ్గా ఇప్పుడు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ రబీ పనుల కోసం నాబార్డ్ ద్వారా డీసీసీబీలకు రూ. 21,000 కోట్లు అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించారు. ఈ తెలివి మొదట్లో ఎటుపోయినట్టు? అంతా సవ్యం గానే ఉన్నదంటున్నవారు ఈ మార్గదర్శకాల పరంపరకు ఏం చెబుతారు? ఒకటో తేదీ మరెంతో దూరంలో లేదు. అప్పటిలోగా ఈ సంక్షోభాన్ని కాస్తయినా ఉప శమన పరచనట్టయితే పట్టణ మధ్యతరగతి ఆగ్రహావేశాలు మరింత పెరుగుతాయి. దాన్ని ఇప్పుడే ఊహించి ముందస్తు ప్రణాళికలు ఆలోచించి పెట్టుకోవడం ఉత్తమ మని కేంద్రమూ, ఆర్‌బీఐ గుర్తించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement