చేతలే ప్రధానం
జర్మనీలోని హాంబర్గ్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమైన జీ–20 శిఖరాగ్ర సదస్సు కంటే, ఆ సదస్సులో భారత్, చైనా అధినేతలు ఎదురుపడినప్పుడు ఎలా పలకరిం చుకుంటారు... కరచాలనమైనా చేసుకుంటారా, లేదా అన్న అంశాలు ఈసారి మన వరకూ ప్రధానమయ్యాయి. ఇదంతా ఇరు దేశాల సరిహద్దుల్లో మూడు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చైనా నుంచి వస్తున్న హెచ్చరికల పర్యవసానమే. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌తో ద్వైపాక్షిక చర్చల ప్రసక్తే లేద’ని సదస్సుకు ముందు చైనా ప్రకటిస్తే... ‘అసలు ఆ భేటీ మా ప్రధాని కార్యక్రమాల జాబితాలోనే లేద’ని మన దేశం జవాబిచ్చింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లిద్దరూ పరిణతితోనే వ్యవహరించారు. బ్రిక్స్ దేశాల అధినేతలు విడిగా కలుసుకున్న సందర్భంలో ఎదురుపడినప్పుడు యధావిధిగా చిరునవ్వులతో పలక రించుకోవడంతోపాటు వివిధ అంశాల గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తమ ప్రసంగాల్లో పరస్పరం ప్రశంసించుకున్నారు.
జిన్‌పింగ్ నేతృత్వంలో బ్రిక్స్‌లో చురుకుదనం పెరిగిందని, ఆయనకు పూర్తి సహకారం ఉంటుందని మోదీ అంటే... ఉగ్రవాదం పట్ల భారత్ దృఢ వైఖరిని జిన్‌పింగ్ మెచ్చుకున్నారు. ఆర్ధిక, సామాజిక అంశాల్లో భారత్ సాధిస్తున్న అభివృద్ధిని ప్రశంసించారు. బ్రిక్స్ ఇలా ఉన్నదంటే అది తొలినాళ్లలో భారత్ అందించిన నాయకత్వం వల్లనేనన్నారు. ఈ దౌత్యపరమైన మర్యాదలూ, పరస్పర ప్రశంసలూ అక్కడితో ఆగిపోకుండా సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చలకు దారితీస్తే అది సుహృద్భావ వాతావరణానికి దోహదపడుతుంది. ఈ సందర్భంలో జిన్‌పింగ్ ప్రస్తావించిన కీలక అంశం గురించి చెప్పుకోవాలి. బ్రిక్స్ లాంటి సంస్థలు ప్రాంతీయంగా దేశాల మధ్య ఏర్పడే ఘర్షణలనూ, వివాదాలనూ శాంతియుతంగా పరిష్కరించడానికి చొరవ చూపాలని కోరారు. నిజానికి సమస్య ఏర్పడ్డ దేశాలు ప్రతిష్టకు పోకుండా చర్చించుకోవడానికి ముందుకొస్తే ఈ సంస్థల అవసరం కూడా ఉండదు. మన దేశం కూడా శాంతియుతంగా చర్చించడమే సరైందని చెబుతోంది. ‘సుహృద్భావ వాతావరణం’ ఏర్పడే వరకూ రెండు దేశాల అధినేతల ద్వైపాక్షిక చర్చలుండవని మొదట చెప్పింది చైనా విదేశాంగ శాఖ ప్రతినిధే. పైగా భారత్ తన సేనలకు వెనక్కు తీసుకునే వరకూ ఈ ‘సుహృద్భావ వాతావరణం’ ఏర్పడదని కూడా ఆయనన్నాడు. ఇలాంటి ప్రకటనలు అసలే అంతంత మాత్రంగా ఉన్న వాతావరణాన్ని మరింత దిగజార్చడం తప్ప సాధించేదేమీ ఉండదు. సరిహద్దు ఉద్రిక్తతలపై వార్తలు వెలువడిన వెంటనే మన దేశం సరిగానే స్పందించింది. దానిపై సైనికాధికారులు చర్చించుకుంటారని చెప్పింది. చైనా కూడా అలాగే ఆలోచించి ఉంటే సమస్య ఇంతవరకూ రాదు. సైనికాధికారుల స్థాయిలో పరిష్కారం కాకపోతే అప్పుడు మరింత విస్తృత స్థాయిలో సంప్రదింపుల గురించి ఆలోచన చేయొచ్చు. అందుకు బదులుగా ఆ ప్రాంతంలో చైనా మరిన్ని దళాలను మోహరించడం, మన దేశం కూడా అదే పని చేయవలసి రావడంవల్ల ఉద్రిక్తతలు పెరిగాయి.
మన ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించే సిలిగుడి కారిడార్‌కు సమీపంలో భూటాన్‌ను ఆనుకుని ఉన్న డోకా లా పీఠభూమిలో అక్ర మంగా రోడ్డు నిర్మించడానికి చైనా ప్రయత్నించడం సమస్యకు మూలం. ఆ విష యంలో భూటాన్ ఎంత నచ్చజెబుతున్నా, ఎన్నిసార్లు చర్చించినా చైనా పెడచెవిని పెట్టడం వల్ల మనతో ఉన్న ఒప్పందానికి అనుగుణంగా భూటాన్ మన దేశానికి మొరపెట్టుకుంది. చైనా రహదారి నిర్మాణం మన దేశానికి కూడా సమస్యే గనుక భారత సైన్యం జోక్యం అనివార్యమైంది. చైనా ఒత్తిడికి లొంగి రహదారి నిర్మాణా నికి భూటాన్ అంగీకరించి ఉంటే నిజానికి అది మన దేశానికి భద్రతాపరంగా పెను సమస్య అయ్యేది. సిలిగుడి కారిడార్‌లో చైనా సైన్యం సునాయాసంగా పాగా వేయ గలిగేది. చైనాకు ఇలాంటి తగవులు మనతో, భూటాన్‌తో మాత్రమే కాదు... అనేక దేశాలతో ఉన్నాయి. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనె, తైవాన్‌లతో అది పేచీకి దిగుతోంది. తూర్పు చైనా సముద్రం వద్ద జపాన్‌తోనూ ఇలాంటి సమస్యే ఉంది. ఈ నేపథ్యంలోనే వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్)లో మనం చేరకపోవడం, దక్షిణ చైనా సముద్ర ప్రాంత వివాదంలో మనపై అనుమానాలు రావడం వల్ల అణు సరఫరా దేశాల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో మనకు సభ్యత్వం రాకుండా చైనా అడ్డుకుంటోంది. ఇప్పుడు జిన్‌పింగ్ చెప్పిన మాటలు నిజంగా ఆచరణ రూపం దాలిస్తే అసలు సమస్యలే ఉండవు.
భారత్–చైనా వివాదం నేపథ్యంలో జీ–20 శిఖరాగ్ర సదస్సు ప్రధానాంశాలు కనీసం మన దేశం వరకూ మరుగునపడ్డాయి. పర్యావరణానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి ఏర్పడుతున్న ముప్పు, ఉగ్రవాదం, స్వేచ్ఛా వాణిజ్యంలాంటి ముఖ్యాంశాలను ఈ సదస్సు చర్చించాల్సి ఉంది. మరోపక్క నయా ఉదారవాద ఆర్ధిక విధానాలు వివిధ దేశాల్లో అప్రజాస్వామిక ధోరణులకు దారి తీస్తున్నాయని, ప్రజానీకం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని జీ–20 వ్యతిరేకులు హాంబర్గ్‌లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ దేశాలన్నీ తమ పంధాను మార్చు కోవాలని డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన ప్రపంచం ఏర్పడటానికి జీ–20 దేశాలు అనుసరిస్తున్న విధానాలు అవరోధంగా ఉన్నాయంటున్నారు. హాంబర్గ్ రోడ్లపై శుక్రవారం చోటుచేసుకున్న విధ్వంసమే నిరసనకారుల ఆగ్రహానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రపంచ దేశాల నేతలు దీన్ని కూడా పట్టించుకోవలసిన అవసరం ఉంది. పారిస్ ఒడంబడిక నుంచి అమెరికా తప్పుకున్న పర్యవసానంగా ఏర్పడ్డ ఖాళీ భర్తీపైనే ప్రస్తుతం వారి దృష్టంతా ఉంది. యూరప్ దేశాలన్నిటినీ ఏకం చేసి ప్రపంచ సారథ్య బాధ్యతలను తాను స్వీకరించాలని జర్మనీ భావిస్తుంటే అందుకు కావలసిన అర్హతలు తనకే ఉన్నాయని చైనా అనుకుంటోంది. ఈ కీలక ఘట్టంలో జీ–20 శిఖరాగ్ర సదస్సు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.