
పారిశుద్ధ్యాన్ని ప్రజాస్వామీకరిద్దాం..!
పారిశుద్ధ్య పనిని పూర్తిగా యాంత్రీకరిస్తే తప్ప పాకీపనివారి కుల బాని సత్వం రూపుమాయదని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ స్పష్టం చేశారు. గత 32 ఏళ్లుగా పాకీపని నిర్మూలనకై పోరాడుతున్న విల్సన్ కొన్ని లక్షలమంది పాకీ పనివారిని ఈ వృత్తిలోనుంచి విముక్తి చేయడమే ఈ దేశంలో అతి పెద్ద ప్రజాస్వామిక చర్య అని తేల్చి చెప్పారు. తరతరాలుగా సమాజంలోని ఒక కులం ప్రజల చేత ఇలాంటి దారుణమైన పని చేయించినం దుకు ప్రస్తుత ప్రభుత్వం, దేశ ప్రజలు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మన ఇంట్లో కంపు లేకుండా చేయడానికి, మనం శుభ్రంగా ఉండ టానికి ఏటా వందలాది పారిశుద్ధ్య కార్మికులు బలవుతున్నప్పటికీ ఈ దేశమూ, సమాజమూ, మన శాస్త్రజ్ఞులూ.. దీనిపై ఒక చిన్నపరిష్కారం కూడా ఇంకా ఎందుకు కనుగొనలేదని ప్రశ్నిస్తున్నారు. స్వచ్చ భారత్ కాదు.. మన ఆలోచనలను పూర్తిగా మార్చే భారత్ కావాలంటున్న బెజవాడ విల్సన్.. ఫ్రీలాన్స్ జర్నలిస్టు సునీతా రెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు...
గత 32 ఏళ్లుగా సాగుతున్న మీ సుదీర్ఘ పోరాటం ఎలా మొదలైంది?
ఏదో చెయ్యాలని నేను ఏదీ మొదలుపెట్టలేదు. పథకం ప్రకారం చేయ లేదు. ఏదో ఒక సంఘటన జరగటం. దానికి స్పందించే మనస్తత్వం ఉండేది. ఎలా చెయ్యాలని తెలిసేది కాదు. పాకీ పనిచేసే తల్లిదండ్రులు, అన్న... బాల్యం నుంచి వారి కష్టం చూడటం... బలమైన జ్ఞాపకాలుగా మిగిలాయి.
చాలా అవమానాలకు కూడా మీరు గురయ్యారని చెప్పారు!
ఈ దేశంలో అంటరాని కులాల్లో పుట్టిన ప్రతి ఒక్కరికీ అవమానాలకు చెందిన స్వీయ అనుభవాలు ఉంటాయి. కానీ వాటికి కారణం ఏమిటనేది అనుభవించేటప్పుడు అర్థం కాదు. నన్నెందుకు తక్కువ చేసి మాట్లాడతావు అనిపించేది. అయితే కులం పేరుతో దూషించే పిల్లలకు కూడా ఎందుకిలా దూషిస్తున్నాము, దూషిస్తే వాళ్లు ఎంత బాధపడతారు అనేది తెలీదు. కర్నా టకలో తమిళ ప్రభావం ఉండే కొన్ని ప్రాంతాల్లో మమ్మల్ని తోటి వాళ్లు అనే వారు. తోటి అని పిలిచినప్పుడు మిగతా వాళ్లంతా నవ్వేవాళ్లు. దీంతో ఆ పదం వెనుక ఏదో ఉంది అని అనుమానంతో బాధ కలిగేది.
ఒకదశలో మీరు ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించినట్లున్నారు?
నేను కుప్పం ప్రభుత్వ హాస్టల్‌లో చదువు పూర్తి చేసి కేజీఎఫ్‌కు తిరిగొ చ్చాక మావాళ్లు గంపల్లో మానవ మలాన్ని తీసుకుళ్లడం, బక్కెట్లో ముంచడం చూసినప్పుడు కాస్త కష్టమనిపించింది. ‘మీరెందుకు ఇలా తాగుతారు. తప్ప తాగి వచ్చి ఇంట్లో అందరినీ పట్టుకుని కొడతారు’ అని అడిగేవాణ్ణి. తాగితే అట్లా అవుతారని.. తాగటం తప్పు అనుకుని.. తాగొద్దు అని చెప్పేవాణ్ణి. అప్పుడు మా బంధువు కల్పించుకుని.. ‘నేనేం పని చేస్తున్నానో ఒకసారి చూడు.. నేనెందుకు తాగుతున్నానో నీకు అర్థమవుతుంది’ అన్నాడు. దాంతో ఒకసారి వెళ్లి చూసాను. ఆరోజు నాకు చాలా బాధ అనిపించింది. ఎలా దాన్ని ప్రతిఘటించాలి అంటూ ఒకరోజు రాత్రి నేను ఆలోచించాను. ఎక్కడికైనా వెళ్లి చెబితే వింటారా మనమాట? పైగా చదువుకోలేదు. పేదరికం. ఎక్కణ్ణుంచైనా దుమికి చనిపోతే ఈ పరిస్థితి అంతమవుతుంది అనుకున్నాను. కాని చనిపోతే సమస్య పోదు కదా అని భావించి.. చావడం మార్గం కాదనుకున్నాను.
మొదట్లో మీ వాళ్లలో చైతన్యం తీసుకురావడమే చాలా కష్టమైందట కదా?
ఏదైనా ఒక పనిలో ఒక జాతినో, వ్యక్తులనో, సమూహాలనో చాలా శతా బ్దాల పాటు అందులోనే ఉంచి, అదే పని చేయాలని చెప్పి అలవాటు చేయిస్తే ఆ సమూహానికి, ఆ జాతికి ఆ పని తప్ప వేరే పని చేయాలన్నా, వేరే వృత్తిని చేయాలన్నా ధైర్యం ఉండదు. దానంతటికీ ఒక కారణం కులం. మనుషులు ఏం పని చేయాలి అనేది కులం నిర్దేశిస్తుంది. పుట్టుక, కులం, వృత్తి అనేది ఒక ట్రయాంగిల్ లాగా వచ్చేస్తాయి. ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఛేదించడం ఈ సమాజంలో చాలా కష్టం. పైగా వారికోసం ప్రదర్శించే సానుభూతి కూడా వాళ్లను అదే పనిని నిరంతరం చేసేలాగా, బానిసత్వంలోకి నెట్టేస్తుంది.
సపాయి కర్మచారి ఆందోళన్‌వల్ల ఏదైనా సాధించగలిగారా?
సపాయి కర్మచారి ఆందోళన్‌ను ఈ రోజుకీ రిజిస్టర్ చేయలేదు. ఆ సంస్థకు బ్యాంకు ఎకౌంట్లు, రిజిస్ట్రేషన్‌లు ఏం లేవు. దీన్ని ఒక ఉద్యమంగానే తీసుకొద్దాం అన్నారు. ఉద్యమం అంటే మొదట ప్రచారం చేయాలి. కేంపె యిన్ ఎగైనెస్ట్ స్కావెంజింగ్ అని చెప్పారు. ముఖ్యంగా ఆంధ్ర, తమిళ నాడుల్లో చాలా చోట్లకు వెళ్లి పనిచేయడం మొదలెట్టిన తర్వాత సమస్య అర్థమయింది. మేం పాకీ పని ఆపేయమని చెప్పలేదు. ఎందుకీ పని చేస్తున్నా వని అడగలేదు. మేమెందుకు కేంపెయిన్ చేస్తున్నామో, మేమెవరమో చెప్పే వాళ్లం. చెప్పాల్సింది చెప్పి నేను దిగి వచ్చేటప్పుడు అక్కడున్న మహిళలు వచ్చి ఆపి, ‘అదెప్పుడో నీకు 1975, 80లలో జరిగిందని అనుకోవద్దు. నిన్న కూడా నా మనవరాలికి స్కూల్లో అలాగే జరిగింది. నేను స్కూలుకు పోను అని ఏడుస్తోంది. నువ్వు వచ్చి ఒక మాట చెప్పు’ అనేవారు. మనం ఏదైనా పోరాటం, ఉద్యమం చేయాలంటే ఇక్కడే చేయాలి అని అప్పుడే అనిపించేది.
పాకీపనిని నిషేధిస్తూ 1993లో వచ్చిన చట్టం మీ ప్రచారం వల్లే వచ్చిందా?
నాలాంటి చాలామంది కృషి ఫలితమది. 1990లో అంబేద్కర్ శత జయంతి సందర్భంగా దళితులకు సంబంధించి ఏమేం చేయవచ్చు అని ఆలో చిస్తూ ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చినట్లు ఉంది. మేం కూడా పార్లమెం టుకు లేఖ రాశాం కానీ చట్టం రాసే పని మేం పెట్టుకోలేదు. వేరేవాళ్ల చేత మలమూత్రాలను శుభ్రం చేయిస్తే ఒక ఏడాది జైలు శిక్ష అని ఆ చట్టం కాపీలో రాశారు. దేశమంతా ఈ చట్టం గురించి చెబుతూ తిరగటం మొదలెట్టాం.
ఆ చట్టం ఇప్పటికీ కాగితం మీదే ఉంది కాని ఎక్కడా అమలు కాలేదు కదా?
2013లో కొత్త చట్టం వచ్చేంతవరకు దాదాపు 20 ఏళ్లు ఆ చట్టం ఉనికిలో ఉంది. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం దీని ప్రాతిపదికన ఒక్క కేసూ పెట్టలేదు. ఈ వృత్తిలో ఇంతమంది చనిపోతున్నా, ఇంత జరుగుతున్నా.. సాక్ష్యాలిచ్చినా.. కోర్టుకెళ్లినా.. ఎంత చెప్పినా మార్పు జరగలేదు. దళితులకు, పాకీపనివాళ్లకి, మహిళలకు, ఇతర మైనారిటీలకు చెందిన చట్టం తీసుకొస్తే, ఒక్క కేసు కూడా పోలీసు స్టేషన్‌లో నమోదు కాదు. 430 మంది కలెక్టర్లను కలిసి మాట్లాడినా ఫలితం లేదు.
సపాయి కర్మచారి సంస్థను ఎప్పుడు స్థాపించారు? ఎవరు తోడ్పడ్డారు?
1982 నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాము. 93లో శంకరన్‌గారు రిటై రయ్యారు. పాల్ దివాకర్ çనన్ను తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు. ప్రత్యేకంగా మళ్లీ వెళ్లి కలిశాక చాలా విషయాలు చెప్పారాయన. అంబే డ్కరును కూడా మరొక రూపంలో పరిచయం చేశారు. జీవితంలో ఇంకొక వైపు నేను చూసినట్లయింది. చూడ్డానికి మాలాగే సింపుల్‌గా ఉండే శంకరన్ చనిపోయేంతవరకు తానెవరైందీ నాకు చెప్పలేదు. ‘ఐ విల్ బి విత్ యు’ అన్నారు అంతే. 2010 అక్టోబర్ 7న ఆయన చనిపోయారు. సఫాయి కర్మచారి ఉద్యమానికి ఆయన చివరివరకూ అండగా నిలిచారు.
సుప్రీంకోర్టులో పాకీపనికి వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశారు కదా?
అవునండీ, 1993లో చట్టం వస్తే 2003లో పిల్ వేశాం. నేనెప్పుడూ అను కుంటాను. సపాయి కర్మచారీ ఆందోళన అనేది కేవలం పాకీపనికో మరో దానికో సంబంధించినది మాత్రమే కాదు. దేశంలోని అనేక వ్యవస్థలను ప్రజా స్వామీకరించడం కూడా ఒక బాధ్యతగా మామీద ఉండేది. మేం కోర్టులను ఆశ్రయించడం కూడా మనకున్న హక్కును కాపాడుకోవడానికే అనుకునే వాళ్లం. కోర్టు ముందు అందరూ సమానులే అనిపించింది.
మెగసెసె అవార్డు ఇస్తామని ప్రతిపాదిస్తే వద్దన్నారట?
రామన్ మెగెసెసే అవార్డు నాకు ఇవ్వకముందు వారినుంచే నేరుగా నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరిదో అని వదిలేసాను. కొన్ని రోజుల తర్వాత మా ఆఫీసుకే ఆమె ఫోన్ చేసి తన కాల్‌ని రిసీవ్ చేసుకోవాలని, ఇది సపాయి కర్మచారీ ఆందోళన్‌కు దాని భవిష్యత్తుకు సహాయపడుతుంది అని ఆమె ఇంగ్లీషులో చెప్పిందట. తర్వాత నేను వారి కాల్ అందుకున్నాను. అది రామన్ మెగసెసె ఫౌండేషన్ డైరెక్టర్ నుంచి వచ్చిన కాల్. మీకు ఈసారి మెగసెసె అవార్డు ఇవ్వాలని మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు అని చెబితే నాకు అవసరం లేదన్నాను. మీరు చేస్తున్న పని వివరాలు నా వద్ద ఉన్నాయి. ఇంత చిన్న వయసులో ఇవన్నీ ఎవరు చేయగలరు అని చెప్పారామె. కానీ నాకు మీ అవార్డు వద్దు. అవసరమైతే మా బోర్డు సభ్యులకు చెబుతాను అని చెప్పాను. తర్వాత వరుసగా మరో రెండు రోజులు ఆమె కాల్ చేసింది. ఇక తప్ప దనుకుని మా వాళ్లకు విషయం చెప్పాను. ఈలోగానే వాళ్లు ఏవో పత్రాలు పంపి పూర్తి చేసి పంపమన్నారు. నేనయితే ఏవీ పంపలేదు. 27వ తారీకున వారు నేరుగా ప్రకటించేశారు. నేనెందుకు ఈ అవార్డును మొదట్లో వద్దన్నా నంటే ఈరోజుకీ చేతులతో మలమూత్రాదులు ఎత్తేటటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. దేశమంతటా ఒక లక్షా అరవై వేలమంది ఈ పని చేస్తున్నారు. ఇన్నేళ్లుగా పనిచేసిన తర్వాత వారు ప్రభుత్వం నుంచి ఏ సహాయం పొందనప్పటికీ, తమ స్వాభిమానం కోసం వారు మలమూత్రాలు ఎత్తుతున్న గంపలను విసిరేశారు. నా ఉద్దేశంలో ఈ ప్రపంచంలో ఏదయినా అవార్డు అనేది ఉంటే దానికి వాళ్లు నిజమైన అర్హులు అనిపించింది.
పాకీ పని నిర్మూలనలో లోపం ఎక్కడుంది?
సఫాయి కర్మచారి మహిళలు వెళ్లి సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని బతికించడంలో భాగమే. ఈ దేశంలో సెప్టిక్ ట్యాంకులు, భూగర్భ మురికి కాలువల్లో పడి.. రెండేళ్లలో దాదాపు 1,373 మంది చనిపో యినట్లు డేటా ఉంది. అలా పనిచేస్తే చనిపోతారు అని మనందరికీ తెలుసు. అయినా ఈ దేశమూ, సమాజమూ, మన శాస్త్రజ్ఞులూ.. ఇలాంటి వారు చని పోకుండా ఒక చిన్నపరిష్కారం కూడా ఇంకా తయారు చేయలేదు. ఆవైపు ఆలోచించలేదు. అది మన మెదడుకు పట్టిన ఒక తెగులు. చాలాసార్లు స్వచ్ఛభారత్ అని చెబుతుంటాం. కాని మనక్కావలసింది ఏమిటంటే మన మైండ్‌సెట్‌ని మార్చే భారత్ కావాలి, మన ఆలోచనా తీరులోనే కొంత పొర పాటు ఉంది. అందుకే మన కళ్లముందే జరుగుతున్న ఇలాంటి మరణాలను నేను రాజకీయ హత్యలు అనుకుంటున్నాను. రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవలసిన సమయంలో తీసుకోలేకపోతే పౌరులు చనిపోతారు. మనం శుభ్రంగా ఉండటానికి, మన ఇంట్లో కంపు లేకుండా ఉండటానికి ఎవరినో ఒకరిని బలి ఇచ్చేస్తున్నాం. ఇలాంటి హత్యలను మనం ఎంత త్వరగా ఆపగలి గితే.. మనం నిజంగా సభ్య సమాజమే అనిపించుకోవచ్చు. దీన్ని ఆలోచిం చకుండా మనమేదో రాకెట్ లాంచ్ చేశామని గొప్పలకు పోతే ఎలా? రాకెట్ లాంచ్ చేయవద్దని చెప్పడం లేదు. దాంతో పాటు అవసరమైనవన్నీ చేయాలి. వీటితో పాటు చాలా ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత కల్పించాలి. పారిశుధ్య రంగాన్ని ప్రజాస్వామ్యీకరించాలి. అన్నింటినీ ఆధునికమైన రీతుల్లో నవీక రించి మనుషుల ప్రమేయం లేకుండా చేయగలిగే ఒక వ్యవస్థను తీసుకొస్తే.. అది దేశానికీ, ప్రజలకూ, అందరికీ మంచిది.
స్వచ్ఛభారత్ నినాదంతో పని లేకుండా ఆచరణాత్మక మార్పు సాధ్యమా?!
అవును. ప్రధానమంత్రి స్థాయిలో అలాంటి మార్పు తీసుకురాగలిగితే... ఒక లక్షా అరవైవేలమంది సపాయి కార్మికులు వెంటేనే బానిసత్వం నుంచి విముక్తి పొందుతారు. తరతరాల నుంచి ఒక సమూహం చేత, ఒక సమాజం చేత.. ఇలాంటి పనులు చేయించినందుకు భారత ప్రభుత్వం, ఈ దేశ ప్రజలూ క్షమాపణ చెబితే సపాయి కార్మికుల మనస్సులు కూడా శాంతి స్తాయి. మరలా ఇలాంటి పని మరొకరు చేయకుండా మనమూ, మన పిల్లలూ అందరూ ఇలా సమాజం గురించి ఆలోచన చేసినప్పుడు. ఎవరో ఒకరు మనిషి మలం తీసుకుని నెత్తి మీద మోయటం అనేది యావద్దేశానికీ సిగ్గుచేటు అని అందరూ గ్రహిస్తారు. నా బాల్యంలో ఆ దృశ్యాన్ని నేను చూసి నప్పుడు ఎంతో బాధపడ్డాను. అలా చూడకుండా ఉండే సమాజాన్ని మనం నిర్మిస్తే అదే చాలనిపిస్తుంది.
బెజవాడ విల్సన్‌తో సునీతా రెడ్డి ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో.. https://www.youtube.com/watch?v=4ds_FLRSgJQ