అంతులేని రుగ్మత అవినీతి
విశ్లేషణ
పెద్ద నోట్ల రద్దు నల్ల ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బే అయినా అవినీతి అనే రుగ్మతను అంతం చేసేదేమీ కాదు. ఆ భూతం అంత తేలికగా అంతమయ్యేది కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే అవినీతి నిర్మూలన అంతేలేని కఠోర కర్తవ్యం.
ఐదు వందలు, వెయ్యి రూపా యల నోట్ల రద్దు నల్లధనంపై ప్రభావం చూపుతుందని, నకిలీ నోట్లను చలామణిలోంచి తొలగి స్తుందని, ఉగ్రవాదులు వాటిని ఉపయోగించడాన్ని సైతం నివారి స్తుందని భావించారు. ప్రభుత్వం చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇవన్నీ గొప్ప ఉద్దేశాలే. కాకపోతే దాన్ని అమలు జరుపుతున్న పద్ధతి మాత్రం అధ్వానమైనది. అది, మొత్తంగా దీన్నంతటినీ అపహాస్యం చేసేదిగా ఉంది.
ఈ వ్యవహారానికి సంబంధించిన ఒక్కొక్క కోణాన్ని ఆర్థికవేత్తలు రోజూ వెలుగులోకి తెస్తున్నారు. వాటి పర్యవ సానాల వివరణలు పుట్టుకొస్తూ నరేంద్ర మోదీ గర్వించడా నికేమీ మిగలకుండా చేస్తున్నాయి. అయితే, పాక్షికంగానే అయినా ఆయన తన లక్ష్యాలను సాధిస్తారు. వ్యవస్థ ప్రక్షా ళనకు అవసరమైన పలు చర్యలలో పెద్ద నోట్ల రద్దు ఒకటి మాత్రమే. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు భారీ ఎత్తున డబ్బును ఖర్చు చేయడాన్ని నిర్మూలించేలా ఎన్నికల సంస్క రణలను తీసుకురావడం మరొ కటి. అయితే అది ఎన్నికల ఖర్చులకు ప్రభుత్వమే నిధులను సమకూర్చడంతోనే సాధ్య మయ్యేది కాదు. రాజకీయాలలో నైతిక వర్తనను పునరుద్ధ రించడం అందుకు అవసరం. అధికార చట్రంలో ఉన్నవారు భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టుకోడాన్ని, పన్నులు ఎగవేయ డాన్ని నివారించేది ఏది? విధాన నిర్ణయాలను తీసుకునే దగ్గరి నుంచి చిట్టచివరి స్థాయిలో వాటిని అమలుచేసే వరకు ఉండే అధికారులు కూడా ఇందులో భాగమే.
చలామణిలోని 86 శాతం కరెన్సీ చెత్తగా మారి పోను న్నది. నల్లధనం గల కుబేరులు ఎవరూ తమకు కలిగిన విప రీతమైన నష్టానికి గుండె పగిలి చనిపోయినట్టుగా మనం ఇంతవరకు వినలేదు. బహుశా వారి ఆందోళన అంతా ఇప్పుడు నల్ల ధనం గురించి గాక, నల్ల సంపద గురించే అయి ఉంటుంది. అవి రెండూ విభిన్నమైనవి. నల్ల సంపద బినామీల పేర్ల మీద ఉంటుంది. మొత్తం నల్ల సంపదలో నల్లధనం ఒక చిన్న భాగం మాత్రమే.
తేలు కుట్టిన దొంగ పోలికతో మా అమ్మమ్మ ఈ విష యాన్ని వివరిస్తుండేది. అంతా నిద్రిస్తుండగా మీ ఇంట్లోకి జొరబడ్డ దొంగ తేలు కుడితే అరవలేడు. చడీచప్పుడు లేకుండా జారుకుని, విషానికి విరుగుడు మందు కోసం వెతుక్కుంటాడు. అంతేగానీ తేలును చంపాలని అనుకోడు. అది ఇంటి యజమాని తలనొప్పి. నష్టపోయిన వారికి పోగొట్టుకున్నదాన్ని త్వరలోనే తిరిగి సాధించుకోగలమనే ఆత్మవిశ్వాసం ఇప్పటికే ఏర్పడింది. అసలు పెద్ద నోట్ల రద్దు సమస్యే లేనట్టుగా ఇప్పుడు వారి బాధంతా అదనంగా మరో విధమైన దాడి అంటే నల్ల సంపదపై దాడి కూడా జరిగితే ఎలా? అనేదే. చట్ట విరుద్ధ సంపాదనపై దురాశ ఇప్పటికే మన జీవితాల్లో, సంస్కృతిలో భాగమైంది. లాభం కలుగుతుందంటే అడ్డదారులు తొక్కడం నేటి బహిరంగ జీవితపు ప్రామాణిక లక్షణంగా మారింది. ప్రైవేటు కార్పొ రేషన్లు అవినీతికి ఆజ్యం పోస్తాయి. కాబట్టి అవి అందుకు మినహాయింపు కావు. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గనున్నం దున ఆ రంగంలో ఈ అక్రమార్జనను పెట్టుబడులుగా పెట్ట డానికి అవకాశాలు కూడా ఉంటాయి.
మహారాష్ట్రలో ఒక అధికారి పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చడానికి రూ. 50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ కేసు అక్రమ సంపదలను పోగే సుకున్న యజమానులకు మంచి ఉదాహరణ. అలాంటి వారు డిసెంబర్ చివరికల్లా నల్లధనాన్ని తెల్లదిగా మార్చు కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జోరుగా పనిచేస్తున్న మార్గా లను అతడు ఉపయోగించుకోవాలని చూస్తాడు. ఇందులో కీలక పాత్రధాని అవినీతిపరుడైన అధికారే.
లంచం ఇచ్చే వ్యక్తి పన్ను అధికారుల కంట పడకుండా ఎలాగైనా పాత నోట్లను వదుల్చుకోవాలని మహా తొంద రతో ఉంటాడు. త్వరగా ఈ పని పూర్తి చేసేసుకోవాలని ఆదుర్దాతో ఉంటాడు. బహుశా అందువల్లనే నేరుగా ఏసీబీ పన్నిన వలలోకి వెళ్లి ఉండాలి. ఈ సందర్భంలో లంచం ఇవ్వజూపిన వ్యక్తి నిజాయితీపరుడైనా కావాలి లేదా అతని వద్ద పాత నోట్లు సిద్ధంగా లేకపోౖయెనా ఉండాలి. అయితే అలాంటి నిజాయితీ పరులైన అధికారుల అవసరం ఇప్పడు చాలా ఉంది.
నల్ల డబ్బు ఉన్నవారి ఆశంతా ఇప్పుడు ఖాతాలను తారు మారు చేసి, తక్కువ జరిమానాలతో తప్పించుకోగల వ్యవస్థపైనే. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు డబ్బును మార్చే వారికి మార్గంగా మారాయని ఇప్పటికే మనకు తెలుసు. పద్దులను సరిచూసే దురాశపరులైన పర్యవేక్షణాధికారులు నల్లధనాన్ని ఆర్జించడానికి ఇది తాజా దారిగా మారి పూర్తి కొత్త నోట్లతో కొత్త నల్లధన వలయాన్ని ప్రారంభిస్తుంది. ధరలు పడిపోవడానికి అవకాశమున్న రియల్ ఎస్టేట్ రంగంలో దాన్ని పెట్టుబడిగా పెట్టుకునే అవకాశాలూ ఉంటాయి.
పెద్ద నోట్ల రద్దు నల్ల ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బే అయినా అవినీతి అనే రుగ్మతను అంతంచేసేదేమీ కాదు. విచక్షణాధికారాలున్న వ్యక్తి దురాశ, వ్యక్తిగత లాభం కోసం వ్యవస్థను ఇష్టానుసారం మలచడానికి ఇష్టపడటం. అవ సరమైతే అందుకు తోడ్పడే వారితో దాన్ని పంచుకోవడానికి సిద్ధపడటం అనేవి ఎంత లోతుగా వెళ్లూనుకున్నాయంటే ఆ భూతం అంత తేలికగా అంత మయ్యేదికాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అంతే లేని కఠోర కర్తవ్యం.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
మహేష్ విజాపుర్కర్
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com