mvijapurkar
-
ఇన్సైడర్లూ శిక్షార్హులే!
విశ్లేషణ దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే అతి పెద్ద వంచనకు పాల్పడిన వారితోపాటు, వారు పరారయ్యేందుకు సమాచారం ఇచ్చినవారూ నేరస్తులే. సాధారణ న్యాయ ప్రక్రియకే ఈ సమాచారం తూట్లు పొడిచింది కాబట్టి వీళ్లనూ వదలిపెట్టకూడదు. మీరు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకేసి మాత్రమే చూసినట్లయితే బ్యాంకు రుణాల ఎగవేతలూ, కుంభకోణాలూ చాలా పెద్దవిగా కనిపిస్తాయి. వీరిలో ఒకరు లండన్ న్యాయస్థానంలో భారత్‌కు తరలింపు అంశంపై విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక రెండో వ్యక్తి విషయంలో భారతీయ న్యాయశాసనాలు అతడిని కనీసం సమీపించగలవా అనే విషయం మనకు తెలీదు. మాల్యా, నీరవ్ మోదీ ఇరువురూ బ్యాంకుల నుంచి కొల్లగొట్టినవి నిజానికి చాలా భారీ మొత్తాలు. అయితే వీరిపై విచారణలు మాత్రం నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే, ఒకరేమో లండన్‌లో స్తంభింపజేసిన తన ఆస్తుల నుంచి కోర్టు ద్వారా ప్రతి వారం రూ. 16 లక్షల జీవన భృతిని పొందుతున్నారు. భారత్‌కు అతని తరలింపు కార్యక్రమం పురోగతిలో ఉంది. ఇక నీరవ్ మోదీపై విచారణ ఏ సమయంలో అయినా మొదలుకావచ్చు. అత్యంత విలువైన వజ్రాల తయారీదారు అయిన నీరవ్ బెల్జియం పాస్‌పోర్ట్ కలిగివున్నాడని అంచనా. కాబట్టి ద్వంద్వ పౌరసత్వ సమస్యపై అతడిని ఇరికించవచ్చు. మీడియా మాత్రం నీరవ్‌కు విదేశాల్లో ఉన్న అపార్ట్మెంట్ల మూసిన తలుపులను మాత్రమే చూపిస్తోంది. గత కొద్దికాలంగా ముంబైలో ఉపయోగంలో లేని అతడి కార్యాలయాల జాబితాను పేర్కొంటోంది. కుంభకోణం వివరాలు వెల్లడవుతున్న సందర్భంలో కూడా అతడు ఎలా దేశం వదలి వెళ్లగలిగాడు? ఈ రెండు కేసులూ వారు దేశం విడిచి వెళ్లిపోవడానికి లోపల నుంచే ఎవరో సహకరించారన్న అంశాన్ని స్పష్టాతిస్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఈ రెండు ఉదంతాలూ కాకతాళీయంగా జరిగినవి కాదు. కేంద్రప్రభుత్వం లోని అత్యున్నత శాసనాధికారి ఒకరు గత సంవత్సరం సుప్రీంకోర్టుకు వివరణ ఇస్తూ, ’విజయ్ మాల్యా పాస్‌పోర్ట్‌ని స్వాధీనపర్చుకోవడానికి తాము దరఖాస్తు చేయడానికి ప్రయత్నించిన మార్చి 2వ తేదీనే అతడు దేశం విడిచి వెళ్లాడని’ తెలిపారు. అంటే ఎవరో మాల్యాకు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఇక మోదీ వ్యవస్థను దెబ్బకొట్టడమే కాదు.. ఆతడి మామయ్య ముఖుల్ చోక్సీ కూడా తన బ్యాంక్ ఖాతాలో ఏమీ మిగల్చలేదు. ఇంతవరకు వారనుభవించిన కోట్ల సంపదతో పోలిస్తే ఇతడి ఖాతాలో కొన్ని లక్షల రూపాయలు మాత్రమే మిగిలి ఉండటం గమనార్హం. కొన్ని ఖాతాల్లో నయాపైసా కూడా లేదని వార్తలు. స్పష్టమైన ఉద్దేశంతోటే ఈ ఖాతాలను చాపచుట్టేశారని తెలుస్తూంది. నిఘా సంస్థలు ఈ ఉదంతంపై పరిశోధన చేస్తున్నాయి, ఇప్పటివరకూ రూ.5,000 కోట్ల విలువైన వజ్రాలను, ఆభరణాలను వీరి నుంచి స్వాధీనపర్చుకున్నట్లు ప్రకటించాయి. తమ ఖాతాలను వారు ఖాళీ చేసి ఉన్నట్లయితే, నిఘా సంస్థలు స్వాధీనపర్చుకున్న భారీ నగలను వారు నీటిబుడగల రీతిలో ఎందుకు వదిలేశారు అనేది ప్రశ్న. నీరవ్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత అతడు దేశం విడిచి వెళ్లాడంటే అది కచ్చితంగా ఇన్సైడర్లు సమాచారం ఇచ్చారని సూచిస్తోంది. మీరు తప్పుడు మార్గాల్లో డబ్బు పోగుచేసి సంపన్నులైనా సరే, మీకు కీలక క్షణాల్లో సహాయం చేయడానికి నిఘా సంస్థల్లోనే ఎవరో ఒకరు సిద్ధంగా ఉంటున్నారని ఇప్పుడు మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎవరికీ తెలియకుండా దేశం వెళ్లిపోవడమన్నదే అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఈ రకమైన నిష్క్రమణలు మొత్తం దర్యాప్తు క్రమాన్నే దెబ్బతీస్తున్నాయి. ఎందుకంటే వారు అందుబాటులో లేరు. ఆలా కానట్లయితే, వారు నిఘా సంస్థలకు సులువుగా దొరికేవారు. లేదా వారిని కనీసం కస్టడీలో అయినా ఉంచేవారు. సాక్షులు తాము ఇచ్చిన సాక్ష్యాలనే మార్చివేస్తుండటంతో భారత్‌లో నేర విచారణ చాలాకాలం తీసుకుంటోంది. మొత్తం మీద చెప్పాలంటే సీబీఐ మహర్షుల సంస్థ రకానికి చెందినది కాదు. ఈ మోసాలు ఎలా జరిగాయన్నది దర్యాప్తులో తేలవలసిన అంశం. కానీ మనం సాధారణంగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది ఏమిటంటే, అత్యున్నత స్థాయిలోని ప్రముఖులు దేశం విడిచి పారిపోయేలా సమాచారం ఇస్తున్నదెవరు అనే అంశమే. లండన్లోనో లేక న్యూయార్క్ లేక ఆంట్వెర్ప్ లోనో ఇలాంటి మోసగాళ్ల నేరాలను విచారించడం విభిన్నమైన అంశం కాబట్టి వీరి పరారీ మొత్తం విచారణను మరొక అననుకూల స్థాయికి తీసుకెళుతోంది. తప్పుడు అవగాహనా పత్రాలను ఉపయోగించుకునేవారు, పేలవమైన వ్యవస్థ ఒక అంశమైతే, చట్టం కోరలనుంచి వారు తప్పించుకుపోయేలా సహా యం చేస్తున్నదెవరు అనేది మరొక అంశం. ఈ విషయాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా ఇలాంటి, లోపలనుంచి సమాచారం ఇచ్చేవారు ఎన్నటికీ దొరకరని నేను పందెమొడ్డుతాను. ఇక వీరిని శిక్షించటం అనేదాన్ని వదలేయండి. ఏ స్థాయి నుంచి నీరవ్‌కి సమాచారం అంది ఉంటుంది? తనపై ఎఫ్ఐఆర్ టైప్ చేసిన క్లర్క్ పనా లేక మరొక అత్యున్నత అధికారి పనా? భారతీయ బ్యాంకింగ్ చరిత్రలోనే అతి పెద్ద వంచనకు పాల్పడిన వారితో పాటు వారు దేశం విడిచి వెళ్లేలా సమాచారం అందించిన వారు కూడా నేరస్తులే. సాధారణ న్యాయ ప్రక్రియకే వీరందించిన సమాచారం తూట్లు పొడిచింది కాబట్టి వీళ్లను అసలు వదలిపెట్టకూడదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com మహేశ్ విజాపుర్కర్ -
వార్తా? అభిప్రాయమా?
విశ్లేషణ వార్తల అన్వేషణ కంటే స్టుడియోలో చర్చలు నిర్వహించడం చాలా చౌక. జాతీయ చానళ్లు అనేవి ‘రోజుకు ఒకటే కథనం’ అనే వైఖరితో, దేశంలో మరేమీ జరగలేదన్నట్టుగా దాన్నే రాత్రికి చర్చనీయాంశం చేసుకుంటున్నట్టుంది. వార్తా పత్రికలకు చందాలు కట్టడం మానేసిన పలువురు దశాబ్ది కంటే కంటే క్రితమే నాకు తటస్థ పడ్డారు. ఇంటర్నెట్లో వార్త లను చదువుకోగలగడం అందుకు కారణం కాదు. సాధారణంగా టాబ్లాయిడ్ పత్రికల్లో కనిపించే సంచ లన వార్తలను వార్తా పత్రికల్లో చదవాల్సి వస్తుండ టమే అందుకు కారణం. వాస్తవాలు రోజు రోజుకీ మరింత భయానకంగా మారాయి. దీంతో వారూ, వారిలాంటి చాలా మంది ఇతరులు నేడు వార్తా టీవీలను చూడటమంత పాపం మరేదీ లేదని వాటిని చూడటం మానేశారు. ‘వార్త’ అంటే ఏమిటో టీవీ ఎన్నడో మరచిపోయిందని వారు గుర్తించారు. కనీసం ఇది జాతీయ చానళ్లకైనా వర్తిస్తుంది. వాటి లోని కుశాగ్ర బుద్ధులు వార్తల కోసం బయటకు వెళ్లటం అవసరమా? అని అడుగుతుంటారు. మొదట్లో, టెలివిజన్ వార్తలను మన ముంగిట నిలిపిన మాట వాస్తవమే. కానీ, నేటి స్థితిని చూస్తుంటే బాబ్ ఉడ్వార్డ్తో కలసి వాటర్‌గేట్ కుంభ కోణాన్ని బయటపెట్టిన సుప్రసిద్ధ పాత్రికేయుడు కార్ల్ బెర్న్‌స్టీన్ చెప్పిన విలువైన మాట గుర్తుకు వస్తుంది. ‘‘వాస్తవానికి సంబంధించి లభించగల అత్యుత్తమ కథనం’’ అందించడం కోసం వార్తా మీడియా కృషి చేయాలి. కానీ పాత్రికేయ వృత్తి నేడు ఎంత మాత్రమూ ‘‘నిబద్ధతగలది’’గా లేదు. టీవీ జర్నలిజం పూర్తిగా భిన్నమైనది, వార్తా సేక రణ చాలా వ్యయభరితమైనది. సందేహం లేదు. ఈశాన్య ప్రాంతానికంతటికీ తమ చానల్కున్న ఓబీ వ్యాన్ ఒక్కటే కాబట్టి అక్కడి వార్తలను సరిగ్గా అందించలేకపోతున్నామని రాజ్‌దీప్ సర్దేశాయ్ తర చుగా అంగీకరిస్తుంటారు. అయితే, వార్తాపత్రికలు పీటీఐ, యూఎన్ఐలపై ఆధారపడినట్టే చాలా వరకు చానళ్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వార్తలు, కథనాలపై ఆధార పడుతుంటాయి. మరో పాత్రికేయుడు రవీశ్ కుమార్ (ఎన్డీటీవీ ఇండియా) తమ సిబ్బందిని తీసుకుని ఓ మురికివాడకు లేదా కళాశాలకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకో వడం ప్రారంభించారు. అందుకోసం రాత్రి ప్రైమ్ టైమ్ ‘‘చర్చ’’ను విడిచిపెట్టేసే సాçహసం చేశారు. రాత్రి ‘‘ప్రదర్శన కోసం కోతులను తెచ్చే’’ అలాంటి చర్చలు వార్తలలోని సమాచార సారాన్ని చంపేస్తా యని ఆయన బహిరంగంగానే హెచ్చరించారు. ఆయన చెప్పింది సరైనదే. సరైన సమాచారం లేదా ఏ సమాచారమూ లేకపోయినాగానీ ఏ పక్షం తరఫునైనా వాదనా పటిమగల ఓ పార్టీ పెద్దమనిషి స్టూడియోలోని తన ప్రత్యర్థికి∙సమయాన్ని నిరాక రించి లేదా మిగతా అందరి నోళ్లను మూయించేసి తానే మాట్లాడటం ఎందుకు? ఒక్క ప్రభుత్వ ప్రతి నిధినైనా అలాంటి చర్చలకు ఎందుకు తీసుకురారు? కనీసం వారి దృష్టి కోణాన్ని చెప్పడానికైనా పిలవరెం దుకు? మొదట్లో వాటికి ‘చాట్ షోస్’ (సంభాషణా కార్యక్రమాలు) అనే తగిన గుర్తింపే ఉండేది. కొద్ది కాలానికి వాటిని ‘చర్చల’ స్థాయికి లేవనెత్తారు. ఆ తర్వాత, కించపరచేవిగా దిగజార్చారు. చాలా సంద ర్భాల్లో యాంకర్లే స్వయంగా కేకలేస్తుండే స్థాయికి లేదా చర్చకే స్థానం లేకుండేలా పద్ధతిని పాటించని వారిని మాట్లాడటానికి అనుమతించే స్థాయికి అది దిగజారింది. దానికే రోజువారీ ముఖ్య కార్యక్రమాల్లో ఒకటిగా ప్రైమ్‌టైమ్‌ను కేటాయిస్తున్నారు. నా దృష్టిలో ప్రైమ్ టైమ్ అంటే బీబీసీ, అల్ జజీరా చానళ్లలాగా వార్తలన్నిటినీ అందించడానికి అత్యుత్తమ సమయమని అర్థం. ఏదైనా పరిణామా నికి నేపథ్యాన్ని తెలపడం కోసం ఎవరైనా నిష్పాక్షిక నిపుణుల అభిప్రాయాలను జోడించవచ్చు. కానీ మన చానళ్లకు మనమంతా ఏ పనీ పాటూ లేకుండా టీవీ ముందు కూచుని, రోజంతా వార్తలను చూసే బాప తనే తప్పుడు అభిప్రాయం ఉన్నట్టుంది. మన వాళ్లు టీవీ పెట్టేసరికి, చెవులు దద్దరిల్లేలా అరుపులు, ఆగ్రహం ప్రత్యక్షమౌతాయి. ఎవరు ఏమి చెప్పారో కూడా తెలియకుండానే సాగే ఈ నిస్సారమైన రాత్రి నాటకాలు ప్రజల బుర్రలపై పట్టుబిగించి, ప్రభా వితం చేయడంలో ఆశ్చర్యమేమైనా ఉందా? వార్తల అన్వేషణ కోసం సిబ్బందిని పంపడం కంటే స్టూడి యోకి చర్చలు జరిపేవారిని రప్పించడం చాలా చౌక. దేశంలోని అన్ని భాషలవారికి చేరగల ఇంగ్లిష్, హిందీ చానళ్లు అనే దృష్టితో జాతీయ చానళ్లు అని పిలిచేవి బహుశా ‘రోజుకు ఒకటే కథనం’ అనే వైఖరిని అవ లంబిస్తున్నట్టుంది. 130 కోట్ల జనాభాగల దేశంలో మరేమీ జరగలేదన్నట్టుగా ఆ కథనాన్నే రాత్రికి చర్చ నీయాంశం చేసుకుంటున్నట్టుంది. ప్రతి అంశం మీదా వ్యాఖ్యానించడానికి ఒక రాజకీయవేత్తను కనిపెట్టి, ఆ తర్వాత వారు దాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించడం ఇందులోని విషాదకరమైన భాగం. ‘మీరు మీ భార్యను కొట్టడం మానేశారా?’ వంటి సమాధానాన్ని కూడా చెప్పేసే ఏక వాక్య ప్రశ్నలను సంధించి వ్యక్తులను ఉచ్చుల్లో పడేయడం జరుగుతుంది. ప్రసారం చేయడానికి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం కాదది, అవును లేదా కాదు అనే రెండు అంశాల చర్చను పెంపొం దింపజేయడం. ‘వార్తల’ శకం నుంచి నేడు మనం వినోదానికి నల్లమందును జోడించే ‘సమాచార వినోద’ శకానికి పరివర్తన చెందలేదా? వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేశ్ విజాపుర్కర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
దిద్దుబాటు సాధ్యమేనా?
విశ్లేషణ మరో ప్రాంతంలోని ఎన్నికల ప్రచార కార్యకలాపాల సమాచారం పోలింగ్ జరుగనున్న ప్రాంతానికి చేరకుండా నివారించడం అసాధ్యం. పోలింగ్ జరగాల్సిన ప్రాంతానికి ప్రసారాలను పాక్షికంగా నిలిపివేయలేరు. పోలింగ్‌కు ముందు 48 గంటల పాటూ ‘‘ఎన్నికల ప్రచారం ఉండరాదు’’ అని చెప్పే ఎన్నికల నియమావ ళిని ఉల్లంఘించినందుకు బీజేపీ అధ్యక్షులు అమిత్ షాకు నోటీసులు ఇవ్వక పోవడం ఎన్నికల కమిషన్ చేసిన మొదటి తప్పు. ఆ ఆరోపణతో రాహుల్ గాంధీకి నోటీసు ఇవ్వడం అది చేసిన మరో తప్పు. ఆధునిక కాలంలో మీడియా కలు గజేయగల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల నియమావళిలో మార్పులను తేవటం సాధ్యమేమో పరిశీలించాలని ఎన్నికల సంఘం ఇప్పుడు నిర్ణయించింది. సుదీర్ఘకాలంగా విస్మరించిన ఆ బాధ్యతను అది ఇప్పటికిగానీ మేల్కొని గుర్తించలేదు. సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన విప్లవం (అది ఇంకా పూర్తి కాలేదు, దాని ప్రభావం చివరికి ఎలా ఉండనుందో తెలియదు!) కారణంగా దృశ్య, శ్రవణ, లిఖిత రూపాల్లోని సమాచారం నేడు అప్పటికప్పుడే ప్రజలకు చేరి పోతోంది. దాని ప్రతికూల ప్రభావం ఎలాంటిదో ముందుగానే తేటతెల్లం అయింది. ఓటర్లతో పార్టీ లకూ, అభ్యర్థులకు ఉండే సంబంధాలకు వర్తించే ఎన్నికల నియమావళిని సునిశితంగా పునఃపరిశీలిం చాల్సిన అవసరాన్ని ఈసీ గుర్తించి ఉండాల్సింది. పోలింగ్‌కు ముందు వారాలు, రోజుల తరబడి హోరెత్తించిన వాగ్దానాలు, ఆరోపణలు, ప్రత్యారోప ణలు, విజయాలు, వైఫల్యాలు తదితరాలన్నిటిని సావధానంగా ఆలోచించి తగిన వారిని ఎంపిక చేసు కునే అవకాశం ఓటర్లకు ఉండాలి. ఆ అవకాశాన్ని కల్పించాలనే 48 గంటలు ప్రచారం లేకుండా నిశ్శ బ్దంగా ఉండాలనడం. అత్యంత రణగొణధ్వనులతో సాగే ఎన్నికలు బహుశా మనవే కావచ్చు. టీవీ, ఇంట ర్నెట్, స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని వీధుల్లోని ఆ గోల ఇప్పుడు ఇళ్లలోకే ప్రవేశించింది. పోలింగు రోజున రాజకీయ పార్టీలు తమ ప్రకటనలను పత్రికల మొదటి పేజీలో ప్రచురించుకోవడాన్ని ఎన్నికల కమి షన్ ఆమోదిస్తూనే ఉంది. దేశానికి లేదా రాష్ట్రానికి తదుపరి పాలకులుగా తమ నేతలే ఎందుకు మెరుగైన వారో గొప్పగా ఆ ప్రకటనలు చెబుతుంటాయి. ఈ వ్యవహారంలో కెల్లా బాగా చిరాకెత్తించే విషయం అదే. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాకున్నా, దాని స్ఫూర్తికి భంగం కలిగించేది. అయినా ఈ విష యంపై ఈసీ తగినంత శ్రద్ధ చూపలేదు. ఈ వ్యవ హారంతో సంబంధమున్న వారంతా దీనివల్ల లాభప డేవాళ్లే. కనీసం ముందుగా పత్రికల్లో ప్రకటనల కోసం స్థలాన్ని బుక్ చేసుకున్నవారికైనా ఇది లాభ దాయకమైనది. ఇక మీడియాకు ఆర్థికంగా లాభదా యకమైనది. కాబట్టి ఈ విషయంపై మౌనం వహిం చడమనే కుట్రదే పైచేయి అయింది. ఇక మనం 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ పోలింగ్ స్టేషన్‌కు సమీపంలో నిలబడి తమ పార్టీ ఎన్నికల గుర్తును చూపిన ఘటనను చూద్దాం. అది ఎన్నికల నిబంధనావళికి ఉల్లంఘనే. కానీ నేడు మీడియాకు ఉన్న విస్తృతిని, వేగాన్ని దృష్టిలో ఉంచు కుంటే అలాంటి దృశ్యం రెండవ దశ ప్రచారం సాగు తున్న వేరేదైనా ప్రాంతం నుంచి తరచుగా ప్రసారం అవుతూ కనిపిస్తుంటుంది. కాబట్టి, ఈ నిబంధన అమల్లో ఉన్నా దాన్ని సులువుగానే తప్పించుకో వచ్చు. అలాగే, ఆ దృశ్యం మోదీ గుజరాత్లో లేదా ఆ రాష్ట్రానికి వెలుపల మరెక్కడో నిర్వహించిన రోడ్ షోలోనిదీ కావచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126 పరిధిని పరిశీలించడం కోసం ఆదివారం ఎన్నికల కమిషన్ ఒక కమిటీని నియమించింది. అందులో సమాచార, ప్రసార శాఖ, న్యాయ శాఖ, నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్, ప్రెస్ కౌన్సిల్ ప్రతినిధులు సభ్యులు. ఇది ఆహ్వానించదగిన చర్య. కానీ, ఇప్పుడే చెబుతున్నాను, ఆ పని చాలా కష్టమైనది. ‘‘ప్రస్తుతం ఉన్న సమాచార ప్రసార సాంకేతికతల నేపథ్యంలో’’ ఇది ఈవీఎంల విశ్వసనీయతను రుజువు చేయడం కంటే చాలా కఠినమైన పని. ఇక మీదట దశలవారీ పోలింగ్ జరపరాదని నిర్ణయిస్తే తప్ప, చాలా కష్టమైన పని. శాంతిభద్రతల పరిరక్షణ, శాంతిభద్రతలను అమలు పరచే సిబ్బంది తరలింపు తదితరాల నిర్వహణ నానాటికీ మరింత కష్టతరంగా మారుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఎన్నికల కమిషన్ దేశాన్ని లేదా రాష్ట్రాలను పలు విభాగాలుగా విభ జించి, దశలవారీ పోలింగ్‌ను నిర్వహించడం పరి పాటిగా మారింది. అయితే ఈ పద్ధతి వివిధ విభా గాల మధ్య సమాచార ప్రసారాలకు అవకాశాన్ని కల్పిస్తోంది. పోలింగ్ జరుగుతూండగా సాగే టీవీ చర్చలు సైతం ఓటర్లను ప్రభావితం చేయగలవని సైతం ఎన్నికల కమిషన్‌కు తట్టలేదు. మరో ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యకలాపాల సమాచారం పోలింగ్ జరుగ నున్న ప్రాంతానికి చేరకుండా నివారించడం అసా ధ్యం. పోలింగ్ జరగాల్సిన ప్రాంతానికి ప్రసారాలను పాక్షికంగా నిలిపివేయడం చేయలేరు. చివరి దఫా పోలింగ్‌లో చిట్టచివరి ఓటు పోలయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిలిపి ఉంచడం అంత మామూలు విషయమేమీ కాదు. గుజరాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాక ఆదివారం జరిగిన ఉప ఎన్ని కల్లో ఓటర్ల ఎంపికను ఆ ఫలితాలు ప్రభావితం చేసి ఉండొచ్చు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేశ్ విజాపుర్కర్, ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
‘వైద్యానికి’ చెయ్యాలి చికిత్స
విశ్లేషణ మన వైద్య సేవల వ్యవస్థ పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలపై ఆధారపడినదిగా మారుతున్నది. కాబట్టి ప్రైవేటు వైద్య సేవల వ్యవస్థ పట్ల దృఢంగా వ్యవహరించా ల్సిన సమయం ఇదే. దీనికితోడు ప్రభుత్వరంగ వైద్య సేవలను మెరుగుపరచాలి. ఢిల్లీలోని ఒక ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేయడంపై చాలా గగ్గోలు రేగుతోంది. హరి యాణా ప్రభుత్వం కూడా ఒక ఆసుపత్రి నిర్మాణం కోసం ఇచ్చిన భూమి లీజును రద్దు చేసింది. దీనిపై కూడా కొంత అలజడి రేగినా, అది ఢిల్లీలో దానికంటే తక్కువే. ఏది ఏమైనా రెండు ప్రభుత్వాలూ రెండు పెద్ద ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నాయి. ఒకటి ఒక నవజాత శిశువు బతికే ఉన్నా, చనిపోయినట్టు సర్టిఫికెట్ ఇచ్చింది. మరొ కటి ఒక డెంగ్యూ రోగి చికిత్సకు ఊహింపశక్యం కానంత పెద్ద సంఖ్యలో సిరంజ్‌లను వాడినట్టు చూపడం సహా భారీగా బిల్లులను వడ్డించింది. ఢిల్లీ ఆసుపత్రి లైసెన్స్‌ను ఉపసంహరించడాన్ని అక్కడి ఇన్‌పేషంట్లను గాలికి వది లేయడం అన్నట్టు చూస్తున్నారు. కానీ అలా జరగలేదు. అందరు ఇన్పేషెంట్లనూ డిశ్చార్జ్ చేసేవరకు చికిత్స అందించడాన్ని అనుమతించారు. హరియాణా ప్రభుత్వం తీసుకున్న చర్య పర్యవసానం కూడా ఇంచుమించు అలాంటిదే. ప్రభుత్వం తీసుకున్నది సరైన రీతిలో తీసు కున్న చర్యేనా? అని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఉదా హరణకు, ఢిల్లీ విషయంలో మొత్తంగా ఆ కార్పొరేట్ సంస్థపైన చర్య తీసుకోవడం కంటే ఆ ఘటనతో ప్రమేయం ఉన్నవారిపైన చర్య తీసుకోల్సిందంటూ అందుకు ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నారు. ఇక్కడితో ఈ కథ ముగిసిపోతుందని అనుకోవడా నికి లేదు. న్యాయమూర్తులు ఏం తీర్పు చెబుతారో తెలి యదు. కానీ భారీ అసుపత్రులు, ప్రత్యేకించి ఆసుప త్రుల నెట్వర్క్ ఉన్న సంస్థలు తమకు మచ్చ రావడాన్ని భరించలేవు. చచ్చే వరకు అన్నట్టు కడదాగా పోరాడ తాయి. నా వాదన సరళమైనదే. పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలపై ఆధారపడినదిగా మారుతున్న ప్రైవేటు వైద్య సేవల వ్యవస్థతో దృఢంగా వ్యవహరించాల్సిన సమ యం ఇదే. వాటికి అలవాటుగా మారిన తప్పుడు పద్ధ తులకు బాధ్యత వహించకుండా వాటిని తప్పించుకు పోనివ్వకూడదు. ఇటీవలి కాలంలో ఆసుపత్రులు అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయనీ. గుండె, ఎముకలకు సంబంధించిన ఇంప్లాంట్ ఉపరకరణాల నుంచి సిరం జ్ల వరకు దాదాపు అన్నిటి నుంచి భారీగా లాభాలు చేసుకుంటున్నాయని తెలిసిందే. ఇన్పేషెంట్ను ఇలా చూసి వెళ్లినందుకు డాక్టర్ చార్జీలు సహా దాదాపుగా మన ఊహకందే ప్రతిదానికీ వసూలు చేసే అధిక చార్జీలకు ఈ లాభాలు అదనం. బెడ్లు ఖాళీగా ఉండకూడదని వారాంతానికి ముందు పేషంట్లను డిశ్చార్జ్ చేయ కుండా ఉండటం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే, కేవలం ప్రైవేట్ ఆసుపత్రులపైన మాత్రమే దృష్టిని కేంద్రీకరించడం తప్పు. ప్రైవేటు రంగంలో అమల్లో ఉన్న తప్పుడు పద్ధతు లకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోవాలి. ప్రజా ధనంతో ఏర్పడిన వైద్య సేవల వ్యవస్థ పేషెంట్లను వారి స్తోమతకు సరితూగని ప్రైవేట్ రంగం వైపు తరిమేస్తుం డగా, ప్రైవేట్ రంగం భారీగా విస్తరించి పోతున్నదో తెలుసుకోవాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ నెల 10న నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నిర్ధారణలను ప్రచరించింది. గ్రామీణ కుటుంబాలలో నాలుగింట ఒకటి, పట్టణ కుటుంబాలలో ఐదింట ఒకటి ఆసుపత్రి ఖర్చుల కోసం ‘‘తప్పనిసరై అప్పు చేయాల్సి’’ వస్తోంది. ఉచితంగా లేదా దాదాపు ఉచితంగా సేవలందించే ప్రభుత్వ ఆసు పత్రుల చికిత్సకు సైతం పైన అయ్యే ఖర్చులు భరిం చాల్సి రావడం వల్ల చాలా మంది చితికిపోతున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వెళ్లేవారిని కూడా పరిగణనలోకి తీసుకునే ఉంటారు. వైద్యంపై తలసరి వ్యయం అ«ధి కంగా ఉన్న, మంచి వైద్య సదుపాయాల వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లో వైద్య రుణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని వెల్లడి కావడం ఆసక్తికరం. కుటుంబాల ఆర్థిక స్థితిగ తుల్లో కల్లోలాన్ని రేపేది ప్రైవేటు ఆసుపత్రులే కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు నడిపేవి కూడా అందుకు ఎలా కారణం అవుతున్నాయో ఇది వివరిస్తుంది. అధ్వాన సదుపాయాలు, అధ్వాన రోగనిర్ధారణ, అధ్వాన చికిత్స, భౌగోళికంగా అందుబాటులో లేకపోడం మన ప్రభుత్వ వైద్య సేవల ప్రధాన లక్షణాలు. పట్టించుకునేవారు ఎవరూ లేరన్నట్టుంది ఇది. ఢిల్లీ, హరియాణా ప్రభుత్వాలు హఠాత్తుగా ఇలా విరుచుకు పడటం పట్ల అసంతృప్తి ఉండొచ్చునేమో గానీ, మిగతా పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమ తమ రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య వ్యవస్థల నుంచి కూడా అదే స్థాయి నిబద్ధతను, సమర్థతను ఎవరు డిమాండు చేస్తారు? అనేదే అసలు సమస్య. ఢిల్లీ ప్రభుత్వం అంద రికీ అందుబాటులో ఉండే మంచి వైద్య సదుపాయాల వ్యవస్థను మొహల్లా (బస్తీ) క్లినిక్‌లను ఏర్పాటు చేసి నట్టు తెలుస్తోంది. కానీ మీడియా వాటిని పెద్దగా వెలుగులోకి తేలేదు. ఢిల్లీ ప్రభుత్వం, ముందు తమ సొంత వ్యవస్థను సక్రమంగా నడిపాకే ఇతరులను కూడా అలా చేయాలని కోరాలనే సరైన వైఖరిని చేపట్టినట్టు అనిపి స్తోంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com మహేశ్ విజాపుర్కర్ -
బడులే బందెల దొడ్లు
విశ్లేషణ ఎందుకూ కొరగాని పశువులను అమ్ముకోవడానికి వీల్లేక ఆర్థికపరంగా లాభదాయకంగాని పశువుల సంఖ్య పెరిగిపోతోంది. వాటి యజమానుల పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు అవుతోంది. ఇటీవల, ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ స్థానిక పాఠశాలలో గాలికి తిరిగే ఆవులు సహా దాదాపు 250 పశువులను బంధించి, అక్కడ చదువుకునే హక్కున్న పిల్లలను బయ టకు గెంటేశారు. ఆ బడి ఇక ఎన్నటికి తిరిగి పని చేయడం మొదలవుతుందో విద్యార్థులకు, ఉపాధ్యా యులకు కూడా తెలియదు. ఇదేదో ఒంటరి ఘటన కాదు. కౌ బెల్ట్ (హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్)గా పిలిచే ప్రాంతంలో ఉన్న ఈ రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా జరిగిన ఐదో ఘటన ఇది. రైతులు, తమ పిల్లల చదువులు పోతే పోనీ అని, పశువులను బళ్లోకి తోలి, దాన్ని బందెలదొడ్డిగా మార్చే టంతటి తీవ్ర చర్యకు ఎందుకు పాల్పడ్డారో చెప్పా ల్సిన అవసరం లేదు. గోవధ నిషేధంతో వట్టి పోయిన, ముసలి, పనికిరాని పశువుల యజమానులు ఊరికే వాటిని పోషించాలని కోరుకోవడం లేదు. వాటిని గాలికి వదిలి, రైతుల పంటలు సహా ఎక్కడ ఏమి దొరికితే అది మేయమని వదిలేస్తున్నారు. గోవధ నిషేధం ప్రమాదకరమైన దుస్సాహస మని వ్యవసాయ శాస్త్రవేత్తలు పదే పదే చెబుతూనే ఉన్నారు. పాడి పశువులన్నీ షెడ్లలో పెట్టి క్రమ పద్ధ తిలో పోషించే పశువులు కావని సైతం చెప్పారు. చాలా మంది రైతులు, ప్రత్యేకించి చిన్న, సన్నకారు రైతులకు అది అనుబంధ కార్యకలాపం మాత్రమే. వారు తమ పశువులను గ్రామ ఉమ్మడి ప్రాంతాల్లో మేతకు వదిలేస్తారు. మన వ్యవసాయ జీవావర ణంలో పచ్చిక మైదానాలు భాగం కావు. ఎక్కడబ డితే అక్కడ మేయడమే ఎక్కువగా జరుగుతుం టుంది. దీంతో గాలికి వదిలేసే పశువులతో పాల నిచ్చే పాడి పశువులు గ్రాసం కోసం పోటీపడాల్సి వస్తుంది. ఇది మొత్తంగా మన పశు పోషణ వ్యవ స్థకు, దాని వల్ల కలిగే ఆర్థికపరమైన ప్రయోజనాలకు తూట్లు పొడుస్తుంది. గోవధ నిషేధం కారణంగా కొద్దిపాటి భూమికి యజమానులైన వారు ఏది ఏమైనా సరే తమ పశువు లను గౌరవించాల్సిందే. కాబట్టి వాటికి మేతను ఎక్కడని సంపాదించాలి? ఇకపోతే, కేరా బీఫ్‌ను (గేదె, దున్నపోతుల మాంసం) కూడా గోమాంసమే నని గోరక్షకులు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కేరాబీఫ్ సైతం గోరక్షకులకు ఆగ్రహం కలిగేలా చేసి, వారి చేతుల్లో క్రూరమైన హింసకు గురికావాలని కోరుకోవ డంగా మారవచ్చు. ఇలా పనికిరాని పశువులు వేటినీ అమ్ముకోవడానికీ మార్కెట్ దొరకకపోవడంతో ఆర్థి కపరంగా లాభదాయకంగాని పశువుల సంఖ్య హఠా త్తుగా పెరిగిపోతోంది. దీంతో అలాంటి పశువుల యజమానుల పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు అవుతోంది. అంటే వాటికి మేతను సంపా దించి సాదలేరు లేదా అమ్మడమో, వధించడమో కూడా చేయలేరు. గోవధ నిషే«ధ సమర్థకులు ఈ సమ స్యకు పరిష్కారాన్ని చూపలేదు. రాజస్తాన్, మధ్య ప్రదేశ్లలో గోవధ నిషేధ ప్రచారకులు నడుపుతున్న గోశాలల్లో సైతం వందల కొద్దీ పశువుల మృత కళే బరాలు కనిపిస్తున్నాయి. గోవధ నిషేధం బాగోగుల గురించి కాక, పర్య వసానం ఎంత సంక్లిష్టమైనదిగా ఉంటుందో అర్థం చేసుకోకుండానే విధాన నిర్ణయాలను తీసుకోవడం పైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నాను. ఈ నిర్ణయాన్ని, పెద్ద నోట్ల రద్దుతో పోల్చవచ్చు. కొత్త నోట్లు పెట్ట డానికి అనువుగా ఏటీఎమ్‌లలో మార్పులను చేపట్టా లని ఆర్బీఐ, బ్యాంకులను ఆదేశించినా అవి ఆ పని చేయలేదు. ఆర్బీఐ కూడా ఏటీఎంలలో పట్టని కొల తలతోనే కొత్త నోట్లను తేవాలని నిర్ణయించింది. గొడ్డు మాంసం ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విషయం కూడా ఆలోచించాలి. అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం గొడ్డు మాంసం ఎగుమతిలో భారత్‌దే అగ్రస్థానం. ఈ విషయంలో మన ఎగుమతులు బ్రెజిల్ కంటే కూడా ఎక్కువ. అమెరికా గొడ్డు మాంసం అనేటప్పుడు బీఫ్ (గో మాంసం), కేరాబీఫ్ (గేదె మాంసం)లను ఒకటిగానే పరిగణించింది. సరిగ్గా మన గోరక్షకులు చేసినట్టే చేసింది కదూ? అయితే, పశువుల యజ మానుల ఆర్థిక, నిర్వహణాపరమైన దుస్థితితో పోలిస్తే బీఫ్ ఎగుమతుల సమస్య చాలా చిన్నదే. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ భూమి ఉన్న యజ మానులు తమ పశువులను తరచుగా ఇంటి ముందే కట్టేసుకుంటారు. పశువుల కొట్టం లాంటి ఏర్పాటుకు నోచుకునే పశువులు తక్కువే. గోవధ నిషేధం ఫలి తంగా అదనంగా ఎంత పేడ లభిస్తుంది, దాన్ని ఏ మేరకు ఉపయోగించుకోగలం అనేది మనకు ఇంకా తెలిసి ఉన్నట్టు అనిపిం^è డం లేదు. పేడను ఎండబెట్టి చేసే పిడకలను వంటకు వాడటం వల్ల పొగ వస్తుం దని దాన్ని నిరుత్సాహపరుస్తున్నారు. గాలికి వదిలేసిన పశువులు, రెండు దశాబ్దాలకు పైగానే ప్లాస్టిక్ సంచులను తింటున్నట్టు తెలుసు. గతంలో అవి అనూహ్యంగా జరిగిన ఘటనలు. ప్లాస్టిక్ సంచుల వాడకం, వాటిని నిర్లక్ష్యంగా ఎక్క డబడితే అక్కడ పడేయడం పెరిగిపోతుండటానికి అనుగుణంగా.. విషపూరితమే అయినా ప్లాస్టిక్ సంచులు తినడానికి తమకు అనువుగా ఉండే ఆహా రమని పశువులు త్వరలోనే గుర్తిస్తాయి. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ :mvijapurkar@gmail.com మహేష్ విజాపృకర్ -
అంతులేని రుగ్మత అవినీతి
విశ్లేషణ పెద్ద నోట్ల రద్దు నల్ల ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బే అయినా అవినీతి అనే రుగ్మతను అంతం చేసేదేమీ కాదు. ఆ భూతం అంత తేలికగా అంతమయ్యేది కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే అవినీతి నిర్మూలన అంతేలేని కఠోర కర్తవ్యం. ఐదు వందలు, వెయ్యి రూపా యల నోట్ల రద్దు నల్లధనంపై ప్రభావం చూపుతుందని, నకిలీ నోట్లను చలామణిలోంచి తొలగి స్తుందని, ఉగ్రవాదులు వాటిని ఉపయోగించడాన్ని సైతం నివారి స్తుందని భావించారు. ప్రభుత్వం చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇవన్నీ గొప్ప ఉద్దేశాలే. కాకపోతే దాన్ని అమలు జరుపుతున్న పద్ధతి మాత్రం అధ్వానమైనది. అది, మొత్తంగా దీన్నంతటినీ అపహాస్యం చేసేదిగా ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఒక్కొక్క కోణాన్ని ఆర్థికవేత్తలు రోజూ వెలుగులోకి తెస్తున్నారు. వాటి పర్యవ సానాల వివరణలు పుట్టుకొస్తూ నరేంద్ర మోదీ గర్వించడా నికేమీ మిగలకుండా చేస్తున్నాయి. అయితే, పాక్షికంగానే అయినా ఆయన తన లక్ష్యాలను సాధిస్తారు. వ్యవస్థ ప్రక్షా ళనకు అవసరమైన పలు చర్యలలో పెద్ద నోట్ల రద్దు ఒకటి మాత్రమే. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు భారీ ఎత్తున డబ్బును ఖర్చు చేయడాన్ని నిర్మూలించేలా ఎన్నికల సంస్క రణలను తీసుకురావడం మరొ కటి. అయితే అది ఎన్నికల ఖర్చులకు ప్రభుత్వమే నిధులను సమకూర్చడంతోనే సాధ్య మయ్యేది కాదు. రాజకీయాలలో నైతిక వర్తనను పునరుద్ధ రించడం అందుకు అవసరం. అధికార చట్రంలో ఉన్నవారు భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టుకోడాన్ని, పన్నులు ఎగవేయ డాన్ని నివారించేది ఏది? విధాన నిర్ణయాలను తీసుకునే దగ్గరి నుంచి చిట్టచివరి స్థాయిలో వాటిని అమలుచేసే వరకు ఉండే అధికారులు కూడా ఇందులో భాగమే. చలామణిలోని 86 శాతం కరెన్సీ చెత్తగా మారి పోను న్నది. నల్లధనం గల కుబేరులు ఎవరూ తమకు కలిగిన విప రీతమైన నష్టానికి గుండె పగిలి చనిపోయినట్టుగా మనం ఇంతవరకు వినలేదు. బహుశా వారి ఆందోళన అంతా ఇప్పుడు నల్ల ధనం గురించి గాక, నల్ల సంపద గురించే అయి ఉంటుంది. అవి రెండూ విభిన్నమైనవి. నల్ల సంపద బినామీల పేర్ల మీద ఉంటుంది. మొత్తం నల్ల సంపదలో నల్లధనం ఒక చిన్న భాగం మాత్రమే. తేలు కుట్టిన దొంగ పోలికతో మా అమ్మమ్మ ఈ విష యాన్ని వివరిస్తుండేది. అంతా నిద్రిస్తుండగా మీ ఇంట్లోకి జొరబడ్డ దొంగ తేలు కుడితే అరవలేడు. చడీచప్పుడు లేకుండా జారుకుని, విషానికి విరుగుడు మందు కోసం వెతుక్కుంటాడు. అంతేగానీ తేలును చంపాలని అనుకోడు. అది ఇంటి యజమాని తలనొప్పి. నష్టపోయిన వారికి పోగొట్టుకున్నదాన్ని త్వరలోనే తిరిగి సాధించుకోగలమనే ఆత్మవిశ్వాసం ఇప్పటికే ఏర్పడింది. అసలు పెద్ద నోట్ల రద్దు సమస్యే లేనట్టుగా ఇప్పుడు వారి బాధంతా అదనంగా మరో విధమైన దాడి అంటే నల్ల సంపదపై దాడి కూడా జరిగితే ఎలా? అనేదే. చట్ట విరుద్ధ సంపాదనపై దురాశ ఇప్పటికే మన జీవితాల్లో, సంస్కృతిలో భాగమైంది. లాభం కలుగుతుందంటే అడ్డదారులు తొక్కడం నేటి బహిరంగ జీవితపు ప్రామాణిక లక్షణంగా మారింది. ప్రైవేటు కార్పొ రేషన్లు అవినీతికి ఆజ్యం పోస్తాయి. కాబట్టి అవి అందుకు మినహాయింపు కావు. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గనున్నం దున ఆ రంగంలో ఈ అక్రమార్జనను పెట్టుబడులుగా పెట్ట డానికి అవకాశాలు కూడా ఉంటాయి. మహారాష్ట్రలో ఒక అధికారి పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చడానికి రూ. 50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ కేసు అక్రమ సంపదలను పోగే సుకున్న యజమానులకు మంచి ఉదాహరణ. అలాంటి వారు డిసెంబర్ చివరికల్లా నల్లధనాన్ని తెల్లదిగా మార్చు కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జోరుగా పనిచేస్తున్న మార్గా లను అతడు ఉపయోగించుకోవాలని చూస్తాడు. ఇందులో కీలక పాత్రధాని అవినీతిపరుడైన అధికారే. లంచం ఇచ్చే వ్యక్తి పన్ను అధికారుల కంట పడకుండా ఎలాగైనా పాత నోట్లను వదుల్చుకోవాలని మహా తొంద రతో ఉంటాడు. త్వరగా ఈ పని పూర్తి చేసేసుకోవాలని ఆదుర్దాతో ఉంటాడు. బహుశా అందువల్లనే నేరుగా ఏసీబీ పన్నిన వలలోకి వెళ్లి ఉండాలి. ఈ సందర్భంలో లంచం ఇవ్వజూపిన వ్యక్తి నిజాయితీపరుడైనా కావాలి లేదా అతని వద్ద పాత నోట్లు సిద్ధంగా లేకపోౖయెనా ఉండాలి. అయితే అలాంటి నిజాయితీ పరులైన అధికారుల అవసరం ఇప్పడు చాలా ఉంది. నల్ల డబ్బు ఉన్నవారి ఆశంతా ఇప్పుడు ఖాతాలను తారు మారు చేసి, తక్కువ జరిమానాలతో తప్పించుకోగల వ్యవస్థపైనే. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు డబ్బును మార్చే వారికి మార్గంగా మారాయని ఇప్పటికే మనకు తెలుసు. పద్దులను సరిచూసే దురాశపరులైన పర్యవేక్షణాధికారులు నల్లధనాన్ని ఆర్జించడానికి ఇది తాజా దారిగా మారి పూర్తి కొత్త నోట్లతో కొత్త నల్లధన వలయాన్ని ప్రారంభిస్తుంది. ధరలు పడిపోవడానికి అవకాశమున్న రియల్ ఎస్టేట్ రంగంలో దాన్ని పెట్టుబడిగా పెట్టుకునే అవకాశాలూ ఉంటాయి. పెద్ద నోట్ల రద్దు నల్ల ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బే అయినా అవినీతి అనే రుగ్మతను అంతంచేసేదేమీ కాదు. విచక్షణాధికారాలున్న వ్యక్తి దురాశ, వ్యక్తిగత లాభం కోసం వ్యవస్థను ఇష్టానుసారం మలచడానికి ఇష్టపడటం. అవ సరమైతే అందుకు తోడ్పడే వారితో దాన్ని పంచుకోవడానికి సిద్ధపడటం అనేవి ఎంత లోతుగా వెళ్లూనుకున్నాయంటే ఆ భూతం అంత తేలికగా అంత మయ్యేదికాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అంతే లేని కఠోర కర్తవ్యం. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపుర్కర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
‘మద్యం’తో ఫుట్ బాల్ క్రీడ
విశ్లేషణ బిహార్‌లో మద్య నిషేధం విధించిన నితీష్, ఎన్టీఆర్‌లా తాగుడు సామాజిక పర్య వసానాలకు, ప్రభుత్వ నిధులకు మధ్య సమతూకం సాధించారు. సమర్థ పాలనకు మద్యం రాబడులు కావాలనేవారు ఆ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్య విధానం తలకిందులు అవుతుండటం పరిపాటిగానే సాగింది. 1993లో సారా నిషే« ధాన్ని, 1995లో సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు. మద్యం ద్వారా వచ్చే పన్నుల రాబడిలో నష్టాన్ని కారణంగా చూపి 1997లో దాన్ని సడలిం చారు. ఇటీవల బిహార్ మద్య నిషేధాన్ని విధించగా, కోర్టులు దాన్ని కొట్టేశాయి. దీంతో మరో కొత్త చట్టంతో ఆ రాష్ట్రం తిరిగి నిషేధాన్ని విధించింది. చూడబోతే మద్య నిషేధం ఫుట్ బాల్ ఆటలా మారినట్టుంది. తమిళనాడులో మద్య నిషేధం అప్పుడప్పుడు అమల్లోకి రావడం, ఎత్తివేయడం జరిగింది. మద్యం దుకాణాల సంఖ్యను, అమ్మే సమయాన్ని తగ్గించడం ద్వారా ఇప్పుడు అది తిరిగి ఆ దిశగానే సాగుతోంది. మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్నప్పటి నుంచి ఆ రాష్ట్రంలో మద్య నిషేధ వారసత్వం ఉంది. మొదటిసారిగా 1971లో దాన్ని సడలించి, 1974లో బిగుతుగా బిగించే శారు. 1981లో మొత్తంగానే ఎత్తేశారు. ఎప్పటికప్పుడు దేశవాళీ మద్యాన్ని అనుమతించడం, నిషేధించడం జరు గుతోంది. నేడు అన్ని పార్టీలూ నిషేధానికి కట్టుబడి ఉన్నామని వాగ్దానం చేస్తున్నాయి. అయితే నిషేధాన్ని అమలు చేయడం ఎలాగనే విషయంలో భిన్నాభిప్రాయా లతో ఉన్నాయి. మహారాష్ట్రలో అధికారికంగా నిషేధం ఊసులేకున్నా, అది కూడా ఆ బాటలోనే సాగుతోంది. అక్కడ మొరార్జీ దేశాయ్ హయాం నుంచి మద్యం తాగడానికి ఎవరికైనా అనుమతి (పర్మిట్) ఉండాలి. నిత్య వ్యవహారంలో ఈ అనుమతి ఒక పరిహాసోక్తిగా మారింది. మందు పుచ్చు కోవాలంటే ఆరోగ్యపరమైన కారణాలను చూపాలి. అయితే రెస్టారెంట్లు ఇప్పుడు యథేచ్ఛగా మందును అందిస్తున్నాయి. మద్య నిషేధ సరళీకరణ విధానాన్ని ప్రకటించాక నెలకు సరిపడా మద్యాన్ని ఇంట్లో నిల్వ చేసుకోవడాన్ని అనుమతించారు. ఇప్పుడు దాన్ని తిరగదోడి రెండు ‘యూనిట్ల’కు పరిమితం చేశారు. యూనిట్ అంటే 40 శాతం శుద్ధ ఆల్కహాల్‌ను కలిగిన ఒక బాటిల్ మద్యం అని అర్థం. ఈ విన్యాసానికి కారణమేమిటో వివరించ లేదు గానీ బహుశా అన్నా హజారే ప్రభావం కావాలి. మునుపటి నిబంధన ప్రకారం నెలకు 48 బీరు సీసాలను (650 ఎమ్ఎల్) లేదా 16 వైన్ సీసాలను(750 ఎమ్ఎల్) లేదా 16 ఆల్కహాల్ సీసాలను (750 ఎమ్ఎల్) ఇంట్లో ఉంచుకోవచ్చు. పర్మిట్ ఉన్నవారు మొత్తం శుద్ధ ఆల్క హాల్ 12 యూనిట్లకు మించకుండా ఈ మూడు రకాల మద్యాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఎక్సైజు పన్నుల రూపంలో రూ. 13,500 కోట్లు, వ్యాట్ రూపంలో మరో రూ. 8,000 కోట్లు గత ఏడాది మద్యం వ్యాపారం నుంచి రాబడి లభించింది. కాబట్టి ఇప్పటికే భారీ రుణ భారాన్ని మోస్తూ, కార్లపై విధించే టోల్‌ను కాంట్రాక్టర్లకు తిరిగి చెల్లిస్తున్న రాష్ట్రం మద్య నిషేధం విధించనున్నదని ఊహించడమూ కష్టమే. మద్య నిషేధం ఎత్తివేతకు చంద్రబాబు చూపిన ఆర్థిక సహేతుకత గుర్తుందా? చివ రకు ఇది ప్రభుత్వ ఖజానాలోని నగదుగా తేలుతుంది. ఉదాహరణకు, నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ కఠోర నిబంధనలతో కూడిన మద్య నిషేధం కోసం పట్టుబట్టడం సాహసోపేతమైన చర్యే. రూ. 4,000 కోట్ల వార్షిక రాబడి నష్టాన్ని అది పరిగణనలోకి తీసుకుంది. ఎన్టీఆర్లాగే నితీష్ కూడా నిర్లక్ష్యంగా మద్యాన్ని సేవించడం వల్ల కలిగే సామాజిక పర్యవసా నాలకు, ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమయ్యే నిధు లకు మధ్య సమతూకం పాటించారు. ప్రభుత్వాలను సమర్థంగా నడపడానికి అవసరమయ్యే రాబడులకు వనరుగా మద్యాన్ని చూపే ప్రభుత్వాలు ప్రతి రూపా యిని లెక్క చూసి జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నాయా? మద్య నిషేధం అమలు సులువైనదేమీ కాదు. మహాత్మాగాంధీ పేరు చెప్పుకునే గుజరాత్లో సైతం అది కష్టమే. చుట్టూ మద్యాన్ని వినియోగించే రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలుండగా నిషే ధాన్ని అమలు చేయడం సాధారణ విషయమేమీ కాదు. మహా అయితే వీధుల్లో ఊగుతూ, తూలుతూ పోయే వారు కనబడని నగరాలు మాత్రమే అందుకు మినహా యింపు అవుతాయి. ఎక్కడ దొరుకుద్దో తెలుసుకోవాలే గానీ... గడగడా సీసాలు ఖాళీ చేయడం సాధ్యమే. లాంఛనంగా సమావేశాలకు వచ్చే ప్రతినిధులకు ఆనం దం కలిగించడం కోసం మద్య నిషేధానికి స్వల్పమైన సడలింపు కూడా ఉంది. మద్య నిషేధం ఉన్నా, లేకున్నా అక్రమ మద్యం సమస్య మాత్రం ఆందోళనకరమైనదే. భారీ ప్రాణ నష్టా నికి దారి తీసే మద్యం కల్తీ కారణంగా అది మనం ఊహించగలిగిన దానికంటే ప్రమాదకరమైనది. తమ వ్యాపారానికి దెబ్బ అని మద్యం వ్యాపారులు అక్రమ మద్యాన్ని పట్టించుకునేంత కంటే కూడా తక్కువగానే ప్రభుత్వాలు ఈ సమస్య పట్ల పట్టింపును చూపుతాయి. దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో సారా కాంట్రాక్టర్లు ప్రభుత్వ అనధికార ప్రతినిధులుగా నాటు సారా బట్టీ లపై దాడులు చేయడమూ, అధికారులు వాటిని అధి కారికమైనవిగా చేయడానికి కాగితాలపై సంతకాలు చేయడమూ నాకు గుర్తుంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపర్కర్ ఈ–మెయిల్: mvijapurkar@gmail.com -
భక్తి తప్ప మిగతా అన్నీ...
విశ్లేషణ నేటి గణపతి ఉత్సవాల్లో మతం తక్కువ తుళ్లింతలు కేరింతలు ఎక్కువ. ఇవి తిలక్ భావనను పూర్తిగా భ్రష్టుపట్టించినవి. మతం పేరిట రోడ్ల దురాక్రమణలను అరికట్టే ప్రత్యామ్నాయంగా మైదానాలు, హాళ్లు ఉపయోగపడతాయి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రజలను సమీకరించడం కోసం సార్వజనిక గణేశ ఉత్స వాలు నిర్వహించి బహిరంగ ప్రార్థనలు, ఉత్సవాలను జర పడం ప్రారంభించినప్పుడు బ్రిటి ష్వారు దానిపై నిషేధం విధించ లేదు. మొదటిసారి ఆయన రెండు అడుగుల ఎత్తున్న చిన్న విగ్ర హంతో వించుర్కర్ వాడలోని ఒక ఇంటి ఆవరణలోనే వాటిని నిర్వహించారు. తరువాత వాటిని ఆయన తనుండే కేసరివాడకు మార్చారు. అక్కడ ఆ ఉత్సవాలు నేటికీ కొన సాగుతున్నాయి. తిలక్ ప్రారంభించిన తర్వాత రెండేళ్లకు ముంబైలోని కేశవ్జీనాయక్ చాల్లో మొదటిసారిగా బహిరంగ సార్వత్రిక గణేశ ఉత్సవాలను నిర్వహించారు. అయితే అది కూడా రోడ్డు పక్కనో లేదా రోడ్లులోని ఒక భాగాన్ని మొత్తంగా మూసేసో నిర్వహించలేదు (రోడ్లను మూసేసి ఈ ఉత్సవా లను నిర్వహించడం మహారాష్ట్రకే పరిమితం కాదు). ఆ విగ్రహం కూడా కేసరివాడలో వలే చిన్నదే. గత మూడు దశా బ్దాలలో ఈ బహిరంగ ఉత్సవాల నిర్వహణ చాలా ప్రాంతా లకు... అక్షరాలా పాటలు, డాన్సులతో సహా విస్తరించింది. ఉత్సవాలు ప్రారంభం కావడానికి ఇంకా మూడు వారాలుంది. విగ్రహాలు, పందిళ్లకు సన్నాహాలు, పందిళ్లు వేయడానికి అనుమతులు లేదా పౌర పాలనా సంస్థల నుంచి ఎలాంటి అనుమతులూ లేకుండానే జరుపుకోడానికి సంబంధించిన ఆదేశాల గురించే అంతా మాట్లాడుకుంటు న్నారు. నియంత్రితమైన ఈ అరాచకానికి సంబంధించిన ఆదేశాల ఉల్లంఘనలకు గత ఏడాది జరిమానాలు విధించారు. పౌర పరిపాలనా సంస్థలు నిస్సహాయమైన రోడ్లను లక్ష్యం చేసుకున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పట్టణాలు, నగరాల లోని రోడ్లు సిగ్గుపడాల్సినవిగానే ఉన్నాయి. వ్యోమగాములు వీటినిచూస్తే పెద్ద చంద్ర బిలాలని అనుకోవచ్చున నే వాడుకలో ఉన్న నానుడి అర్థం చేసుకోదగినదే. పట్టణ ప్రాంతాల్లోని సందులు గొందుల్లోని గోతుల వల్ల తెచ్చేట ప్పుడు, నిమజ్జనానికి తరలించేటప్పుడు విగ్రహాలకు ఏ హాని జరుగుతుందోనని ఉత్సవ నిర్వాహకులకు భయం. రోడ్లను సక్రమంగా సరిదిద్దమని ఉత్సవ నిర్వాహకుల సమాఖ్య పౌర పరిపాలనా సంస్థలకు హెచ్చరికను జారీ చేసింది. అలాగేనని అవి వాగ్దానం చేయనూ చేశాయి, తమకు చేతనైనంత బాగా రోడ్ల మీద గోతులను పూడ్చడమూ చేశాయి. అనివార్యంగా వచ్చే వానలే ఆ పనులను ఎంత అధ్వానంగా చేశారో వివరించాయి. రోడ్లలా ఎందుకు అధ్వానంగా మారాయనేదానికి ఎవరివద్దా సమాధానం లేదు. ఆ పనుల ద్వారా దండిగా డబ్బు చేసుకున్న కాంట్రా క్టర్లూ, పౌర పరిపాలనా సంస్థలలో వారితో కుమ్మక్కయిన వారూ లోలోపలే నవ్వుకుంటూ ఉంటారు. రోడ్ల దుస్థితిపై వెల్లువెత్తే ఆగ్రహం గురించి పౌర పరిపాలనా సంస్థలు కోర్టు ఆదేశాలు వెలువడక ముందే దిద్దుబాటు కృషి చేయాల్సింది. మత స్వేచ్ఛ అంటే సరైన రోడ్లు, పందిళ్లు దురాక్రమణలోని ఫుట్‌పాత్‌ల వంటి మౌలిక సదుపాయాలను పౌరులకు నిరాకరించడం కాదని బొంబాయి హెకోర్టు ఉత్తర్వులను జారీ చేయడంతో ఈసారి పౌర పరిపాలనా సంస్థలు ఆ పనిని చేపట్టాల్సి వచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే, పౌరులకు ఇబ్బంది కలిగించే గణపతి, ఉట్లు కొట్టడం(గోకులాష్టమి), దేవీనవరాత్రి వంటి బహిరంగ మత కార్యక్రమాలను రోడ్ల మీద జరపకుండా ఉండాలని, ఇలాంటివి తగ్గేలా చూడాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ముస్లింలను ప్రార్థనకు ఆహ్వానించే ఆజాన్‌ను లౌడ్ స్పీకర్ల ద్వారానే జరపాలనే మత నిబంధన ఏదీ లేదని కూడా అది చెప్పింది. ఇవి కేవలం ముఖ్యమైనవి మాత్రమే కాదు, మైలురాళ్ల వంటి న్యాయ ప్రకటనలు. అయితే రాజ కీయవేత్తలు అప్పుడే కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా గుస గుసలాడటం మొదలెట్టారు. గణపతిని వారు తిరిగి ప్రాంగణాలలోకి తరలించ డానికి సిద్ధంగా లేరు. ఈ ఉత్సవాల్లో మతం తక్కువ తుళ్లిం తలు, కేరింతలు ఎక్కువ కావడం మాత్రమే ఇందుకు కార ణం కాదు. నాకు తెలిసి నామ మాత్రపు పూజ తదుపరి మహిళల క్యాట్‌వాక్ (ఫ్యాషన్ షో)ను నిర్వహించే పందిరి కనీసం ఒకటుంది! మించి గణపతి పందిళ్లు భారీ రాజ కీయ వేదిక కావడమే వారిగుసగుసలకు కారణం. రాజకీయవే త్తలు వాటికి నిధులను సమకూర్చాలి లేకపోతే చోటామోటా నేతలు తమకున్న తక్కువ పలుకుబడితో చందాలను సేక రిస్తారు. ఇది ఇకెంత మాత్రమూ లోకమాన్య గంగాధర్ తిలక్ భావనీకరించిన, సృష్టించిన వేదిక కాదు. పూర్తిగా దాన్ని భ్రష్టుపట్టించినది. ఆయన రోజులోన్లి వాడల లోపలుండే ఈ పందిళ్లలో బహిరంగంగా విద్యగరపడం సైతం ఉండేది. నేడు అంత పెద్ద ఆవరణలు అందుబాటులో లేవు. రోడ్ల దురాక్రమణలను అరికట్టే ప్రత్యామ్నాయంగా మైదానాలు, హాళ్లు ఉపయోగ పడతాయి. అయితే కాస్త లెక్కలోకి వచ్చే నేతలెవరూ లేదా కావా లని కోరుకునే వారెవరూ, రాజకీయపరమైన ఆశలున్న వారె వరూ, చివరకు స్థానిక స్థాయి చోటా నేతలు సైతం ఉన్న నిబంధనలను ఉల్లంఘించి మరీ ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇది తాము తప్పక చేసి తీరాలని వారు భావిస్తారు. గోకులాష్టమికి ఉట్లుకొట్టడమైనా, దేవీ నవరాత్రులకు నిర్వహించే గర్బా నృత్యగాన వేడుకలైనా అంతే. రివాజుగా సాగే ఈ వ్యవహారంలో ఏదైనా లోపించిం దంటే అది ఒక్క భక్తే. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపుర్కార్ ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
నిప్పురవ్వను ఊది మంటచేసి...
విశ్లేషణ రోహిత్ వేముల ఆత్మహత్య... కచ్చితంగా చెప్పాలంటే కదలించే ఆయన ఆత్మహత్య లేఖ... అసమ్మతి నిప్పురవ్వను రగిల్చింది. మితవాద పక్షం మూర్ఖంగా కన్హయ్య నాలుకకు, తలకు వెలలను ప్రకటించి ఆ నిప్పురవ్వను ఊది మంటగా ఎగదోసింది. దానంతట అదిగానే సద్దుమణిగిపోయే సమస్యను నిద్రలేపింది. కన్హయ్య కుమార్, నికార్సయిన జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్థి. ఆలో చనాపరుడు, లోతైన పరిశీలన గలవాడు, ధైర్యవంతుడు, సుస్పష్టంగా తన భావాలను వ్యక్తపరచగలవాడు. రారమ్మని పిలుస్తున్న కొత్త వృత్తి రాజ కీయాలకు బదిలీ అయితే తప్ప, ఆయనకు పీహెచ్డీ ఎలాగూ వస్తుంది. బెయిల్‌పై విడుదలయ్యాక ఆయన చేసిన ఉపన్యాసం ఉత్తేజకరమైనది. ఆయన తన వైఖరిని సుస్పష్టంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హృదయం, మేధస్సు కూడా రాజద్రోహంపైనే లగ్నమై ఉన్నాయి. రాజ్యాంగాన్ని ఆమోదించి మనం సాధించుకున్న స్వేచ్ఛలను, గౌరవాన్ని ఆయన కోరుతున్నారు. మితవాదానికి ఆయన బద్ధవ్యతిరేకి. నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్, పెట్టుబడిదారీ విధానం అంటూ ఆ శక్తులనూ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమయ్యారు. ఆర్థికవ్యవస్థకు సెన్సెక్స్లా, సోషల్ మీడియా కూడా ఒక విధమైన ప్రతిస్పందనా సూచిక. అయితే ఇవి రెండూ కిందా మీదా చేయగలిగినవే, చేస్తు న్నారు కూడా. మొదట ఉద్దేశపూర్వకంగా ఏదైనా రెచ్చ గొట్టే వ్యాఖ్యను చేసి, ఆ తర్వాత ఏదో ఒక సాకుతో దానికి అనుకూలంగా, ప్రతికూలంగా చర్చను రేకెత్తించవచ్చు. కన్హయ్య, సాధారణంగా కంటే కొన్నేళ్లు ఎక్కువే జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నారు. కాబట్టి ఆయన విద్యార్థి మాత్రమేనా లేక ఇంకా మరేదైనా కూడా అయి ఉండి, ఆ విద్యా సంస్థలో తలదాచుకున్నారా? అనే ప్రశ్నలు రేగు తున్నాయి. వాటిని పట్టించుకోనవసరం లేదు. విద్య నేర్వడం ఎప్పుడూ ఒకే పద్ధతిలో నడవాలనేం లేదు. వివిధ టీవీ చానళ్లకు ఆయన తన గురించి తెలిపిన దాని ప్రకారం... అతను ‘రాజకీయ కార్యకర్త’, ‘విద్యార్థి నేత’, ఆసక్తికరంగా ‘కమ్యూనిస్టుల అధికారిక ప్రతినిధి కాదు.’ బతికి బట్టకట్టడం కోసం ఆయాసపడుతున్న వామపక్షాలకు ఆయన ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి కొన్నేళ్లపాటూ జాగ్రత్తగా గమనించాల్సిన వ్యక్తి. విస్పష్టంగా మాట్లాడటంలోనూ, భావాలలోనూ నరేంద్ర మోదీకి సరిగ్గా దీటుగా నిలవగలవాడిగా కన్హయ్యను గుర్తించిన వామపక్ష నేతలు వెంటనే ఆయన రక్షణకు రంగంలోకి దిగారు. వామపక్షాలలోని అతి కొద్దిమంది తప్ప మరెవరూ సాటిరాని విధంగా ఆయన ఆ పనిని చేశారు లేదా ఆయన అద్భుత వాగ్ధాటిని చూస్తే అలా అనిపిస్తోంది. చర్చా వేదకపై గంధకంలా ఘాటుగా అనిపించే ఆయనకు మరో పార్శం కూడా ఉంది. మార్క్ ఆంటోనీ (గొప్ప ప్రభావశీలియైన ఉపన్యాసకునిగా) కన్హయ్య కమార్ వద్ద పోస్టల్ ట్యూషన్ తీసుకోవాలని నాకు తెలిసిన కొందరు వ్యాఖ్యానించారు. వేదిక మీద లేనప్పుడు అతడు తన ఆలోచనలను సుస్పష్టంగా, ప్రశాంతంగా వ్యక్తం చేయగలిగినవారు. అందువల్ల సాధారణ టీవీ వీక్షకులకు అతను చెప్పే విషయాలు తేలికగా అర్థం అవుతాయి. వివిధ వైఖరులను మృదువుగా వ్యక్తం చేయగలిగిన ఆయన స్వరం.. సాధారణంగా ఆధిపత్యం చలాయించే టీవీ యాంకర్లను మెత్తబరచేస్తుంది. ‘చెబుతావా, లేదంటే నీ తల’ అన్నట్టు సాగే ఇంటర్వ్యూను సంప్రదాయక పద్ధతిలో ప్రశ్నలు అడగడంగా మార్చేస్తుంది. అందుకే టీవీ చానళ్లు ఆయన పట్ల చాలా గౌరవం చూపాయి. చూడండి, పరిస్థితులన్నీ మహా అస్తవ్యస్తంగా ఉన్నాయి, వాటితో పోట్లాడతానని అతను అంటున్నాడు అన్నట్టుంటాయి. టీవీల్లో ఆయన చెప్పిన విషయాలన్నిటినీ మళ్లీ చెప్పడానికైతే ఈ కాలం అవసరం లేదు. అయితే ఆయన చెప్పినవాటినీ, చెప్పిన పద్ధతినీ చూస్తే కచ్చితంగా ఆయన రాజకీయాల్లో బాగా రాణించగల వ్యక్తి. ప్రయాణాలు చేసి, అన్ని సెక్షన్ల ప్రజలతో మాట్లాడాలని తన కోరికని ఆయన చెప్పాడు. అయినా, ఆయన ఇంకా నిజంగా రాజకీయాలకు అంకితమైన రాజకీయవేత్త కారు. ఆయన, భారతీయ జనతా పార్టీని, మోదీని ఎదుర్కోవడం మాత్రమే కాదు, యూపీఏ నుంచి బయటకు వచ్చేసి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేతుల్లో ఓడిపోయినప్పటి నుంచి... ఒక దిశంటూ లేకుండా ఉన్న వామపక్షాలకు కేంద్ర రంగ స్థలిపైకి తలుపులు కూడా తెరిచారు. జేఎన్‌యూ, జాధవ్‌పూర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లూ, ఇటీవల అల్హాబాద్ వారికి కొత్త వేదికను కల్పించాయి. కాకపోతే వారు దాన్ని చెడగొట్టుకోకుండా ఉండాలి. విద్యార్థి సంఘాలు, వివిధ వామపక్షాలకు అను బంధ సంస్థలు మాత్రమే. అయితే రోహిత్ వేముల ఆత్మ హత్య... కచ్చితంగా చెప్పాలంటే కదలించే ఆయన ఆత్మ హత్య లేఖ... అసమ్మతి నిప్పురవ్వను రగిల్చింది. మిత వాద పక్షం మూర్ఖంగా కన్హయ్య నాలుకకు, తలకు వెలల ను ప్రకటించి ఆ నిప్పురవ్వను ఊది మంటగా ఎగదో స్తోంది. అసలు మొదట్నించీ వారే.. దానంతట అదిగానే సద్దుమణిగిపోయే సమస్యను నిద్రలేపారు. బూటకపు వీడియోలుగా ఆరోపిస్తున్న వాటిని మితవాద పక్షం సభ్యులు, మద్దతుదార్లు అందించకపోగా ఆయన్ను కొట్టారు, అది చూస్తూ పోలీసులు నిలబడ్డార నేదే లెక్కలోకి వస్తుంది. అత్యంత బలమైన ప్రభుత్వం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా నిలిచిందనే ఆలోచనను సామాన్యునిలో కలుగజేస్తుంది. ఒక విద్యార్థి జాతి వ్యతిరేకి అని రుజువు చేయాలని వారు అంతగా తాపత్రయపడకపోతే... కన్హయ్య బహుశా ఓ కళాశాల నేతగానే మిగిలిపోయేవాడు. అతని ఉపన్యాసం కళాశాల ఉపన్యాసంగానే మిగిలేది. మితవాద పక్షం ఆయన్ను ఒక్కసారిగా ఉన్నత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com