విశ్లేషణ
దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే అతి పెద్ద వంచనకు పాల్పడిన వారితోపాటు, వారు పరారయ్యేందుకు సమాచారం ఇచ్చినవారూ నేరస్తులే. సాధారణ న్యాయ ప్రక్రియకే ఈ సమాచారం తూట్లు పొడిచింది కాబట్టి వీళ్లనూ వదలిపెట్టకూడదు.
మీరు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకేసి మాత్రమే చూసినట్లయితే బ్యాంకు రుణాల ఎగవేతలూ, కుంభకోణాలూ చాలా పెద్దవిగా కనిపిస్తాయి. వీరిలో ఒకరు లండన్ న్యాయస్థానంలో భారత్‌కు తరలింపు అంశంపై విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక రెండో వ్యక్తి విషయంలో భారతీయ న్యాయశాసనాలు అతడిని కనీసం సమీపించగలవా అనే విషయం మనకు తెలీదు. మాల్యా, నీరవ్ మోదీ ఇరువురూ బ్యాంకుల నుంచి కొల్లగొట్టినవి నిజానికి చాలా భారీ మొత్తాలు. అయితే వీరిపై విచారణలు మాత్రం నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే, ఒకరేమో లండన్‌లో స్తంభింపజేసిన తన ఆస్తుల నుంచి కోర్టు ద్వారా ప్రతి వారం రూ. 16 లక్షల జీవన భృతిని పొందుతున్నారు. భారత్‌కు అతని తరలింపు కార్యక్రమం పురోగతిలో ఉంది. ఇక నీరవ్ మోదీపై విచారణ ఏ సమయంలో అయినా మొదలుకావచ్చు.
అత్యంత విలువైన వజ్రాల తయారీదారు అయిన నీరవ్ బెల్జియం పాస్‌పోర్ట్ కలిగివున్నాడని అంచనా. కాబట్టి ద్వంద్వ పౌరసత్వ సమస్యపై అతడిని ఇరికించవచ్చు. మీడియా మాత్రం నీరవ్‌కు విదేశాల్లో ఉన్న అపార్ట్‌మెంట్ల మూసిన తలుపులను మాత్రమే చూపిస్తోంది. గత కొద్దికాలంగా ముంబైలో ఉపయోగంలో లేని అతడి కార్యాలయాల జాబితాను పేర్కొంటోంది. కుంభకోణం వివరాలు వెల్లడవుతున్న సందర్భంలో కూడా అతడు ఎలా దేశం వదలి వెళ్లగలిగాడు?
ఈ రెండు కేసులూ వారు దేశం విడిచి వెళ్లిపోవడానికి లోపల నుంచే ఎవరో సహకరించారన్న అంశాన్ని స్పష్టాతిస్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఈ రెండు ఉదంతాలూ కాకతాళీయంగా జరిగినవి కాదు. కేంద్రప్రభుత్వం లోని అత్యున్నత శాసనాధికారి ఒకరు గత సంవత్సరం సుప్రీంకోర్టుకు వివరణ ఇస్తూ, ’విజయ్ మాల్యా పాస్‌పోర్ట్‌ని స్వాధీనపర్చుకోవడానికి తాము దరఖాస్తు చేయడానికి ప్రయత్నించిన మార్చి 2వ తేదీనే అతడు దేశం విడిచి వెళ్లాడని’ తెలిపారు. అంటే ఎవరో మాల్యాకు ముందస్తు సమాచారం ఇచ్చారు.
ఇక మోదీ వ్యవస్థను దెబ్బకొట్టడమే కాదు.. ఆతడి మామయ్య ముఖుల్ చోక్సీ కూడా తన బ్యాంక్ ఖాతాలో ఏమీ మిగల్చలేదు. ఇంతవరకు వారనుభవించిన కోట్ల సంపదతో పోలిస్తే ఇతడి ఖాతాలో కొన్ని లక్షల రూపాయలు మాత్రమే మిగిలి ఉండటం గమనార్హం. కొన్ని ఖాతాల్లో నయాపైసా కూడా లేదని వార్తలు. స్పష్టమైన ఉద్దేశంతోటే ఈ ఖాతాలను చాపచుట్టేశారని తెలుస్తూంది.
నిఘా సంస్థలు ఈ ఉదంతంపై పరిశోధన చేస్తున్నాయి, ఇప్పటివరకూ రూ.5,000 కోట్ల విలువైన వజ్రాలను, ఆభరణాలను వీరి నుంచి స్వాధీనపర్చుకున్నట్లు ప్రకటించాయి. తమ ఖాతాలను వారు ఖాళీ చేసి ఉన్నట్లయితే, నిఘా సంస్థలు స్వాధీనపర్చుకున్న భారీ నగలను వారు నీటిబుడగల రీతిలో ఎందుకు వదిలేశారు అనేది ప్రశ్న. నీరవ్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తర్వాత అతడు దేశం విడిచి వెళ్లాడంటే అది కచ్చితంగా ఇన్‌సైడర్లు సమాచారం ఇచ్చారని సూచిస్తోంది. మీరు తప్పుడు మార్గాల్లో డబ్బు పోగుచేసి సంపన్నులైనా సరే, మీకు కీలక క్షణాల్లో సహాయం చేయడానికి నిఘా సంస్థల్లోనే ఎవరో ఒకరు సిద్ధంగా ఉంటున్నారని ఇప్పుడు మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎవరికీ తెలియకుండా దేశం వెళ్లిపోవడమన్నదే అనుమానాలను మరింత బలపరుస్తోంది.
ఈ రకమైన నిష్క్రమణలు మొత్తం దర్యాప్తు క్రమాన్నే దెబ్బతీస్తున్నాయి. ఎందుకంటే వారు అందుబాటులో లేరు. ఆలా కానట్లయితే, వారు నిఘా సంస్థలకు సులువుగా దొరికేవారు. లేదా వారిని కనీసం కస్టడీలో అయినా ఉంచేవారు. సాక్షులు తాము ఇచ్చిన సాక్ష్యాలనే మార్చివేస్తుండటంతో భారత్‌లో నేర విచారణ చాలాకాలం తీసుకుంటోంది. మొత్తం మీద చెప్పాలంటే సీబీఐ మహర్షుల సంస్థ రకానికి చెందినది కాదు. ఈ మోసాలు ఎలా జరిగాయన్నది దర్యాప్తులో తేలవలసిన అంశం. కానీ మనం సాధారణంగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది ఏమిటంటే, అత్యున్నత స్థాయిలోని ప్రముఖులు దేశం విడిచి పారిపోయేలా సమాచారం ఇస్తున్నదెవరు అనే అంశమే. లండన్‌లోనో లేక న్యూయార్క్ లేక ఆంట్‌వెర్ప్ లోనో ఇలాంటి మోసగాళ్ల నేరాలను విచారించడం విభిన్నమైన అంశం కాబట్టి వీరి పరారీ మొత్తం విచారణను మరొక అననుకూల స్థాయికి తీసుకెళుతోంది. తప్పుడు అవగాహనా పత్రాలను ఉపయోగించుకునేవారు, పేలవమైన వ్యవస్థ ఒక అంశమైతే, చట్టం కోరలనుంచి వారు తప్పించుకుపోయేలా సహా యం చేస్తున్నదెవరు అనేది మరొక అంశం. ఈ విషయాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా ఇలాంటి, లోపలనుంచి సమాచారం ఇచ్చేవారు ఎన్నటికీ దొరకరని నేను పందెమొడ్డుతాను. ఇక వీరిని శిక్షించటం అనేదాన్ని వదలేయండి.
ఏ స్థాయి నుంచి నీరవ్‌కి సమాచారం అంది ఉంటుంది? తనపై ఎఫ్‌ఐఆర్ టైప్ చేసిన క్లర్క్ పనా లేక మరొక అత్యున్నత అధికారి పనా? భారతీయ బ్యాంకింగ్ చరిత్రలోనే అతి పెద్ద వంచనకు పాల్పడిన వారితో పాటు వారు దేశం విడిచి వెళ్లేలా సమాచారం అందించిన వారు కూడా నేరస్తులే. సాధారణ న్యాయ ప్రక్రియకే వీరందించిన సమాచారం తూట్లు పొడిచింది కాబట్టి వీళ్లను అసలు వదలిపెట్టకూడదు.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
మహేశ్ విజాపుర్కర్
Comments
Please login to add a commentAdd a comment