
ఆయన మృతి.. వెంటాడే స్మృతి
డేట్‌లైన్ హైదరాబాద్
ఎన్టీఆర్ చనిపోయినప్పుడు అంత హడావుడి చేసిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఆ తరువాత ఆయనను పూజించారా? ఎన్టీఆర్ ఫొటోలు ఎక్కడా కనిపించకుండా కొంతకాలం పాటు జాగ్రత్తపడ్డ విషయం రేవంత్‌కు తెలియక పోవచ్చు. ఆయన ఫొటోలు సచివాల యంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాత సామాను గదుల్లో, పనికిరాని వస్తువుల మధ్యనా, విరిగిన కుర్చీలు, బల్లల మధ్యన చాలా రోజులు పడి ఉన్న విషయం పత్రికలు ఫొటోలతో సహా ప్రచురించిన విషయం కూడా రేవంత్‌కు తెలియకపోవచ్చు.
జనవరి 18, 1996. సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ల క్రితం ఇదేరోజు తెల్లవారు జామున ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి్తతే అవతల ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు దగ్గర ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న విజయ్‌కుమార్. ఆందోళన ధ్వనించే గొంతుతో ‘‘బాసూ! ఎన్టీ రామారావు గారు చనిపోయారు, వెంటనే బయలుదేరి ఆయన ఇంటికి రాగలవా!’’ బతి మాలుతున్నట్టు అడిగాడు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చనిపోయిన వార్త ఆయన శత్రు శిబిరం నుంచి రావడం ఏంటి అని ఒక్కక్షణం సందేహం వచ్చింది. నమ్మశక్యంగా లేదు. అంతకుముందు సాయంత్రమే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌కు నేనూ వెళ్లాను. ఆరోగ్యంగా కనిపించారు. వెన్నుపోటు పొడిచి తన నుంచి∙అధికారం లాక్కున్న చంద్రబాబు మీద మరోసారి విరుచుకు పడ్డారు. రాత్రికి రాత్రి ఏం జరిగి ఉంటుంది? ఆలోచనల్లో ఉండగానే విజయ్ కుమార్ మళ్లీ ‘‘బాసూ! సీఎం బయలుదేరి వెళ్లారు, ఎన్టీఆర్ ఇంటికి. అక్కడ ఏం జరుగుతుందో ఏమో, సీనియర్ జర్నలిస్టులంతా ఉంటే మంచిది’’ అన్నాడు. నాకు అర్థమైంది. ఎన్టీఆర్ చనిపోయాడని తెలిస్తే ఆయన అభిమానులు అక్కడికి చేరుకుంటారు.
కొద్దిమాసాల క్రితమే తమ అభిమాన నేత నుంచి అధికారం లాక్కున్నాడన్న ఆగ్రహంతో చంద్రబాబును అడ్డుకోవచ్చు. దాడి కూడా చేయొచ్చు. పరిస్థితి తప్పకుండా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. వెంటనే స్కూటర్ వేసుకుని బంజారాహిల్స్‌లో ఆయన ఇంటికి వెళ్లాను. అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడికి చేరుకో వడం, ఎన్టీఆర్ మాత్రమే కూర్చునే సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకునే పనిలో పడటం కనిపించింది. బంజా రాహిల్స్ ఇంటి నుంచి ఆయన మృతదేహాన్ని ఫతేహ్ మైదాన్ స్టేడియంకు తరలించే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశారు. ఒకరొకరు మీడియా వాళ్లు కూడా అక్కడికి చేరుకున్నారు. సమయం గడుస్తూ ఉంటే సందర్శకులు కూడా పెరుగుతారు. మృతదేహం అక్కడే ఉంటే పరిస్థితి తమ అదుపులో లేకుండా పోయే అవకాశం ఉంది, కాబట్టి అక్కడి నుంచి తరలిస్తే వ్యవహారం ప్రభుత్వ అదుపులోకి వస్తుందనేది చంద్రబాబు ఆలోచన. బంజారాహిల్స్ ఇల్లు అప్ప టికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి అధీనంలో ఉంది కాబట్టి ఆమె దగ్గరి నుంచి ఆయన lమృతదేహాన్ని దూరం చేసేందుకు, తరువాత జరిగే తంతులో ఆమె పాత్ర లేకుండా జాగ్రత్త పడేందుకు చేసిన ఆలోచన అది.
దృశ్యమానమైన శవ రాజకీయాలు
శవ రాజకీయాలు అంటుంటాం. అవి ఎట్లా ఉంటాయో ఎన్టీ రామారావు మృతి సందర్భంగా కళ్లారా చూశాం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఇంకా అక్కడికి చేరుకోక ముందే ఆయన పార్థివ దేహాన్ని ఫతేహ్ మైదాన్‌లో లాల్ బహదూర్ స్టేడియంకు తరలించేశారు. విదేశీ పర్యటనలో ఉన్న అప్పటి రవాణ శాఖ మంత్రి, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ హుటాహుటిన తిరిగొ చ్చిన క్షణం నుంచి లక్ష్మీపార్వతిని దూరం పెట్టారు. ఆ మరునాడు నెక్లెస్ రోడ్‌లో ఆయన అంత్యక్రియలు జరిపిన చోటు వరకూ సాగిన ఊరేగింపులో కూడా లక్ష్మీపార్వతిని ప్రధాన వాహనం మీదకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఆ కార్యక్రమం వరకు ఎన్టీఆర్ వారసులం తామే అని ప్రదర్శించు కునే విషయంలో చంద్రబాబు వ్యూహం విజయవంతమైంది. 1995 ఆగస్ట్‌లో వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించిన వాళ్లే ఆయన భౌతికకాయం దగ్గర హడావుడి చేసి, అంతిమయాత్రలో అగ్రభాగాన నిలవడం పెద్ద విషాదం.
అడగవలసిన వాళ్లను అడగొచ్చు కదా!
21 సంవత్సరాల తరువాత ఈ వర్ధంతి రోజున ఆనాటి విషయాలు జ్ఞాపకం చేసుకోవడం ఎందుకూ అంటే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాధ్యక్షుడు, శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రకటన అందుకు కారణం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా జరపా లని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్ కాబట్టి అధికారికంగా ఈ వేడుకలు జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్. అంతేకాదు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కూడా ఆయన కోరారు. ఇవి జరగకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కేంద్రానికి ఏమని ఫిర్యాదు చేస్తారు?
తెలంగాణ ప్రభుత్వం మీద కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోగలుగుతుంది ఈ విషయంలో? ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి అధికారికంగా జరపండి అని తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్రం హుకుం జారీ చేస్తుందా? విమానాశ్రయం టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉందా? ఆ పని కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి, మళ్లీ మాట్లాడితే కేంద్రంలోని విమానయాన శాఖ చెయ్యాలి. విమాన యాన శాఖకు మంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్ల మెంట్ సభ్యుడు అశోక్ గజపతిరాజు చెయ్యాలి. రెండున్నర ఏళ్లుగా కేంద్రంలో ఆ శాఖను నిర్వహిస్తున్న అశోక్ గజపతిరాజు కానీ, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ స్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కానీ ఈ విషయంలో ఎటువంటి ప్రయత్నమూ ఎందుకు చెయ్యలేదు? అన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి.
పార్లమెంట్‌లో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయించే విష యంలో జరిగిన రాజకీయాలు మన కళ్ల ముందు కనిపిస్తుంటే దేశీయ టెర్మి నల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టడం గురించి దానితో సంబంధం లేని వాళ్లను రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నట్టు వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉంది.
అజ్ఞాతంలో అన్నగారి ఫొటోలు
ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు అంత హడావుడి చేసిన చంద్రబాబు నాయుడు, ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఆ తరువాత ఆయ నను పూజించారా? ఎన్టీఆర్ ఫొటోలు ఎక్కడా కనిపించకుండా కొంతకాలం పాటు జాగ్రత్తపడ్డ విషయం రేవంత్‌కు తెలియక పోవచ్చు. ఆయన ఫొటోలు సచివాలయంలో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాత సామాను గదుల్లో, పనికిరానిæ వస్తువుల మధ్యనా, విరిగిపోయిన కుర్చీలు, బల్లల మధ్యన చాలా రోజులు పడి ఉన్న విషయం పత్రికలు ఫొటోలతో సహా ప్రచురించిన విషయం కూడా రేవంత్‌కు తెలియకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాల మీదా ఎన్టీఆర్ బొమ్మను తొలగించినందుకు ఎన్నికల ముందు హరికృష్ణ అలిగితే, మళ్లీ ఆయన బొమ్మలు ప్రత్యక్షమైన విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలియక పోవచ్చు, ఎందుకంటే ఆ సమ యంలో ఆయన తెలుగుదేశంలో లేరు. ఆ తరువాత పన్నెండు సంవత్స రాలకు ఆయన తెలుగుదేశం తరఫున 2009 లో మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. అంతకు ముందు మిడ్జెల్ నుంచి జెడ్‌పీటీసీగా, ఆ తరువాత ఎమ్మెల్సీగా స్వతంత్రంగానే గెలిచారు.
ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటే చాలు
ఎన్టీ రామారావు పార్టీ పెట్టింది 1982లో. అప్పటికి రేవంత్ రెడ్డి 13 ఏళ్ళ పసి వాడు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజా ప్రతినిధి అయింది మాత్రం 2009లో. అంటే ఎన్టీ రామారావు చనిపోయిన 13 సంవత్సరాల తరువాత. రామారావు విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తేనో, ఏటేటా అధికారి కంగా జయంతులూ, వర్ధంతులూ చేస్తేనో ఆయనను గౌరవించినట్టు కాదు. సమావేశాలు జరిగినప్పుడు ఆయన విగ్రహానికి ఒక పూలదండ వేసి నమ స్కారం పడేస్తే , ఏవో కొన్ని పథకాలకు ఆయన పేరు తగిలించేస్తే కూడా ఆయనను గౌరవించినట్టు కాదు. ఎన్టీ రామారావు రాజకీయాలు నీతిమం తంగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి, ఆయన బాస్ చంద్రబాబునాయుడు ఆ విషయంలో పార్టీ వ్యవస్థాపక నేత ఎన్టీఆర్‌ను అనుసరిస్తే అదే ఆయనకు ఇచ్చే పెద్ద గౌరవం అనిపించుకుంటుంది. (నేడు ఎన్టీ రామారావు 20వ వర్ధంతి)
దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com